విజయవాడలో కరోనా పంజా..

25 Apr, 2020 20:00 IST|Sakshi

నగరంలో 107 కరోనా కేసులు నమోదు

లక్ష్మణరేఖ దాటితే చర్యలు తప్పవు

విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, విజయవాడ: నగర సిటీ కమిషనర్‌రేట్‌ పరిధిలో కరోనా వైరస్‌ కలవరం పుట్టిస్తోంది. కరోనా పాజిటివ్‌ కేసులు 107కి చేరుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పేకాట సరదా కారణంగా ఒక్క వ్య‌క్తి నుంచి 25 మందికి క‌రోనా వైర‌స్ సోకడంతో నగరంలో కలకలం  సృష్టించింది. కృష్ణలంక, కార్మికనగర్, భవానీపురం, ఖుద్దూస్ నగర్, ఏఎస్ నగర్ లలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. కృష్ణలంక,కార్మిక నగర్‌లలో ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యం కారణంగా 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు.
(కరోనాను జయించి.. మనో ధైర‍్యం నింపి..)

వ్యక్తి నిర్లక్ష్యం ఫలితంగా 14 మందికి కరోనా..
సరదా కోసం పేకాట, హౌసీ ఆడినందుకు ఒకే చోట 25 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని విజయవాడ నగర సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  మరో ప్రాంతంలో ఒక వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా 14 మందికి కరోనా సోకిందని పేర్కొన్నారు. రెడ్‌ జోన్‌లో విధులు నిర్వహించిన ఎస్‌ఐ వైరస్‌ బారినపడ్డారని వెల్లడించారు. కాంటాక్ట్స్ అందరినీ క్వారంటైన్‌కు తరలించామని సీపీ పేర్కొన్నారు.ఆపదలో ఉన్న కరోనా పాజిటివ్‌ మహిళకు సాయం చేసిన మరో ఎస్‌ఐ, కాంటాక్ట్స్ ను క్వారంటైన్‌లో పెట్టామని తెలిపారు.
(కరోనా: అత్యధిక పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే)

ప్రజలు సహకరించాలి..
ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ప్రభుత్వ సిబ్బంది త్యాగాలను ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్లలో నిబంధనలు ఉల్లంఘించడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. నగరంలో 8 ప్రాంతాలను రెడ్‌జోన్‌లుగా గుర్తించామని తెలిపారు. రెడ్‌ జోన్లలో లక్ష్మణ రేఖ దాటితే కఠినచర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ఇళ్ల నుంచి బయటకొస్తే క్వారెంటైన్ కు తరలిస్తామని తెలిపారు. డ్రోన్,సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 

ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలి..
మాస్కులు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామన్నారు. ద్విచక్ర వాహనాల్ల ఒకరికన్నా ఎక్కువ మంది ప్రయాణిస్తే కేసు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని సీజ్‌ చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు నగరంలో ఆరువేల బైకులను సీజ్‌ చేసి.. కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అజాగ్రత్తగా ఉంటే కరోనా బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరోనా నేపథ్యంలో రంజాన్‌ మాస ప్రార్థనలు ఇంటి వద్దే చేసుకోవాలని ముస్లిం సోదరులకు సీపీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం మాంసం, చేపల విక్రయాలపై నిషేధం విధిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు సాగిస్తే కఠినచర్యలు తప్పవని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు