అయ్యో పాపం

14 Sep, 2019 11:45 IST|Sakshi
జకరయ్యను ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది 

సాక్షి, కోనేరుసెంటర్‌(కృష్ణా) : మానవత్వం మంట కలచిపోతుంది. అనుబంధం, అపాయ్యతలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. జిల్లాకేంద్రమైన మచిలీపట్నంలో శుక్రవారం జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ. వృద్దాప్యానికి దగ్గరవుతున్న ఆ వ్యక్తి కుటుంబానికి భారమయ్యాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాడో అంతకంటే తెలీదు. తెల్లవారుజామున పట్టణ నడిబొడ్డున ఉన్న ఓ ప్రాంతంలో నేలపై పడుకుని కొనఊపిరితో మూలుగుతున్నాడు. లేవలేనిస్థితిలో నిరాశ నిస్పృహల నడుమ పెదవి దాటి మాట రాని దీనస్థితిలో ఆదుకునే వారి కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అతని దీనస్థితిని చూసి స్థానికులు చలించారు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని 108లో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కాగా  ప్రస్తుతం అతడు చికిత్స పొందతున్నాడు. ఆ వ్యక్తిని గురువారం తెల్లవారుజామున కొంత మంది తీసుకువచ్చి బందరు బస్టాండ్‌ వెనుక వైపు ఉన్న గానుగసెంటర్‌ సమీపంలో పడేసి వెళ్ళిపోయినట్లు ఆ ప్రాంతానికి  చెందిన పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బాధితుడు పేరు జకరయ్యగా వైద్య సిబ్బంది పేర్కొంటుండగా మిగిలిన వివరాలు తేలాల్సి ఉందని అంటున్నారు.

మరిన్ని వార్తలు