ఉసురు తీసిన వేగం

14 Jun, 2019 12:49 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన 104 వాహనం

104 ఢీకొని ఒకరు మృతి

తూర్పుగోదావరి, గండేపల్లి (జగ్గంపేట): ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వాహనమే ప్రమాదానికి కారణమై ఓ యువకుడి ప్రాణాలను తీసింది. మరొకరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎస్సై బి. తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించే 104 వాహనం గురువారం రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామాల్లో వైద్య సేవలు అందించి సాయంత్రం జగ్గంపేట బయల్దేరింది.  తాళ్లూరు గ్రామం వద్ద     మోటారు సైకిల్‌తో రోడ్డుదాటేందుకు వేచిఉన్న ఒబిణ్ని కృష్ణ వేగంగా వస్తున్న 104 వాహనాన్ని గమనించి తన మోటార్‌ సైకిల్‌ను విడిచిపెట్టి ఒక్క ఉదుటున పక్కకు తప్పుకున్నాడు. 104 వాహనం కృష్ణ మోటార్‌ సైకిల్‌పై నుంచి దూసుకెళ్లి సమీపంలో మోటార్‌ సైకిల్‌తో వేచిఉన్న వంకాయల ప్రసాద్‌ (21)ను ఢీకొంది. అతని తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలపగిలి ప్రసాద్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. మోటార్‌ సైకిల్‌ను సుమారు 100 మీటర్ల మేర 104 వాహనం ఈడ్చుకుపోయినట్టు స్థానికులు, పోలీసులు తెలిపారు.

జెడ్‌ రాగంపేటకు చెందిన ప్రసాద్‌ కుటుంబ సభ్యులు కొంతకాలంగా నీలాద్రిరావుపేట కొత్త కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్‌ జగ్గంపేటలో మల్లేపల్లికి చెందిన సత్యనారాయణ వస్త్రదుకాణంలో పనిచేస్తున్నాడు. తన యజమాని బాకీల వసూళ్ల కోసం తాళ్లూరు వచ్చిన ప్రసాద్‌ ఈ ప్రమాదానికి గురయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుడి తల్లిదండ్రులు సత్యవతి, అప్పారావు, అన్నయ్య స్వామి, అక్క లోవ, బంధువుల రోదనలతో ఆప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 104 వాహనం డ్రైవర్‌ పలివెల చిట్టిబాబు అజాగ్రత్తవల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. వాహనం వస్తున్న తీరును గమనించి భీతిల్లి మోటార్‌ సైకిల్‌ను విడిచిపెట్టి తప్పుకోవడంతో ప్రాణాలతో బతికిఉన్నానని ఒబిణ్ని కృష్ణ పేర్కొన్నాడు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న పోలీసులు ప్రసాద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు.  ప్రమాదానికి కారకుడైన 104 వాహనం డ్రైవర్‌ పలివెల చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై వరహాలరాజు, హెచ్‌సీ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు