రాష్ట్రానికి 11 పంచాయతీ అవార్డులు

20 Jun, 2020 03:43 IST|Sakshi

పలు విభాగాల్లో మెరుగైన సేవలు అందించినందుకు రాష్ట్రానికి గుర్తింపు

డీడీయూపీఎస్‌పీ– 2020 అవార్డులు వెల్లడించిన కేంద్రం

జిల్లా స్థాయిలో పశ్చిమ గోదావరికి అవార్డు

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతంలోని ప్రజలకు సేవలు అందించడంలో మెరుగైన పనితీరును కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తికరణ్‌ పురస్కార్‌ (డీడీయూపీఎస్‌పీ)–2020 అవార్డులు ఈ ఏడాది రాష్ట్రానికి 11 దక్కాయి. పారిశుధ్యం, ప్రజా సేవలు (తాగునీరు, వీధి దీపాలు, మౌలికవసతులు), సహజ వనరుల నిర్వహణ, అట్టడుగు వర్గాలు (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, వయో వృద్ధులు), సామాజికరంగ పనితీరు, విపత్తు నిర్వహణ, గ్రామ పంచాయతీల అభివృద్ధికి వ్యక్తిగత సహాయం, ఆదాయ ఆర్జనలో కొత్తవిధానాలు, ఇ–గవర్నెన్స్‌ విభాగాల్లో ఆయా పంచాయతీరాజ్‌ సంస్థలు తీసుకునే ఉత్తమ చర్యలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డులు ఇస్తారు. ఈ ఏడాది అవార్డుల జాబితాను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజీబ్‌ పత్‌జోషి ఇటీవల వెల్లడించారు. రాష్ట్రంలో ఒక జిల్లా పరిషత్, నాలుగు మండల పరిషత్‌లు, ఆరు గ్రామ పంచాయతీలు ఈ ఏడాది అవార్డులను దక్కించుకున్నాయి.  

అవార్డులు ఇలా.. 
జిల్లా స్థాయిలో– పశ్చిమ గోదావరి మండల స్థాయిలో– రామచంద్రాపురం, బంగారుపాళెం (చిత్తూరు జిల్లా), మేడికొండూరు (గుంటూరు జిల్లా), చెన్నూరు (వైఎస్సార్‌ జిల్లా) గ్రామ పంచాయతీ స్థాయిలో– కొండకిందం (విజయనగరం జిల్లా), వేములకోట, కురిచేడు (ప్రకాశం జిల్లా), చెల్లూరు (తూర్పు గోదావరి జిల్లా), అంగలకుదురు, కొట్టెవరం (గుంటూరు జిల్లా).   

మరిన్ని వార్తలు