నది దాటడమే పెద్ద 'పరీక్ష'

26 Mar, 2015 21:00 IST|Sakshi
నది దాటడమే పెద్ద 'పరీక్ష'

విజయనగరం : విజయనగరం జిల్లా కొమరాడ మండలంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు నాగావళి నది దాటితేగాని పరీక్ష రాయలేని పరిస్థితి నెలకొంది. ఉదయం 9.30 గంటల లోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవలసి ఉండడంతో నదికి ఆవతలివైపు ఉన్న విద్యార్థినీ విద్యార్థులు గురువారం అష్టకష్టాలు పడ్డారు.

నది అవతల గల కొట్టు, తొడుము, కెమిశిల, శిగవరం, మాతలంగి, దలాయిపేట, నిమ్మలపాడు తదితర గ్రామాలకు చెందిన దాదాపు 120 మంది విద్యార్థులు నది ఇవతల వైపు ఉన్న కొమరాడ పాఠశాలలో చదువుతున్నారు. మధ్యలో నాగావళి నది ఉన్నా వీరికి కొమరాడ దగ్గరగా ఉండడంతో స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. నదిలో నుంచి వస్తే కిలోమీటరు దూరం ప్రయాణిస్తే చాలు విద్యార్థులు ఓ కిలోమీటరు నడిచి  పాఠశాలలకు చేరుకోవచ్చు. అదే చుట్టూ తిరిగి రావాలంటే 90 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉంటుంది.

సదరు గ్రామాలకు చెందిన విద్యార్థులకు కొమరాడలోని సాంఘిక సంక్షేమ పాఠశాల , గురుకుల బాలుర పాఠశాలలను పరీక్ష కేంద్రాలను కేటాయించారు. నీటి ప్రవాహం తక్కువగా ఉండడంతో విద్యార్థులు కొంత కష్టపడైనా సమయానికి కేంద్రాలకు చేరుకున్నారు. ఒకవేళ ఒడిశాలో వర్షాలు కురిస్తే నాగావళిలో నీటి ప్రవాహం పెరుగుతుంది.

వీరు మధ్యలో ఉండగా నీటి ప్రవాహం పెరిగితే పరిస్థితి చెప్పనక్కరలేదు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని నది దాటాల్సిన పరిస్థితి నెలకొంది. నది ఆవలి నుంచి కొమరాడ వచ్చేసరికి సుమారు గంటన్నర సమయం పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా విద్యార్థులకు ఈ కష్టాలు తప్పడంలేదని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు