ఆపదలో 108

17 Jan, 2019 12:47 IST|Sakshi

అçస్తవ్యస్తంగా వాహనాల నిర్వహణ  

సకాలంలో అందని సేవలు

ప్రత్యక్ష నరకం చూస్తున్న క్షతగాత్రులు  

63 మండలాలకు 37 వాహనాలే దిక్కు

ప్రైవేట్‌ అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్న పేదలు  

సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురానికి చెందిన భానుప్రసాద్, సుధీర్, టీచర్‌     సుబ్బయ్యతో పాటు మరో ఇద్దరు బుధవారం కారులో కళ్యాణదుర్గం మండలం         గొళ్ల ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో     కాలువపల్లి దాటగానే ఆత్మకూరుకు వచ్చే దారిలో కారు అదుపు తప్పి .. బోల్తాపడింది.         ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  వెంటనే స్థానికులు 108 కు ఫోన్‌ చేశారు. అరగంట దాటినా వాహనం రాలేదు. మరోవైపు క్షత్రగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో స్థానికులు కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి చేరేలోపు క్షతగాత్రుల బాధ వర్ణించేందుకు వీలు లేకుండా పోయింది.

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు సుంకన్న. ఉరవకొండలోని శివరామిరెడ్డి కాలనీ. తన భార్య రెండ్రోజుల క్రితం ఉరవకొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డను ప్రసవించింది. పసికందుకు కామెర్లు వచ్చాయనీ, వెంటనే జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. ఆస్పత్రి సిబ్బందే 108కు ఫోన్‌ చేయగా...సరైన సమాధానం రాలేదు. దీంతో సుంకన్న బుధవారం ఓ స్వచ్చంధ సంస్థకు చెందిన అంబులెన్స్‌ను మాట్లాడుకుని డీజిల్‌ ఖర్చు కింద రూ 900 చెల్లించి శిశువును అనంతపురం తీసుకువచ్చాడు. పది రోజుల కూలి ఒక్కసారిగా అయిపోయిందని సుంకన్న ఆవేదన వ్యక్తం చేశాడు. 

అనంతపురం న్యూసిటీ: ఆపదలో ఆదుకునే 108కు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. గతంలో ఫోన్‌ చెయ్యగానే క్షణాల్లోనే కుయ్‌...కుయ్‌.. అంటూ వచ్చే వాహనం... ఇప్పుడు పత్తా లేకుండాపోతోంది. క్షతగాత్రులు, బాలింతలు, గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చి ప్రాణం పోసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి   108 వాహన సేవలు ప్రవేశపెట్టి ఎందరో ప్రాణాలు కాపాడారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు పట్టించుకోక పోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యçస్తంగా మారింది. ఫలితంగా ప్రజలు ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. జిల్లాలో     పేరుకు 37 వాహనాలున్నా..పూర్తి స్థాయిలో సేవలు అందించడం లేదు. అందుకే జనం ప్రైవేటు వాహనాలు ఆశ్రయిస్తున్నారు.

సేవలు అధ్వానం
‘108’ వాహనాలు జిల్లాలో 37 అందుబాటులో ఉన్నాయని వాటి నిర్వహణ చూస్తున్న భారత్‌ వికాస్‌ గ్రూపు చెబుతోంది. ఈ వాహనాలు జిల్లాలోని 63 మండలాలకు అందుబాటులో ఉండాలి. రెండు మండలాలకు ఓ వాహనం ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కూడేరు,ఆత్మకూరు, ఉరవకొండ, కణేకల్లు, తనకల్లు ప్రాంతాల్లో వాహనాలు పూర్తి  స్థాయిలో తిరగడం లేదు. ఆత్మకూరు వాహనం ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేక మూలనపడింది. మరో ఐదు వాహనాలు 4 లక్షల కిలోమీటర్లకు పైబడి తిరిగాయి. వాటిని స్క్రాబ్‌కు పంపించాల్సి ఉంది. కానీ అదే వాహనాలతో నెట్టుకొస్తున్నారు. ఒకప్పుడు మెరుగైన సేవలతో ఎన్నోప్రాణాలు కాపాడిన 108 ఇపుడు ..సేవలందించలేక ఆపసోపాలు పడుతోంది.

పేదల జేబులకు చిల్లు
గతంలో ఎలాంటి ఆపద వచ్చినా నిరుపేదలకు వెంటనే 108 డయల్‌ చేసే వారు. రానురాను వాటి సేవలు సకాలంలో అందకపోవడం...అసలు సమాధానమే కరువు కావడంతో జనం ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అందువల్లే ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వారు ఎక్కువ మంది ప్రైవేట్‌ అంబులెన్స్‌ల్లోనే వస్తున్నారు. మరోవైపు ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు ప్రజల అవసరాన్ని బట్టి రూ.వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో పేద ప్రజల జేబులకు చిల్లు పడుతోంది.

ప్రజలకు ఇబ్బంది లేదు  
అందుబాటులో ఉన్న వాహనాలతో ప్రజలకు సేవలందిస్తున్నాం. కొన్ని మండలాల్లో సర్వీసులు లేని విషయం వాస్తవమే. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆస్పత్రులకు తీసుకెళ్తున్నాం. త్వరలో కొత్త వాహనాలు రానున్నాయి. ఇటీవల వచ్చిన వాహనాలను శింగనమల, పుట్టపర్తికి ఏర్పాటు చేశాం. మున్ముందు సేవలు మరింత విస్తృతం చేస్తాం.  – మోహన్, భారత్‌ వికాస్‌గ్రూప్‌ మేనేజర్‌

మరిన్ని వార్తలు