కీచక ఉపాధ్యాయుడు

4 May, 2017 10:31 IST|Sakshi
కీచక ఉపాధ్యాయుడు

► పదో తరగతి విద్యార్థినితో ప్రేమాయణం
► కుటుంబీకులకు తెలియడంతో బలవన్మరణం
► ఉపాధ్యాయుడిపై కేసు నమోదు


విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. ఇంటి పక్కన ఉన్న పదో తరగతి బాలికను బలవంతంగా లొంగదీసుకున్నాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో అవమానాన్ని దిగమింగలేక ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.    
   
కోడుమూరు(కర్నూలు జిల్లా) : తన చావుకు ఉపాధ్యాయుడు రాఘవేంద్ర కారణమని పదో తరగతి విద్యార్థిని మరణవాంగ్మూలంలో పేర్కొంది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ పేరుతో విద్యార్థిని లోబర్చుకున్న ఉదంతం కర్నూలు జిల్లా కోడుమూరులో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక లక్ష్మీనగర్‌లో నివసిస్తున్న నిరుపేద దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె వాణి(16) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

ఏడాది క్రితం వీరి ఇంటికి సమీపంలో పి.కోటకొండలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాఘవేంద్ర అద్దెకు చేరాడు. ఇతని భార్య వరలక్ష్మి కూడా ఉపాధ్యాయురాలు. రాఘవేంద్ర ముందుగా విద్యాబుద్ధులు నేర్పించేలా నటిస్తూ వాణికి దగ్గరయ్యాడు. అతనితో తమ కుమార్తె చనువుగా ఉంటుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించి కొంతకాలంగా బడి మాన్పించి ఇంటి వద్దే పెట్టుకున్నారు. అయినప్పటికీ ఉపాధ్యాయుడు వక్రబుద్ధిని మానుకోలేదు. వాణి ఇంట్లో ఎవరూలేని సమయంలో కలిసేవాడు.

విషయం రాఘవేంద్ర భార్య, కుటుంబీకులకు తెలియడంతో మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంపై ఈ నెల 1వ తేదీన రాఘవేంద్రను వాణి తల్లిదండ్రులు గట్టిగా హెచ్చరించారు. తిరిగి వారిని బెదిరింపులకు గురి చేయడంతో వాణి భయాందోళనలకు గురైంది. వెంటనే ఇంట్లో శరీరంపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన బాలికను తల్లిదండ్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. బాలిక మరణవాంగ్మూలం మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు