111 జీవోకు స్వస్తి పలకాలి

18 Aug, 2013 03:14 IST|Sakshi
మొయినాబాద్/చేవెళ్ల, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే జంట జలాశయాల ఎగువ ప్రాంతంలోని 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరతున్నారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించేందుకు నిజాం కాలంలో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలను ఏర్పాటు చేశారు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం జంటజలాశయాల పరిరక్షణ కోసమంటూ జీవో 111ను తీసుకొచ్చింది. దీంతో జిల్లాలోని మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, రాజేంద్రనగర్, షాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తూరు మండలాల్లోని 84 గ్రామాలకు ఇబ్బంది ఏర్పడింది. జీవో పరిధిలోని గ్రామాల్లో కొత్త నిర్మాణాలు చేపట్టడానికి, పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకూడదని నిబంధనలు పెట్టారు. కొత్తగా వెంచర్లు సైతం ఏర్పాటు చేసే అవకాశంలేదు. ఈ నిబంధనలతో ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగలేదు. జీఓ 111ను ఎత్తివేయాలంటూ 84 గ్రామాల పరిధిలోని నాయకులు, ప్రజలు 2007, 2008లో ఉద్యమం చేపట్టారు. 111 జీవో వ్యతిరేక పోరాట సమితిని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు, దీక్షలు చేశారు. అప్పటి ముఖ్యమంతి స్వర్గీయ వైఎస్.రాజశేఖర్‌రెడ్డికి విషయాన్ని తెలియజేడయంతో ఈ నిబంధనలను కొంత వరకు సడలించేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మరణానంతరం జీవో యథావిధిగా కొనసాగుతోంది.
 
 కారుచౌకగా భూములు కాజేయాలనే.. గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చాలనే పేరుతో తీసుకొచ్చిన 111 జీఓ వెనుక వేరే ఉద్దేశముందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి ధరలు పెరగకుండా చూసి కారుచౌకగా భమూలు కాజేయాలనే దురుద్దేశంతోనే ఈ జీఓను టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చినట్లు వారు చెబుతున్నారు. పేదల ఇళ్లకు అనుమతులివ్వని అధికారులు పెద్ద రియాల్టి సంస్థల ఆగడాలను మాత్రం అడ్డుకోకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చని పేర్కొంటున్నారు. పేదల కడుపులు కొట్టి పెద్దలకు పెట్టే ఈ జీఓకు తెలంగాణ రాష్ట్రంలో చరమగీతం పాడాలని కోరుతున్నారు.
 
 మళ్లీ ఉద్యమిస్తాం..
 84 గ్రామాల అభివృద్ధికి అడ్డంకిగా మారిన 111 జీవోను ఎత్తివేయాలని 2007 నుంచి ఉద్యమం చేస్తున్నాం. అప్పట్లో ఆందోళననలు, నిరహారదీక్షలు, రాస్తారోకోలతో ఎద్ద ఎత్తున ధర్నాలు చేశాం. అప్పట్లో కొంత వరకైనా సడలింపు వస్తుందని భావించాము. కాని ఎలాంటి సడలింపు రాలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక గండిపేట, హిమాయత్‌సారగ్ జలాశయాల పరిధిలోని ఎగువ ప్రాంతంలోని నీరు జలాశయాల్లోకి వెళ్లకుండా చెక్‌డ్యాంలు నిర్మించి సాగునీరుకు వాడుకునే ఏర్పాట్లు చేయాలి. జలాశయాలను నింపేందుకు నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీళ్లు తీసుకురావాలి. ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి జీవో 111ను ఎత్తివేయాలి. అందుకోసం ఇప్పుడు మళ్లీ ఉద్యమం చేస్తాం.
 -కొమ్మిడి వెంకట్‌రెడ్డి, 111 జీవో వ్యతిరేక పోరాట సమితి ప్రధాన కార్యదర్శి,  మొయినాబాద్
 
 
 అభివృద్ధికి ఆమడ దూరం
 హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండి, అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా శంషాబాద్ మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. నగరానికి చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినా 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలు మాత్రం అభివృద్ధికి నోచుకోవడంలేదు. 111 జీవో నిబంధనలతో సామాన్య ప్రజలు, రైతులు మాత్రమే ఇబ్బందులు పడుతున్నారు. డబ్బున్న బడాబాబులు మాత్రం నయానో భయానో తమ పనులు సాఫీగానే చేసుకుంటున్నారు. అక్రమంగా నిర్మాణాలు సైతం చేస్తున్నారు. వాటిలో నుంచి మురుగు హిమాయత్‌సాగర్‌లో కలుస్తూనే ఉంది. అలాంటి వాళ్లను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. సామాన్యులు చిన్న ఇళ్లు కట్టుకోవాలన్నా నిబంధనలు అడ్డువస్తున్నాయి.
 -కె.అంజయ్యగౌడ్, మాజీ సర్పంచ్, తొండుపల్లి, శంషాబాద్
 
 
 తెలంగాణలోనైనా న్యాయం చేయాలి
 షాబాద్ మండలంలోని మద్దూర్, సోలిపేట్ గ్రామాలు 111 జీఓ పరిధిలోకి వస్తాయి. మండలంలోని మిగితా గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నా.. ఈ రెండు గ్రామాల్లో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. మిగితా గ్రామాల్లో భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. నగర జనాభా తాగునీటి అవసరాలను తీర్చడానికి 84 గ్రామాల ప్రజల పొట్ట కొట్టడం న్యాయం కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 111 జీఓను ఎత్తివేయాలి. లేకపోతే ప్రత్యేక రాష్ట్రంలోనూ ఈ గ్రామాల పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఈ జీఓ ఎత్తివేత గురించి ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేశాం. మరోసారి నిరవధిక ఆందోళనకు వెనకాడం.
 -జనార్దన్ రెడ్డి, సోలిపేట్ మాజీ సర్పంచ్, షాబాద్
 
 రైతులకు మేలు జరుగుతుంది
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల రైతులకు మేలు జరగాలి. జీవో నిబంధనలతో పదిహేడేళ్లుగా పంటలకు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడనివ్వడంలేదు. అవసరానికి భూమి అమ్ముకుందామన్నా ధర రావడం లేదు. ఎవరూ కొనడానికి కూడ ముందుకు వస్తలేరు. సొంత భూమిలోనైనా కొత్తగా ఇళ్లు కట్టుకుండామన్నా ఇబ్బందిగానే ఉంది. ఇన్ని నిబంధనలు పెట్టినా అవి పెద్దవాళ్లకు మాత్రం వర్తిస్తలేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వమే 111 జీవోను ఎత్తివేవేసి రైతులను ఆదుకోవాలి.
 -దర్గ ప్రభాకర్, రైతు, చిలుకూరు, మొయినాబాద్
 
 పదేళ్లుగా అవే ధరలు
 వందల ఎకరాల భూమి వున్న మా గ్రామం 111 జీఓ కారణంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. జీఓను ఎత్తివేయాలని అధికారులకు, ప్రజాప్రతినిదులరు మొర పెట్టుకున్నా ఫలితం మాత్రం లేదు. నగరానికి సమీపంలో ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల్లో భూముల ధరలు ఆకాశన్నంటుతున్నా మా గ్రామాల్లో మాత్రం పదేళ్లుగా ధరలు స్థిరంగా ఉన్నాయి. జంట జలాశయాల సమీపంలో ఉండటమే మేం చేసిన తప్పా. నగర నీటి అవసరాలను పూర్తిగా నాగార్జున సాగర్ నీటితోనే సరిపుచ్చాలి. అనంతరం జీఓ 111ను ఎత్తివేయాలి. అప్పుడే మా గ్రామం అభివృద్ధి చెందుతుంది.
 -రాంరెడ్డి, రైతు, మద్దూర్, షాబాద్
 
 ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే మేలు
 గ్రామాలలోని మురుగు నీరు గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల్లోకి వెళ్లకుండా 111 జీవో పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వమే ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఓ ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామం మొత్తనికి సంబంధించిన మురుగు నీరు ఒకే చోటుకు చేరేటట్లు నిర్మాణాలు చేపట్టాలి. అక్కడ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మించి ఆ మురుగు అందులోకి వెళ్లేవిధంగా చూడాలి. ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో మురుగు నీరు శుభ్రం చేసి ఆ నీటిని పంటలకు వాడుకునే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ఈ రకమైన చర్యలు తీసుకుని 111 జీవోను ఎత్తివేయాలి.
 -సన్‌వల్లి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్, శ్రీరాంనగర్, మొయినాబాద్
 
 రాజకీయ కుట్రతోనే..
 రాజకీయ కుట్రతోనే 111జీవోను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విడుదల చేశారు. రైతులకు, ప్రజలకు గుదిబండగా మారిన ఈజీవోను కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనైనా ఎత్తివేయాలి. ఎన్‌టీ.రామారావును ముఖ్యమంత్రి పీఠంనుంచి పదవీచ్యుతిని చేసి అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబునాయుడుతో అప్పటి హోంమంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న పి.ఇంద్రారెడ్డి తీవ్రంగా విభేదించారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిగా దించివేయడం భావ్యంకాదని, రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. జిల్లాలో మాస్‌లీడర్‌గా పేరొందిన ఇంద్రారెడ్డిని రాజకీయంగా అణగదొక్కడానికే ఈ జీవోను విడుదల చేశారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇది వాస్తవం కూడా. అప్పటినుంచి జీవోను ఎత్తివేయాలని ఎన్నో పోరాటాలు చేసినా ఇంకా రైతులనెత్తిన కత్తిలా వేలాడుతూనే ఉంది. జీవో 111ను ఎట్టిపరిస్థితులలోనూ ఉపసంహరించుకోవాల్సిందే. లేకపోతే ఈ ప్రాంతానికి భవిష్యత్ అంధకారమే.
 -పడాల వెంకటస్వామి, రాష్ట ఎస్సీసెల్ కన్వీనర్, చేవెళ్ల
 
 తీవ్రంగా నష్టపోయిన రైతులు
 సీమాంధ్ర నాయకుల ఆధిపత్యం, పెత్తనం అధికంగా ఉన్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని విలువైన భూములపై వారి కన్నుపడింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఒప్పించి 1996లో నదీపరీవాహక ప్రాంతం (క్యాచ్‌మెంట్ ఏరియా) పేరుతో 111 జీవోను విడుదల చేశారు. ఈ జీవో నిజానికి ఈ ప్రాంత రైతులకు ఎంతో నష్టాన్ని కలిగించింది. అత్యంత ఖరీదైన, విలువైన ఈ భూములను కారుచౌకగా కాజేయడానికి సీమాంధ్రనాయకులు పన్నిన పన్నాగమే ఇది. ఈ జీవో విడుదలైనప్పటినుంచి జీవో పరిధిలోని భూములను కొనడానికి అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో కారుచౌకగా ఇక్కడ భూములు కొనుగోలు చేసిన పెట్టుబడిదారులు ఇక్కడ రిసార్ట్‌లు, ఫాంహౌస్‌లు నిర్మించుకున్నారు. ఈ జీవోను ఎత్తివేయాలని గతంలో సర్పంచుల సంఘం తరఫున ఎన్నో పోరాటాలు చేశాం. అయినా ఫలితం మాత్రం లేకపోయింది. కొత్త పంచాయతీ పాలకవర్గాలతో మరోసారి ఈ జీఓకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భావిస్తున్నాం. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం.
 -చింపుల సత్యనారాయణరెడ్డి, రాష్ట్రసర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు, చేవెల్ల
మరిన్ని వార్తలు