చంద్రన్న బండి..ముందుకెళ్లదండి..

9 May, 2019 13:21 IST|Sakshi
‘104’ బండికి ఎఫ్‌సీ లేదని ఎంవీఐ వేసిన రూ 2000 ఫైన్‌ రశీదు

 పదేళ్లవుతున్నా పాత వాహనాలే

కండీషన్‌లో లేని వాహనాలు

ప్రతినెలా ఏదో మందుకు కొరత

ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ లేని వైనం

చంద్రన్న 104 సంచార చికిత్సకు సవాలక్ష సమస్యలు

ఇది జమ్మలమడుగుకు చెందిన చంద్రన్న 104సంచార చికిత్స వాహనం. మూడు రోజుల క్రితంమోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) తనిఖీచేశారు. వాహనానికి సంబంధించి ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌సర్టిఫికెట్‌), ఇన్సూరెన్స్‌ లేక పోవడంతో రూ.2000అపరాధ రుసుం చెల్లించాలని  ఆదేశించారు.అది చెల్లించాకే లైసెన్స్‌ ఇస్తామని డ్రైవరు నుంచిలైసెన్సును ఎంవీఐ తీసుకెళ్లారు. ఇదీ జిల్లాలోని‘చంద్రన్న 104 సంచార చికిత్స’ వాహనాలపరిస్థితి. చాలా వాహనాలది ఇదే పరిస్థితి.పదేళ్లవడంతో సామర్థ్యం కోల్పోయాయి.రోడ్డెక్కితే మొరాయిస్తున్నాయి. మందులకు కొరతనెలనెలా వెంటాడుతోంది. దీంతో గ్రామీణ వైద్యం‘104’ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

కడప రూరల్‌: గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ‘ 104 సంచార చికిత్స’  పదేళ్ల క్రితం ప్రారంభమైంది. ఓ వైద్యుడు, నర్స్, ఫార్మాసిస్ట్, ,ల్యాబ్‌ టెక్నీషియన్, డ్రైవర్‌తో కలిపి ఐదుగురు సిబ్బంది వాహనంలో ఉండేలా నిబంధనలను రూపొందించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూచనల ప్రకారం ఈ వాహనం  ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి వైద్య సేవలందించాలి. నెల మొదటి వారంలో ఒక గ్రామానికి వెళితే, మరుసటి నెల ఆదే రోజు మళ్లీ ఆ గ్రామానికి సంచార వాహనం వెలుతుంది. రోజుకు దాదాపు 100 మంది రోగులు (ఔట్‌ పేషెంట్స్‌) వస్తుంటారు. ఇక్కడికి వచ్చే గ్రామీణులకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్‌సీ)లో ఎలాంటి వైద్య సేవలు లభిస్తాయో..దాదాపు అన్ని వైద్య సదుపాయలు సంచారవాహనం ద్వారా అందించాలి.

మందులకు కొరత...పనిచేయని పరికరాలు..!
గ్రామీణ ప్రాంతాలలో వివిధ రకాల జ్వరాలు,  నొప్పులు, బీపీ, ఘగర్‌ వ్యాధులతో రోగులు వాహనాల వద్దకు  వస్తుంటారు. వివిధ సంఘటనల్లో గాయపడిన వారూ వస్తుంటారు.  వాహనం వద్దకు వచ్చేసరికి వీరికి నిరాశ ఎదురవుతోంది.  ప్రతి నెలా ఏదో ఒక మందుకు కొరత ఏర్పడుతోంది. సాధారణ జ్వరానికి వాడే ‘పేరాసెట్‌మాల్‌’తో పాటు  ఒళ్లు నొప్పులకు మరికొన్ని రోగాలకు మందులూ లేవంటున్నారు. మందుల్లేవని చెప్పడానికి సిబ్బందిఇబ్బందులు పడుతున్నారు. ఉన్న మందులను ఇచ్చి పంపుతున్నారు. దీంతో రోగులు నమ్మకం కోల్పోయి పట్టణాలకు వెళుతున్నారు. వాహనంలోని ల్యాబ్‌ ఉన్నా వైద్య పరీక్షల పరికరాలకు కొరత ఏర్పడినట్లు తెలిసింది. ఫలితంగా వైద్య పరీక్షలు చేయలేకపోతున్నట్లు భోగట్టా.

ఎఫ్‌సీ, ఇన్సూరెన్స్‌ లేకుండానే...
వాహనాలకు ఎఫ్‌సీ (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌), ఇన్సూరెన్స్‌ సౌకర్యం తప్పనిసరి. ఎక్కువ 104 వాహనాలకు ఈ పత్రాలు లేవు. దీంతో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్లర్ల నుంచి  సమస్య ఎదురవుతోంది. ఇన్సూరెన్స్‌ సౌకర్యం లేనందున  ఏౖదైనా ప్రమాదం జరిగితే అందుకు ఎవరు బాధ్యులనే అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 2008 నుంచి ఈ వాహనాలను దాదాపుగా  నడుపుతున్నారు. 22 వాహనాలకు గాను 13 బండ్లకు పైగా వాహనాలకు టైర్లు అరిగిపోయాయి. అయినా అలాగే నడిపేస్తున్నారు.. కొన్ని బండ్లు మధ్యలోనే మొరాయిస్తున్నాయి.  ‘104’ నిర్వహణ బాధ్యతలను ‘పెరామిల్‌’ సంస్ధ నిర్వహించేది. కాలపరిమితి ముగయడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రన్సిపల్‌ సెక్రటరీ రెండు నెలల కిత్రం బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖలకు అప్పగించారు. ఈ నెలాఖరుకు  ‘104’వ్యవస్ధ మరో కొత్త సంస్ధ పరిధిలోకి వెళ్లనుంది. వాస్తవానికి ప్రభుత్వమే నిర్వహిస్తే నెలకు సగం ఖర్చు తగ్గగుతుంది. నెలకు వాహనానికి రూ1.25 లక్షలవుతుంది. ఇతర సంస్ధలకు అప్పగించడం వలన ప్రభుత్వం  వాహనానికి రూ.2.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా పాలకుల మాయాజాలమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2008 నుంచి ‘104’ సేవలు...
గ్రామీణుల చెంతకే మెరుగైన వైద్య సేవలు తీసుకువెళ్లాలని 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  సంకల్పించారు. అదే ఏడాది ఆగస్టులో 104 సంచార చికిత్సను ప్రారంభించారు. నాటి నుంచి గ్రామీణులు పట్టణాలకు రాకుండానే ఇంటి ముంగిటనే వైద్యం పొందుతున్నారు. 2016లో టీడీపీ ప్రభుత్వం వాహన బాధ్యతలను పెరమిల్‌ స్వాశ్య మేనేజ్‌మెంట్‌ రీసెర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (పీఎస్‌ఎంఆర్‌ఐ)కు అప్పగించింది. పథకం పేరును ‘చంద్రన్న 104 సంచార చికిత్స’గా మార్చేసింది. పథకం మారిన తర్వాత లక్ష్యం తీరు కూడా మారిపోయిందనే విమర్శలున్నాయి. పథకం నిర్వహణను సరిగ్గా పట్టించుకోవడంలేదు.

మరిన్ని వార్తలు