ఆదుకోని ఆపద్బంధువు

23 Oct, 2018 13:11 IST|Sakshi
క్రేన్‌ సాయంతో వ్యాన్‌ను పైకి లేపుతున్న దృశ్యం

సకాలంలో రాని 108 వాహనాలు  

విపత్కర సమయంలో అందని తక్షణ వైద్యం

గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు    

క్షతగాత్రుల ప్రాణాలతో చెలగాటం

మొన్న కత్తిపూడిలో కన్నుమూసిన శిశువు 

నేడు చేబ్రోలులో 108 వచ్చేలోపు ఇద్దరు మృతి

సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : కత్తిపూడి శివారు 216వ జాతీయ రహదారి పక్కన  ఇటీవల 108 సేవలు సకాలంలో అందకపోవడంతో నడిరోడ్డుపైనే మతి స్థిమితం లేని మహిళ ప్రసవించింది. ఫోన్‌ చేసినా సకాలంలో 108 రాకపోవడంతో జన్మించిన శిశువుకు వైద్యం అందలేదు. దీంతో శిశువు వెంటనే కన్నుమూసింది. ఘటన జరిగిన 3 గంటల తర్వాత 108 వాహనం అక్కడికి చేరుకుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

సోమవారం కూడా అదే తరహా జాప్యం పునరావృతమైంది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో టాటా మేజిక్‌ వాహనాన్ని టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది  మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి ఫోన్‌ చేయగా వెంటనే రాలేదు. ఫోన్‌ చేసిన 2 గంటల తర్వాత వాహనం చేరుకుంది. ఈలోపు తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరు మృతి చెందారు. 108 వచ్చేలోపు పోలీసు జీపు, ఇతర వాహనాల్లో క్షతగాత్రులను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు.

ఇలా చెప్పుకునిపోతే గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. కానీ, ప్రభుత్వంలో చలనం లేదు. వైఎస్సార్‌ హయాంలో ఎన్నో ప్రాణాల్ని కాపాడిన ఆపద్బంధువు ఇప్పుడేమాత్రం ఆదుకోలేకపోతోంది. ఫోన్‌ చేసిన కొన్ని గంటల తర్వాత గానీ రాని పరిస్థితి నెలకొంది. ఈలోపే క్షతగాత్రులు, ఆపదలో ఉన్న వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఒకప్పుడు ప్రథమ చికిత్సతోప్రాణాల్ని నిలబెట్టేవి. తదుపరి వైద్యసేవలు అందేవరకు మెరుపు వేగంతో తరలి వచ్చి పునర్జన్మ ప్రసాదించేవి. ఇప్పుడా పరిస్థితి జిల్లాలో కనిపించడం లేదు. సమయానికి రాకపోగా, వచ్చేవి కూడా ఎక్కడ ఆగిపోతాయో తెలియని పరిస్థితిలో 108 ఉంది. ఆక్సిజన్‌ కూడా 108 వాహనాల్లో లేని దుస్థితి నెలకొంది.

జిల్లాలో 42 వాహనాలుండేవి. ఇందులో ప్రస్తుతం 33 పని చేస్తున్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికైతే క్షేత్రస్థాయిలో 29 మాత్రమే తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మిగతా వన్నీ మూలకు చేరిపోయాయి. ప్రస్తుతం పనిచేస్తున్న వాటిలో 20 వరకు చిన్న,చిన్న మరమ్మతులతో ఉన్నాయి. ఎప్పుడేది ఆగిపోతుందో తెలియదు. ఇక, ఆక్సిజన్‌ లేక, ఇంజన్‌ ఆయిల్‌ మార్చక, టైర్లు ఆరిగిపోయి తిరుగుతున్న వాహనాలు పదుల సంఖ్యలోనే ఉన్నాయి. వాస్తవ పరిస్థితి బయటకు చెబితే ప్రభుత్వం కన్నెర్ర చేస్తుందని  అధికార వర్గాలు బయటికి చెప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో 108 వాహనాలు వచ్చి ఆదుకుంటాయనే ఆశ ప్రజలకు లేకుండా పోయింది. అందుకు ఉదాహరణే తాజాగా గొల్లప్రోలు వద్ద జరిగిన ప్రమాదం.

కత్తిపూడిలో అదే నిర్లక్ష్యం...
మొన్న కత్తిపూడిలో ఫోన్‌ చేసిన 3 గంటల తర్వాత 108 వాహనం రావడంతో రోడ్డుపై మతి స్థిమితం లేని మహిళ జన్మనిచ్చిన శిశువు చనిపోగా సోమవారం చేబ్రోలులో జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు సేవలందించే విషయంలో కూడా అదే తరహా జాప్యం చోటుచేసుకుంది. దీనికంతటికీ ప్రమాదం జరిగిన గొల్లప్రోలు మండలంలో 108 వాహనం లేకపోవడమే కారణం. గతంలో ఇక్కడ 108 వాహనం ఉండేది. కాకినాడ రూరల్‌లోని వాహనం పాడైందని గొల్లప్రోలులో ఉండే వాహనాన్ని తరలించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గమంతటికీ రెండే వాహనాలున్న పరిస్థితి నెలకొంది. అసలే అరకొరగా పనిచేస్తుండగా, ఆపై వాహన కొరత ఉండటంతో ఫోన్‌ చేసిన వెంటనే ఘటన జరిగిన చేబ్రోలుకు 108 రాలేకపోయినట్టు తెలుస్తోంది. సుమారు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రమాదం జరగ్గా 108 వచ్చే సరికి రెండు గంటలు ఆలస్యమైంది. ఈలోపే తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సకాలంలో వైద్యసేవలందక మృతి చెందారు. సమయానికి వచ్చి ఉంటే వారిద్దరూ బతికేవారేమోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను పణంగా పెట్టక తప్పదన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

జాప్యానికి కారణంపరిశీలిస్తా...
ఫోన్‌ చేసిన వెంటనే 108 వాహనం ఎందుకు రాలేకపోయిందో పరిశీలిస్తాను. ఏ కారణం చేత రాలేదో తెలుసుకుంటాను. కాకినాడ రూరల్‌ 108 వాహనం చెడిపోయిన కారణంగా గొల్లప్రోలు వాహనాన్ని అక్కడికి తరలించాం. 108 వాహనాల కొరత ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో వాహనాలు రానున్నాయి.– బాలాజీ, 108 సేవల జిల్లా మేనేజర్‌

మరిన్ని వార్తలు