చిన్నిగుండెకు పెద్ద కష్టమొచ్చింది

24 Feb, 2018 11:49 IST|Sakshi
బిడ్డను ఎత్తుకుని రోదిస్తున్న తల్లి లక్ష్మి,గుండె జబ్బుతో బాధ పడుతున్న చిన్ని కీర్తన

11 నెలల చిన్నారికి గుండె జబ్బు

ఏపీ వారికి తెలంగాణలో ఆరోగ్యశ్రీ వర్తించకపోవడంతో కష్టాలు

చిన్ని గుండెకు పెద్ద కష్టమొచ్చింది.. తల్లి కడుపులో పెరుగుతున్నప్పుడే కష్టాలు మొదలయ్యాయి..జన్మించిన తర్వాత మరీ ఎక్కువయ్యాయి.. 11 నెలల చిన్నారి గుండెకు చిల్లులు పడ్డాయి...దీంతో తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతోంది.. తల్లిదండ్రులు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు... వారు నిరుపేదలు.. ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి... ఎవరైనా దాతలు ఆర్థికసాయం చేస్తే తమ బిడ్డను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు.

ప్రొద్దుటూరు క్రైం : రాజుపాళెం మండలం పొట్టిపాడుకు చెందిన లక్షి, రాజయ్య దంపతులకు కీర్తన (3), చిన్ని కీర్తన (11 నెలలు) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజయ్య వ్యవసాయ కూలీ. అతను రోజూ పనికి వెళ్తే గానీ.. సంసారం జరగడం కష్టం. ఉన్నంతలోనే ఆ కుటుంబం సంతోషంగా ఉండేది. సాఫీగా ముందుకు సాగుతున్న తరుణంలో రెండో పాప గుండెకు రంధ్రాలు పడ్డాయని డాక్టర్‌ చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు.

తల్లి గర్భంలోనే  కష్టాలు: రెండో సారి గర్భం ధరించిన లక్ష్మీ తరచూ ఆస్పత్రికి వెళ్లేది. స్కానింగ్‌ చేయగా.. లోపల బిడ్డ పెరుగుదల లేదు.  పరిశీలించిన వైద్యురాలు గుండెకు సమస్య ఉన్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆమె ఆడ పిల్లను ప్రసవించింది. పరిశీలించిన డాక్టర్‌ ఐదు నెలల తర్వాత పరీక్షలు చేస్తామని చెప్పారు. ఐదు నెలల తర్వాత డాక్టర్‌ వద్దకు వెళ్లగా గుండెకు రంధ్రాలు ఉన్నాయని.. చెడు రక్తం, మంచి రక్తం కలిసి గుండెలో ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డ పెరగదన్నారు.

ఎప్పుడూ పడుకునే ఉంటుంది: చిన్ని కీర్తనకు 11 నెలలు వచ్చినా కూర్చోలేదు. పాలు మాత్రమే తాగుతుంది. ఆహార పదార్థాలు తినిపిస్తే ఏడుస్తుందని తల్లి లక్ష్మీ తెలిపింది. హైదరాబాద్‌లో మంచి ఆస్పత్రులు ఉన్నాయని.. అక్కడికి వెళ్తేనే పాపకు నయం అవుతుందని వైద్యులు, పలువురు తెలిసిన వారు వారికి సూచిస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఆస్పత్రులు ఉన్నా టెట్రాలజి ఆఫ్‌ ఫ్యాల్లెట్‌ వ్యాధిని నయం చేసే ఆస్పత్రులు అక్కడ లేవని చెప్పినట్లు లక్ష్మీ దంపతులు చెబుతున్నారు. గుండెకు రెండు, లేదా అంతకంటే ఎక్కువ రంధ్రాలు ఉన్నట్లు తెలుస్తోం దని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. రెండు, మూడు ఆపరేషన్లు చేయాల్సి వస్తుంద ని చెప్పారని తెలిపారు. అయితే ఇపుడు హైదరాబాద్‌కు వెళ్లడానికి తమ వద్ద చిల్లి గవ్వ కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్‌కు రూ.2–3 లక్షలు అవసరం అవుతాయ ని వైద్యులు తెలిపారు. చేతిలో రూపాయి కూడా లేని ఆ దంపతులు తమ కుమార్తెను ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించుకుంటున్నారు. ఎలాగైనా తమ బిడ్డను బతికించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే చిన్నారి కీర్తనను బతికించుకుంటామని వారు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సిన వారు 7680053675 అనే సెల్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని వారు కోరుతున్నారు.

ఆంధ్రా వాళ్లకు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు
వైద్యుల సూచన మేరకు లక్ష్మీ దంపతులు చిన్ని కీర్తనను హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించారు.  తర్వాత ఆపరేషన్‌ చేస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో వెళ్లారు. ఆంధ్రా వాళ్లకు ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు చేయబోమని, ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంతో వారికి ఏం చేయాలో పాలుపోలేదు. నాలుగైదు సార్లు హైదరాబాద్‌కు తిరగడంతో రూ. 2 లక్షల దాకా ఖర్చు అయినట్లు వారు చెబుతున్నారు. కుమార్తెను బతికించుకునేందుకు గ్రామంలో తెలిసిన వారి దగ్గర అప్పు తీసుకొని ఆస్పత్రుల చుట్టూ తిరిగామని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు