మత్స్యకారుల ఖాతాల్లో నేడు 10 వేలు జమ

6 May, 2020 05:17 IST|Sakshi

1,09,231 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం

వేట నిషేధ సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వ సాయం

నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమ

గత టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడూ ఆలస్యమే

సాయం కూడా కేవలం రూ.4 వేలే

సాక్షి, అమరావతి: మత్స్యకారులకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల  సాయాన్ని అందించనుంది. దీంతో మొత్తం 1,09,231 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నగదు జమ చేయనుంది. లాక్‌డౌన్, సముద్రంలో చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది 3 నెలలపాటు మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద అందిస్తున్న సాయం వారిని ఆదుకోనుంది.

సకాలంలో సాయం
మునుపెన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందుతుండటంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేట విరామ సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పెంచిన సంగతి తెలిసిందే. గతేడాది ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున 1,02,380 మందికి  ప్రభుత్వం సాయాన్ని అందించింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు విరామ భృతిని వేట నిషేధ సమయం (ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు)లో ఎప్పుడూ పంపిణీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడో ఓసారి ఆలస్యంగా ఇచ్చేది. అది కూడా కేవలం రూ.4 వేలే కావడం గమనార్హం. లబ్ధిదారుల సంఖ్య కూడా 80 వేలకు మించలేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సాంప్రదాయ పడవలపై వేటను చేపట్టిన వారికీ సాయం అందించడంతో లబ్ధిదారుల సంఖ్య 1.02 లక్షల నుంచి ఏకంగా 1.09 లక్షలకు పైగా పెరిగింది.  

సీఎం సాయాన్ని మత్స్యకారులు ఎప్పటికీ మర్చిపోరు
రాష్ట్రంలోని మత్స్యకారులెవరూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సాయాన్ని మర్చిపోరు. గత టీడీపీ ప్రభుత్వం వేట విరామ సాయం రూ.4 వేలు మాత్రమే ఇచ్చింది. అది కూడా ఎప్పుడు ఇచ్చేదో తెలియని పరిస్థితి. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వేట విరామ సాయాన్ని రూ.10 వేలకు పెంచారు. గతేడాది ప్రపంచ మత్స్యకార దినోత్సవం రోజున ఈ సాయాన్ని అందించాం. ఈ ఏడాది వేట నిషేధ సమయంలోనే సాయం అందిస్తున్నాం. 
– మోపిదేవి వెంకట రమణారావు, రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి

మరిన్ని వార్తలు