పూర్తిగా కోలుకున్న ప్రకాశం జిల్లా 

17 May, 2020 03:25 IST|Sakshi

కరోనా సోకిన వారంతా డిశ్చార్జి..

కేసులు లేని జిల్లాగా రికార్డు 

రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 101 మంది డిశ్చార్జి  

కొత్తగా 48 పాజిటివ్‌లు.. ఇందులో 31 కోయంబేడు కాంటాక్టులే  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తొలి జిల్లాగా ప్రకాశం రికార్డు సృష్టించింది. జిల్లాలో మొత్తం 63 మందికి కరోనా వైరస్‌ సోకింది. అందులో 60 మంది ఇప్పటికే కోలుకోగా మిగిలిన ముగ్గురిని శనివారం డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వైద్య, పోలీసు, వలంటీర్‌ వ్యవస్థ సమన్వయంతో పనిచేసిన ఫలితమే జిల్లాలో జీరో పాజిటివ్‌ వచ్చిందని, ఇందుకు జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ తమ సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమించారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. జిల్లాలో ఒక్క కేసు లేనప్పటికీ లాక్‌డౌన్‌ నిబంధనలు, వైరస్‌ నియంత్రణ పర్యవేక్షణ యథావిధిగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. 

101 మంది డిశ్చార్జి
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 101 మంది డిశ్చార్జి అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,353కు చేరుకుంది. తాజాగా కోలుకున్న వారిలో కర్నూలు జిల్లాలో 47, అనంతపురం 37, కృష్ణా 5, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున ఉన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు డిశ్చార్జి అయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,628 మందికి పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఈ కేసుల్లో 31 తమిళనాడులోని కోయంబేడుకు వెళ్లివచ్చినవారి కాంటాక్టులవేనని బులెటిన్‌లో పేర్కొంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ఇప్పటి వరకు 150 మందికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. కాగా రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,355కు చేరింది. కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 49కి చేరింది. 

>
మరిన్ని వార్తలు