పదకొండైనా తీరలేదు!

31 Aug, 2013 03:45 IST|Sakshi

మహబూబ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలనపై కలెక్టర్ గిరిజాశంకర్ దృష్టి సారించారు. ఇందులో భాగంగా ముందుగా పరిశ్రమల కార్యాలయాన్ని తనిఖీ చేయాల్సిందిగా అదనపు జేసీ డాక్టర్ రాజారాంను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం 10.30 ఏజేసీ పరిశ్రమల కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉన్నారు. మిగతా అధికారులు, సిబ్బంది ఎవరూ కనిపించకపోవడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అనంతరం ఏజేసీ జనరల్ మేనేజర్ చాంబర్‌లో కూర్చొని, సిబ్బంది రాకపై దృష్టిపెట్టాలని తన సీసీ మురళీని ఆదేశించారు. కాసేపటికి జూనియర్ అసిస్టెంట్ వినయతమ్మ, టైపిస్టు వెంకటేశ్వర్లు కార్యాలయానికి వచ్చారు. వారితో సమయం వేయించి, రిజిస్టర్‌లో సంతకాలు పెట్టించారు. ఆ తర్వాత ఏ అధికారి కానీ, సిబ్బంది కానీ రాకపోవడంతో ఆయన ఉదయం 11.30 గంటల వరకు కార్యాలయంలోనే వేచి ఉన్నారు. జనరల్ మేనేజర్‌తో పాటు ముగ్గురు ఏడీలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు హాజరుకాలేదు. దీంతో ఏజేసీ ఏడీకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించగా, తాను ఆఫీస్ పని మీద ఫీల్డ్‌కు వచ్చానని చెప్పారు. ఏ విషయంలో ఫీల్డ్‌కు వెళ్లారని ఏజేసీ తిరిగి ప్రశ్నించడంతో అటువైపు నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆయన విధులకు ఆలస్యంగా వస్తే సహించేది లేదని హెచ్చరించారు.
 
 కలెక్టర్‌కు నివేదిక...
 పరిశ్రమల శాఖలో పనిచేసే సిబ్బంది సకాలంలో ఎవరూ విధులకు హాజరు కాని విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఏజేసీ పేర్కొన్నారు. అలాగే ఆలస్యంగా హాజరైన వారందరికీ చార్జీమెమోలు జారీచేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పై వారానికో కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది హాజరుపై కలెక్టర్‌కు నివేదిస్తానని చెప్పారు.   
 
 పరేషాన్‌లో సిబ్బంది...
 ఆకస్మిక తనిఖీలో భాగంగా ముందుగా ఏజే సీ పరిశ్రమ శాఖ కార్యాలయాన్నే ముందుగా తనిఖీ చేయడంతో కార్యాలయ అధికారులు, సిబ్బంది షాక్‌కు గురయ్యారు. తాము ఎప్పుడు కార్యాలయానికి వచ్చినా అడిగే వారే లేరనుకుంటే... ఏజేసీ తనిఖీతో తమ బండారం బయటపడిందనే పరేషాన్‌లో ఉన్నారు. పైగా ఈ విషయం కలెక్టర్ దృష్టికి కూడా వెళుతుండటంతో ఏంచేయాలో వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
 

మరిన్ని వార్తలు