ఇక ప్రైవేటు 108 అంబులెన్స్‌లు

21 Nov, 2018 04:48 IST|Sakshi

కిలోమీటర్‌కు రూ.25 చొప్పున చెల్లింపు  

ఉత్తర్వులు జారీ చేసిన ఆరోగ్యశాఖ

‘108’ అంబులెన్స్‌ల కొనుగోలుకు మంగళం! 

సాక్షి, అమరావతి: ఎలాంటి ఆపద సమయంలోనైనా ‘108’కు ఫోన్‌ చేయగానే పరుగు పరుగున అంబులెన్స్‌ వచ్చేది. బాధితులకు విలువైన సేవలందించిన ‘108’ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. తాజాగా ప్రైవేటు అంబులెన్స్‌లకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘108’ అంబులెన్స్‌లు అందించే సేవలను కొనసాగించాలనే ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆపరేటర్లు ఈ పథకంలో చేరొచ్చు. డిజిటల్‌ పూల్‌ పేరుతో ప్రైవేట్‌ అంబులెన్స్‌లు ఈ స్కీంలో చేరే అవకాశం కల్పించారు.

ప్రతి 60 వేల మందికి ఒక అంబులెన్సు ఉండాలన్న నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్కీంలో చేరాలనుకునే ప్రైవేటు అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్‌ సౌకర్యం, డ్రైవర్‌తోపాటు ఈఎంటీ ఉండాలని, దీనికి గాను కిలోమీటర్‌కు రూ.25 చొప్పున చెల్లిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ ప్రైవేటు అంబులెన్సులకు జాతీయ ఆరోగ్యమిషన్‌ నుంచి నిధులు చెల్లించనున్నారు. ప్రైవేటు అంబులెన్సులకు జీపీఎస్‌ లొకేషన్‌ సిస్టం ఉంటుందని, కిలోమీటర్ల ప్రాతిపదికన నెలకోసారి డబ్బులు చెల్లిస్తారు. ఇకపై కొత్త ‘108’ అంబులెన్స్‌లను కొనుగోలు చేయకుండా ప్రైవేటు అంబులెన్స్‌లకు అవకాశం కల్పిస్తున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైద్య సేవలను ప్రైవేట్‌కు అప్పగించడం అంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని అంటున్నారు.  

మరిన్ని వార్తలు