తల్లిదండ్రుల ఒత్తిడే ఆ విద్యార్థిని ప్రాణం తీసిందా?

11 Feb, 2014 20:34 IST|Sakshi
రిషిత

నల్గొండ: ఆ విద్యార్థిని  అప్పటి వరకు బాగానే ఉంది. క్లాస్‌కు కూడా వెళ్లింది. ఇంతలో ఏమైందో ఏమో,  తాను చదువుతున్న స్కూల్‌ భవనం పైనుంచి దూకేసింది. నిండు ప్రాణాలను బలవంతంగా తీసేకుంది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది. నల్గొండ జిల్లా కోదాడలో ఈ దుర్ఘటన జరిగింది.

విగతజీవిగా మారిన ఆ అమ్మాయి పేరు రిషిత. ఓ ప్రైవేట్‌ స్కూల్లో పదవ తరగతి చదువుతోంది. తెలంగాణ బంద్‌ కావడంతో టెన్త్‌ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఒక గంట క్లాస్‌ మాత్రమే పెట్టారు . క్లాస్‌ అయిపోయిన తర్వాత ఇంటికి బయల్దేరిన రిషిత, బుక్స్‌ మర్చిపోయానంటూ మళ్లీ లోపలికి వెళ్లింది. అంతే ఇక తిరిగిరాలేదు. వాచ్‌మేన్‌, తోటి విద్యార్థులు చూస్తుండగానే స్కూల్‌ 5వ అంతస్థు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  రిషిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రిషిత తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులు. కూతురి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రిషిత కూడా బాగానే చదువుతుందని, మంచి మార్కులు తెచ్చుకుంటుందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. స్కూల్‌ యాజమాన్యం మాత్రం రిషితపై తల్లిదండ్రుల ఒత్తిడి ఎక్కువగా ఉండేదని, అందువల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని అంటున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు