108 అంబులెన్సులు నిర్వీర్యం

3 Jan, 2019 04:31 IST|Sakshi

రోజురోజుకూ క్షీణిస్తున్న వాహనాల సామర్థ్యం 

తరచూ మరమ్మతులకు గురవుతున్న వాహనాలు 

డీజిల్‌కు సకాలంలో నిధులివ్వని సర్కారు 

అంబులెన్సు వ్యవస్థపై ప్రైవేటు సంస్థ అజమాయిషీ 

చివరకు ప్రైవేటు అంబులెన్సులను ఆహ్వానించిన సర్కారు 

తక్కువ తిరుగుతున్నా కోర్‌ డ్యాష్‌ బోర్డులో ఎక్కువగా చూపిస్తున్న వైనం 

వాహనాలు తిరగకపోయినా ప్రైవేటు సంస్థకు బిల్లుల చెల్లింపు 

ఈమె పేరు.. ఆర్‌.శ్రావణి,  ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా రాజాం సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈమె స్వగ్రామం వంగర మండలంలోని నీలయ్యవలస. రాజాం పట్టణానికి ఈ గ్రామం 23 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈమెకు డిసెంబర్‌ 31న పురిటినొప్పులు రావడంతో కుటుంబీకులు 108కి ఫోన్‌ చేశారు. కాల్‌ రిసీవర్‌ వివరాలు తెలుసుకుని వంగర మండలానికి 108 వాహనం లేదని చెప్పారు. అప్పటికే చాలా సమయం దాటడంతో కుటుంబీకులు ఆందోళన చెంది ప్రైవేట్‌ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు.  

ఈయన పేరు దేవదాసు. ఊరు చిత్తూరు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్‌ చేయగానే కుయ్‌.. కుయ్‌.. మంటూ కొద్ది నిమిషాల్లోనే 108 అంబులెన్స్‌ వచ్చేదని అంటున్నాడు. ఇప్పుడు ఆ శబ్దం కూడా కరువైందని, ఆపదల్లో 108కు ఫోన్‌ చేస్తే బండి అందుబాటులో లేదనే సమాధానం వస్తోందని వాపోతున్నాడు. 108 సౌకర్యం లేక చాలా అవస్థలు పడుతున్నామని, ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సి వస్తోందని చెబుతున్నాడు. 

పేదవాడికి అపర సంజీవని లాంటి 108 పథకాన్ని సర్కారే గొంతు నులుముతోంది. గతంలో అర్ధరాత్రి, అపరాత్రి భేదం లేకుండా ఫోన్‌ చేసిన అతికొద్ది నిమిషాల్లోనే రోగి దగ్గరకు వచ్చివాలిపోయిన 108 అంబులెన్సులు నేడు మొరాయిస్తున్నాయి. నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం, సకాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించకపోవడం, డీజిల్‌కు నిధులివ్వకపోవడం వంటి కారణాలతో 108 పథకం అస్తవ్యస్తమైంది. ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించి, 108 వాహనాలు తిరగకపోయినా ఆ సంస్థకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు చెల్లిస్తోంది. దీంతో 108 పథకం పూర్తిగా కుప్పకూలే దిశగా సాగుతోంది.   

సాక్షి, అమరావతి: ఆరోగ్యశాఖలో పీపీపీ (పబ్లిక్‌–ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్‌) పేరుతో కార్పొరేట్లకు కోట్లకు కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. పేదవాడిని కాపాడే 108 అంబులెన్సులు గుర్తుకు రావడం లేదు. టైర్లు అరిగిపోయాయని, డీజిల్‌ లేదని, వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఉద్యోగులు రోజూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తన బాధ్యతలను నిర్వర్తించకుండా నెపాన్ని నిర్వహణ సంస్థపైకి నెట్టేస్తోంది. దీంతో ఎక్కడకక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. కొత్త అంబులెన్సుల కొనుగోలు మాట కూడా ప్రభుత్వం నుంచి వినిపించడం లేదు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైన 108 పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అమలవుతోంది. రాష్ట్రంలో మాత్రం పుట్టెడు కష్టాల్లో కొనసాగుతోంది. 

నాలుగున్నరేళ్లుగా కష్టాల్లోనే.. 
108కు బాధితులు ఫోన్‌ చేస్తుంటే వాహనాలు ఘటనా స్థలానికి రావడం లేదు. టైర్లు అరిగిపోయి కొన్ని, డీజిల్‌ లేక మరికొన్ని, ఇంజన్‌ మరమ్మతులకు వచ్చి ఇంకొన్ని ఆగిపోతున్నాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేసి బాధితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఆ పనిచేయడం లేదు. సమస్య తలెత్తిన వెంటనే 108 వాహనాలను రోడ్డు మీద తిప్పాల్సిన ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి నెలల తరబడి ఆలస్యం చేసింది. కొనుగోలు చేసిన వాటికి కూడా 100 శాతం అధికంగా చెల్లించి కమీషన్లు కొట్టేసిన తీరు చూస్తుంటే ప్రభుత్వ అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆపదలో ఉన్న రోగులను కాపాడాల్సిన 108 వాహనాల కొనుగోలును కూడా ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకున్న తీరు విస్మయం కలిగిస్తోంది. అవినీతికి పరాకాష్టగా పథకాన్ని మార్చడం, సరిగా నిధులు కేటాయించకపోవడం, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడం, చివరకు నిర్వహణ సంస్థపై తప్పులు నెట్టేయడం ప్రభుత్వ అసమర్థ పనితీరుకు అద్దం పడుతున్నాయని ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకూ మండిపడుతున్నారు. 

సకాలంలో రాని అంబులెన్సులు ఎక్కడైనా ప్రమాదం జరిగి 108 
అంబులెన్సుకు ఫోన్‌ చేస్తే ఎంతకీ రావడం లేదు. ఇటీవల విజయవాడ నడిబొడ్డున బెంజి సర్కిల్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో యనమలకుదురులో ప్రమాదం జరిగి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్సుకు ఫోన్‌ చేస్తే ఎంతకీ రాలేదు. దీంతో క్షతగాత్రులను ప్రైవేటు అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు విజయవాడలో రాఘవయ్య పార్కు సమీపంలో వారం క్రితం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. 108కు ఫోన్‌ చేస్తే అరగంట దాటినా రాలేదు. దీంతో గాయపడిన వ్యక్తిని ప్రైవేటు వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డునే ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఇక రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయొచ్చు. 

ప్రస్తుతం 108 వాహనాల దుస్థితి ఇలా.. 
- సమయానికి ఇంజన్‌ ఆయిల్‌ మార్చకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. 
హెడ్‌లైట్సు లేకపోవడంతో రాత్రిపూట కొన్ని వాహనాలు తిరగలేకపోతున్నాయి.. ప్రమాదానికి కూడా గురవుతున్నాయి. 
అతిముఖ్యమైన సైరన్, బార్‌లైట్స్, బ్లింకర్స్, బ్యాటరీ హారన్‌ పనిచేయకుండానే వాహనాలు తిరుగుతున్నాయి. 
టైర్లు పూర్తిగా అరిగిపోవడంతో ఎప్పుడు ఆగిపోతాయో తెలియడం లేదు. 
స్టెఫ్నీ టైర్లు లేకపోవడంతో వాహనాలు ఆగిపోతే ఇబ్బంది కలుగుతోంది. 
స్టీరింగ్‌ ఆయిల్, గేర్‌బాక్స్‌ ఆయిల్, డిఫ్రన్షియల్‌ ఆయిల్, హబ్‌ గ్రీసింగ్‌ చేయడం లేదు. 
బ్రేక్‌ప్యాడ్స్, బ్రేక్‌ బూస్టర్లు, బ్రేక్‌ లైనింగ్స్, బ్రేక్‌ ఆయిల్‌ను మార్చకపోవడం వల్ల బ్రేకులు పనిచేయడం లేదు. 
వర్షం పడితే అంబులెన్సులోకి నీరు కారడంతో పేషెంట్లు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. 
వాహనాల్లో వైద్య పరికరాల చార్జింగ్‌కు అవసరమైన చార్జింగ్‌ పాయింట్లు పనిచేయడం లేదు. 
పేషెంట్‌ కేబిన్‌లో లైట్లు, ఫ్యాన్‌లు పనిచేయడం లేదు. 
చాలా వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, పొల్యూషన్‌ సర్టిఫికెట్స్‌ లేవు. 
వాహనాల్లో మల్టీచానెల్‌ మానిటర్, సెక్షన్‌ ఆపరేటర్, డిఫ్రిబ్యులేటర్, వెంటిలేటర్స్, పల్సాక్సీ మీటర్‌లు సరిగా పనిచేయడం లేదు. 
బీపీ ఆపరేటర్స్, స్టెతస్కోప్, గ్లూకోమీటర్, ధర్మామీటర్‌లు మరమ్మతులకు గురయితే బాగు చేయడం లేదు. 
చాలా అంబులెన్సుల్లో ఆక్సిజన్‌ అందుబాటులో ఉండటం లేదు. 
షుగర్‌ పరీక్షలకు అవసరమైన గ్లూకోస్ట్రిప్స్, లాన్‌సెట్లు అందుబాటులో లేవు. 
క్షతగాత్రులకు అవసరమైన డ్రెస్సింగ్‌ ప్యాడ్స్, స్టెరిలైజ్డ్‌ దూది, అయోడిన్‌లు కూడా కరువవుతున్నాయి. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ హయాంలో..  
తొలుత 8 జిల్లాల్లో 310 అంబులెన్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పథకాన్ని నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు.  2007, నవంబర్‌ నాటికి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి 802 వాహనాలను పథకం కోసం సమకూర్చారు. 
2009 నాటికే ఈ పథకంపై సుమారు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు.  
108 అంబులెన్సులు రోజూ రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న కొన్ని వేల మందిని కాపాడి ఆస్పత్రులకు చేరేసేవి. 
పథకానికి ఏటా రూ.100 కోట్లు తక్కువ కాకుండా కేటాయించేవారు.  
70 శాతం మంది గర్భిణులు ప్రసవం కోసం 108 అంబులెన్సులపైనే ఆధారపడేవారు. 
ఫోన్‌ చేసిన అతి కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకునేవి. 
108 వాహనాల్లో అత్యవసర పరికరాలతోపాటు మందులకు, సిబ్బందికి లోటు ఉండేది కాదు. 

108 పథకాన్ని నిర్వీర్యం చేశారు 
2014 తర్వాత 108 అంబులెన్సుల పథకం నిర్వీర్యమైంది. పూర్తిగా ప్రైవేటు సంస్థల అజమాయిషీలోకి వెళ్లింది. ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. చివరకు పథకాన్ని ఏ దశకు తెచ్చారంటే ఏకంగా ప్రైవేటు అంబులెన్సులను తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని లేఖ ఇస్తే.. అంబులెన్సులు పెరుగుతాయి కదా అని అంటున్నారు. ప్రైవేటు అంబులెన్సులను తెరమీదకు తెచ్చి ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని మరుగునపడేసేందుకు ఈ జీవోను తెచ్చారు. రాష్ట్రంలో 108 అంబులెన్సుల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. 
–కిరణ్‌కుమార్, అధ్యక్షుడు, 108 ఉద్యోగుల సంఘం 

గతంలో కంటే పరిస్థితి మెరుగైంది 
గతంతో పోల్చితే అంబులెన్సుల పరిస్థితి బాగా మెరుగైంది. కొత్తగా 32 అంబులెన్సులను కొనుగోలు చేశాం. మరో 12 వాహనాలు కొత్తవి వస్తాయి. పాత వాటిని తీసేసి వీటి సేవలను అందుబాటులోకి తెస్తాం. అంతేకాకుండా ప్రైవేటు అంబులెన్సులతో ఎంవోయూ చేసుకుంటున్నాం. ఇప్పటివరకూ 100 వరకు ప్రైవేటు అంబులెన్సులు ఎంవోయూ చేసుకున్నాయి. ఘటనా స్థలానికి అంబులెన్సులు చేరుకునే నేపథ్యంలో ఒక అంబులెన్సు నుంచి మరో అంబులెన్సుకు కాల్‌ డైవర్ట్‌ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తున్నాం.     
–డా.రాజేంద్రప్రసాద్, నోడల్‌ అధికారి, 108 పథకం
తిరగకపోయినా తిరిగినట్టు.. 
రాష్ట్రం మొత్తం మీద 108 వాహనాలు 439 ఉన్నాయి. అందులో రోజూ రోడ్డు మీద తిరుగుతున్నవి తక్కువగా ఉంటున్నాయి. వివిధ కారణాలతో సగటున రోజూ 70 నుంచి 80 వాహనాలు నిలిచిపోతున్నాయి. కానీ సీఎం కోర్‌ డ్యాష్‌ బోర్డులో 96 శాతం వాహనాలు తిరుగుతున్నట్టు చూపిస్తున్నారు. కోర్‌ డ్యాష్‌ బోర్డులో ఉన్న లెక్కల ప్రకారమే వాహనాలకు బిల్లుల చెల్లింపు కూడా జరుగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంటే.. రోజుకు 80కి పైగా వాహనాలు మూలన పడి ఉన్నా వాటిని తిరిగినట్టు చూపించి బిల్లులు చెల్లిస్తున్నట్టు తేలింది. 

ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాం 
మా మనవరాలు తిరుపతమ్మకి నొప్పులొస్తుంటే 108కు ఫోన్‌ చేశాం. చాలాసేపు వేచిచూసినా రాకపోయేసరికి ఏమిచేయాలో పాలుపోక నొప్పులతో అల్లాడుతున్న నా మనవరాలిని ఆటోలో ప్రత్తిపాడుకు తీసుకెళ్లాం.  
– నల్లబోతుల ఏసమ్మ, ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా 

నా చేతుల్లోనే ప్రాణం విడిచారు..  
చిత్తూరులో మేము అద్దెకుంటున్న ఇంటి యజమాని గోపాల్‌ గుండెపోటు వచ్చి బాత్‌రూమ్‌లో పడిపోయారు. వెంటనే 108కు ఫోన్‌ చేశాను. అర్ధ గంటపాటు వేచిచూసినా రాలేదు. దీంతో ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లాను. అయినా ఫలితం దక్కలేదు. నా చేతుల్లోనే ఆయన ప్రాణం విడిచారు. 10 నిముషాల ముందు వచ్చి ఉంటే ఆయన బతికుండేవారని డాక్టర్లు చెప్పారు. ఇలాగైతే 108పై నమ్మకం ఎలా ఉంటుంది?          
– ప్రభు, చిత్తూరు నగరం 

వైఫల్యాలను ప్రైవేటు సంస్థపై నెట్టేసి.. 
ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థకు నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టింది ప్రభుత్వమే. ఇప్పుడు తన వైఫల్యాలను ప్రైవేటు సంస్థపై నెట్టేస్తోంది. బీవీజీ సంస్థ 108 నిర్వహణా బాధ్యతలు చూస్తోంది. ఈ సంస్థ 108 పథకాన్ని సరిగా నిర్వహించడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు వివిధ కారణాలతో వాహనాలు ఆగిపోతున్నాయని, ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదని బీవీజీ సంస్థ వాపోతోంది. మరోవైపు ఉద్యోగులేమో 108 వాహనం బాధితుడిని తీసుకురావడానికి ఘటనా స్థలికి వెళ్లేవరకూ అనుమానమేనని చెబుతున్నారు. సకాలంలో పథకానికి నిధులు చెల్లించకపోవడమే దీనికి కారణమంటున్నారు. వాహనాలకు మరమ్మతులు చేయించకపోవడంతో రోజూ కనీసం వంద వాహనాలు మూలనే పడి ఉంటున్నాయని పేర్కొంటున్నారు. 

ప్రైవేటుకు అంబులెన్సులు 
పథకం దారుణంగా నిర్వీర్యమవడంతో తాజాగా ప్రైవేటు అంబులెన్సులకు చోటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018, నవంబర్‌ 20న దీనికోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 108 అంబులెన్సులు కొనసాగించడానికి ఆసక్తి ఉంటే ప్రైవేటు అంబులెన్సులకు కూడా అవకాశం కల్పిస్తారు. డిజిటల్‌ పూల్‌ పేరుతో ప్రైవేటు అంబులెన్సులకు ఈ పథకంలో చేరే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇకపై కొత్త 108 అంబులెన్సులను కొనుగోలు చేయకుండా ఇలా ప్రైవేటు అంబులెన్సులకు అవకాశం కల్పిస్తున్నారని అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఒక విధంగా ప్రైవేటుకు సేవలు ఇవ్వడమంటే బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని అంటున్నాయి.

మరిన్ని వార్తలు