సీఎం మాటిచ్చి మోసం చేశారు

25 Jan, 2019 09:30 IST|Sakshi
పశ్చిమగోదావరి జిల్లాలో దీక్ష చేస్తున్న 104 సిబ్బంది

 జీవో నెం.151 అమలు శూన్యం

నిర్వహణ సంస్థకే సర్కారు వత్తాసు

రాష్ట్రవ్యాప్తంగా దీక్షల్లో 104 సిబ్బంది

సాక్షి, అమరావతి: మాట ఇచ్చి మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా 104 (చంద్రన్న సంచార చికిత్స) సిబ్బంది ధర్మపోరాట దీక్షలకు దిగారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రాష్ట్ర సర్కారు ఇచ్చిన జీవో నెం.151 అమలు కావడం లేదని గత కొంతకాలంగా సిబ్బంది పోరాటం చేస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందించి 2018 మే 1 నుంచి జీవో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటి వరకూ అమలు కాలేదు. దీంతో ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మోసం చేశారని, 104లో పనిచేస్తున్న 1,642 మంది సిబ్బంది అరకొర వేతనాలతో అలమటిస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని ధర్మపోరాట దీక్షకు దిగారు.

ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు, జిల్లా వైద్యాధికారి కార్యాలయాల ఎదుట సిబ్బంది దీక్షలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 292.. 104 వాహనాలను నిలిపివేశారు. 104 వాహనాల నిర్వహణ చేపట్టిన పిరమిల్‌ స్వాస్థ్య సంస్థ ఉద్యోగులను వేధిస్తోందని, ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు కూడా కట్టడం లేదని సర్కారుకు పలు సార్లు విన్నవించినా ప్రభుత్వం నిర్వహణా సంస్థకే వత్తాసు పలుకుతుండటం దారుణమని ఉద్యోగులు విలపిస్తున్నారు. తాము నిరవధిక సమ్మెలో ఉన్నా పథకం కొనసాగుతోందని ప్రభుత్వం చెబుతున్న మాటలు అవాస్తవమని, ఎక్కడా వాహనాలు పల్లెలకు వెళ్లడం లేదని, ప్రతి పల్లెలోనూ బాధితులు మందులు అందక తల్లడిల్లుతున్నారని, దీనికి పూర్తి బాధ్యత సర్కారుదేనని చెబుతున్నారు. ఏ వాహనంలోనూ మందులు లేవని, ఈ విషయాన్ని ప్రభుత్వం, నిర్వహణా సంస్థ బయటికి పొక్కకుండా మభ్యపెడుతున్నాయని, దీనిపై సిబ్బంది ప్రశ్నిస్తే అక్రమంగా బదిలీలు చేస్తున్నారని వాపోతున్నారు.

మరిన్ని వార్తలు