ఎర్ర బస్సు

3 Dec, 2014 12:35 IST|Sakshi
ఎర్ర బస్సు

నంద్యాల : ఎర్రచందనం స్మగ్లర్లు విసిరిన ఉచ్చులో ఆర్టీసీ డ్రైవర్లు ఇరుక్కోవడం కలకలం రేపింది. అక్రమ రవాణా సాఫీగా చేసుకోవడానికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆర్టీసీ డ్రైవర్లను ఉపయోగించుకోవడం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం కూలీలను తరలించడానికి ఆర్టీసీ బస్సులైతే అనుమానం రాదని భావించి, ఆ దిశగా డ్రైవర్లను ఉచ్చులోకి లాగారు. ఓ ప్రయాణికుడి ఫిర్యాదుతో గుట్టు ర ట్టయింది.
 
 కడప పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కడప, చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాకు నంద్యాల, ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపోలకు చెందిన 12 మంది డ్రైవర్లకు సంబంధాలు ఉన్నాయని కడప పోలీసులు తేల్చారు. దీంతో మంగళవారం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల, ఆళ్లగడ్డ డిపోల నుంచి చెన్నైకి వెళ్లే 6443, 6445(నంద్యాల), 6560(ఆళ్లగడ్డ) సర్వీస్ నెంబర్లు కలిగిన బస్సులకు 12 మంది డ్రైవర్లు చెన్నైకి వెళ్తుంటారు. వీరికి ఎర్రచందనం స్మగ్లర్లు ఎర వే శారు.
 
 తమకు అనుకూలంగా సర్వీసులను నడుపుకున్నారు. దీంతో ఒక్కొక్క డ్రైవర్‌కు నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ముట్టజెప్పారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రైవర్‌కు ఎర్రచందనం కూలీలను బస్సులోకి ఎక్కించుకున్నందుకు రూ. 2500 నుంచి రూ.3000 మధ్యన స్మగ్లర్లు ఇచ్చేవారు. ఇలా 12 మంది డ్రైవర్లు నెలకు పది సార్లు చెన్నై రూట్‌కు వెళ్తే వారికి ఒక్కొక్కరికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఆదాయం వచ్చేదని పోలీసుల విచారణలో తేలింది. ఏడాది మీద ఒక్కొక్క డ్రైవర్‌కు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్యన ఆదాయం ఉందని అంచనా.
 
 వీరేం చేస్తారంటే..

 నంద్యాల, ఆళ్లగడ్డ డిపోలకు చెందిన డ్రైవర్లు సంబంధిత డిపోల నుంచి ప్యాసింజర్లను చెన్నైకి తీసుకెళ్తారు. ఇంత వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చెన్నైలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు కొయ్యంబేడు బస్టాండ్ నుంచి ఎర్రచందనం తరలించే కూలీలను 50 నుంచి 60 మందిని బస్సులో ఎక్కించుకుంటారు. ఈ సమయంలో వారిని తప్ప ఇతర ప్యాసింజర్లను ఎక్కించుకోరు. చైన్నై నుంచి ఎక్కడా ఆపకుండా కడప జిల్లాలోని రాజంపేట సమీపంలోను, కుక్కలదొడ్డి సమీపంలోనూ వారిని దించేస్తారు. అయితే వీరితో టికెట్లను వసూలు చేసి ఆర్టీసీకి చెల్లిస్తారు. స్మగ్లర్లు ఇచ్చే మొత్తాన్ని జేబులో వేసుకుంటారు. స్మగ్లర్లు కూడా ఆర్టీసీ బస్సులపై కన్ను వేయడం వెనుక ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికేనని పలువురు చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి కడప, రాజంపేట వరకు ఖాళీగానే వెళ్తారు. అక్కడ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఆళ్లగడ్డ, నంద్యాలలో దించుతారు.
 
 ఎలా వెలుగులోకి వచ్చిందంటే...
 ఇటీవల కడప జిల్లా నందలూరు ప్రాంతానికి చెందిన ఒక ప్రయాణీకుడు ఈ బస్సులో గొడవ చేసి ఎక్కాడు. అయితే ఆయనకు నందలూరు వచ్చే వరకు అర్థం కాలేదు. తాను దిగే గమ్యస్థానానికి ముందే బస్సు మొత్తం ఖాళీ అయ్యింది. తాను ఒక్కడినే బస్సులో ఎలా ఉన్నానని ఆలోచించి ఆరా తీశాడు. అంతేగాక హైటెక్ బస్సులో అడవి మార్గంలో దిగే ప్రయాణీకుల గురించి కూడా అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు విచారణ జరిపితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసు విచారణలో నంద్యాల పట్టణానికి చెందిన హనీఫ్‌నగర్‌లోని సయ్యద్ అక్బర్‌హుసేన్ అనే డ్రైవర్ ఎర్రచందనం కూలీలతో బయల్దేరగా కడప జిల్లా పోలీసులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి రావడంతో విచారణ ఆరంభించారు.
 
 స్మగ్లర్ల ఉచ్చులో పడిన డ్రైవర్లు వీరే..
 నంద్యాల డిపోకు చెందిన సయ్యద్ అక్బర్ హుసేన్(54), నరసింహులు(40), ఎన్‌వీ రమణ(42), ఎస్‌ఎంజే బాష(53), బాబ్జీ(49), సుబ్బారెడ్డి(51), కె.శ్రీనివాసులు(46), ఆళ్లగడ్డ డిపోకు చెందిన రామసుబ్బారెడ్డి(50), వెంకటేశ్వర్లు(54), గోస్పాడు మండల కేంద్రానికి చెందిన పుష్పాల మద్దిలేటి(53), బండిఆత్మకూరుకు చెందిన ధర్మారెడ్డి(37), యర్రగుంట్ల గ్రామానికి చెందిన గోవిందయ్య(50)లు ఉన్నారు. వీరందరిపై విచారణ జరుపుతున్నారు.  

మరిన్ని వార్తలు