చిగురంత ఆశ..

11 Oct, 2015 23:31 IST|Sakshi
చిగురంత ఆశ..

‘యారాడ గిరుల శిఖను చేరి..కనులు విప్పారి చూస్తే నా విశాఖలో నాకు ఒక్కొక్కరోజు ఒక్కొక్క అందం కనిపిసుంది...’’ అంటూ శ్రీశ్రీ కొనియాడిన పచ్చని విశాఖలో...
 
 సరిగ్గా ఏడాది క్రితం...
  ప్రళయం ప్రత్యక్షమైతే..వాయు విలయం విరుచుకుపడితే..విధ్వంసం వికటాట్టహాసం చేస్తే..ప్రకృతి ‘అల’కల్లోలంతో ప్రకోపిస్తే..భయం ఓ రూపం దిద్దుకుంటే..వినాశనం కట్టెదుటే కరాళ నృత్యం చేస్తే..రాకా‘సీ’ గర్జిస్తే..పెను ఉప్పెన మీదకురికితే..జలఖడ్గం కోలుకోలేని దాడిచేస్తే . .క్షణం క్షణం చివురుటాకులా వణికితే.. చూస్తుండగా ఊరంతా అతలాకుతలమైతే..జనజీవనం అస్తవ్యస్తమైతే....వేలఏళ్ల వృక్షాలు వేళ్లతో సహా నేలకూలితే..చుట్టూ అంధకారం అలుముకుంటే..అడుగు వేయడానికి ఆటంకాలెదురైతే..బిక్కుబిక్కుమంటూప్రాణాలు అరచేతులు పెట్టుకుంటే.. ఎలాగుంటుందో ప్రత్యక్షానుభవమైంది విశాఖకు..

గతేడాది ఇదేరోజున.. ఇవన్నీ చవిచూసింది నగరం. హుద్‌హుద్ సృష్టించిన విధ్వంసానికి విశాఖ విధ్వంసమైంది. అందమైన నగరంగా భాసిల్లిన సిటీ శోకతప్తమైంది. కన్నీటి సంద్రమైంది. బంగాళాఖాతంలో పురుడుపోసుకున్న తుపాను పెనుశాపమై విశాఖను కష్టాల్లోకి ముంచింది. గాఢాంధకారం చుట్టూ అలముకుంది.. మొక్కలు..చెట్లు నేల కూలి పచ్చదనం కనుమరుగైంది..
 
హుద్‌హుద్ తర్వాత సాధారణ స్థితికి చేరుకోడానికి..కష్టాల నుంచి తేరుకోడానికి చాలా సమయం పట్టింది. నష్టాల లెక్కలేసుకుంటే చిట్టా చేంతాడయింది. పరామర్శలు వెల్లువెత్తాయి. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడి 48గంటల్లోగా రావడం కొంత ఊరటనిచ్చింది. వెయ్యి కోట్లతో తాత్కాలికంగా ఆదుకుంటామంటూ ఆయనిచ్చిన భరోసా కొండంత ధైర్యాన్నిచ్చింది.  ముఖ్యమంత్రి చంద్రబాబు వారం రోజులపాటు మకాం వేయడం సంతోషాన్నిచ్చింది. శోక విశాఖ కన్నీళ్లు తుడిచి నిధులతో అభివృద్ధికి కొత్త బాటలేస్తామన్న ఈ నేతల హామీలు మాత్రం సాఫల్యం కాలేదు. వీరి మాటలన్నీ తుపానుకు కొట్టుకుపోయాయి. నగర జీవనాడి మహానగర పాలకసంస్థకు రూ.1270 కోట్లు నష్టం జరిగితే ఏడు కోట్లు విదిల్చిన సర్కారు కపట ప్రేమ ప్రజలను బాధిస్తోంది. వివిధ శాఖలకు తగిలిన గాయాలు మాన్పేందుకు అవసరమైన నిధుల చికిత్సకు మందే కరువైంది. గూడు కోల్పోయిన వారి గోడు అరణ్యరోదనయింది.

లక్షన్నర మందికి నిలువనీడ లేకుండాపోతే కేవలం రెండు వేల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పడం.. అవి కూడా నేటికీ పూర్తికాకపోవడం సర్కారు నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. చిన్నాపెద్దా కలిపి 1877 పరిశ్రమలు తుపాను నష్టాలు నెత్తికెత్తుకోగా ఏమేరకు ఆదుకున్నారో ఏలికలకే ఎరుక. జీవనాధారమైన బోట్లను కోల్పోయిన మత్స్యకారులింకా కష్టాల కడలిలోనే ఎదురీదుతున్నారు. నేటికీ ఆశించిన చేయూత అందనేలేదు.  పెను తుపాను అలజడికి బాధితులంటా ఇప్పటికీ ఆపన్నహస్తం కోసం నిరీక్షణే. చేతికందొచ్చే తరుణంలో ఆరుగాలం శ్రమ ఆవిరైపోయిన అన్నదాతను ఆదుకోడానికి సాంకేతిక సాకులే వెక్కిరిస్తున్నాయి.  హుద్‌హుద్ తాకిడి సర్వం అతలాకుతలమైన సంపదకు మూల్యం కడితే తొమ్మిదివేల కోట్ల రూపాయలని అధికార గణాంకాలే చెబుతుండగా పదోవంతు కూడా నిధులు రాకపోవడం బాధాకరం.
 
ఏడాది తర్వాత వెనక్కి తిరిగి చూస్తే....
 చిగురంత ఆశ కలిగించే అంశమొక్కటే..కన్నెర్ర చేసిన ప్రకృతే మళ్లీ కరుణించింది. పచ్చదనం కనుమరుగైన నగరవనంలో మొక్కలన్నీ చిగురించాయి.  ‘ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది అన్న ఓ రచయిత పాట మాదిరిగా పచ్చదనం పర్చుకుంది. తరలి రాదా తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం.. అన్నట్లుగా హుద్‌హుద్ ధాటికి గల్లంతయిన పచ్చదనం మళ్లీ ప్రత్యక్షమై నగర వాసికి సంతోషాన్నిస్తోంది..
 -సిటీడెస్కు
 

మరిన్ని వార్తలు