11వ రోజు పాదయాత్ర డైరీ

19 Nov, 2017 03:45 IST|Sakshi

18–11–2017, శనివారం
కోవెలకుంట్ల, కర్నూలు జిల్లా

మద్య నిషేధం చారిత్రక అవసరం
ఈ రోజు ఉదయం 8 గంటలకు దొర్నిపాడులో పాదయాత్ర ప్రారంభమయ్యింది. నిన్న సాయంత్రం కోర్టు నుంచి బయల్దేరి రాత్రికి దొర్నిపాడు చేరుకు న్నాను. కంపమల్లమెట్ట గ్రామంలో డ్వాక్రా మహిళలు వచ్చి కలిశారు. డ్వాక్రా రుణాల రద్దుపై చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయామని చెప్పారు. వాళ్ల కళ్లలో ఆగ్రహం, నిస్పృహ కనిపించా యి. ఇంత మోసం జరుగుతుందని వాళ్లు ఊహించిన ట్లు లేరు. ఆడబిడ్డలకు ఇల్లు, పిల్లలు, కుటుంబమే సమ స్తం. వారి కోసం ఎంతో కష్టపడతారు, తాపత్రయ పడ తారు. అటువంటి అక్కాచెల్లెమ్మలకు ఇంతటి అన్యా యం జరగడం, వారి నిరాశ, నిస్పృహ నన్ను బాధించాయి. 

మద్యం విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంపై కూడా మహిళల్లో తీవ్రమైన బాధ వ్యక్తం అయింది. కిష్టపాడు నుంచి వచ్చిన కల్లె సుబ్బమ్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. మద్యానికి బానిసైన భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఆమెను చూసుకోడానికి కూడా ఎవరూ లేరు. ‘‘నాకు బతకాలని లేదన్నా..’’ అంటూ కన్నీరు పెట్టుకుంది. ఆమె పరిస్థితిని చూశాక నాకు తీవ్ర ఆవేదన కలిగింది. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయమంటే ప్రజల రక్త, మాంసాలతో వ్యాపారం చెయ్యడమే. మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు రాష్ట్రంలో లక్షల్లో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళల కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవరికీ మేలు జరగదు సరికదా, అన్ని విధాలా సమాజాన్ని నష్టపరుస్తుంది. మద్యం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదేమో కానీ, ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతున్నారు. ‘‘రేపటి మన ప్రజా ప్రభుత్వం మద్యాన్ని నిషేధిస్తుంది, నీ కష్టాన్ని తీరుస్తుందమ్మా..’’ అని సుబ్బమ్మకు భరోసా ఇచ్చాను. మద్య నిషేధం చారిత్రక అవసరం. 

పాదయాత్రలో కోవెలకుంట్ల, చాగలమర్రి మండలాల రైతులు వచ్చి కలిశారు. కడప, కర్నూలు రైతులకు ప్రధాన జలవనరుగా ఉన్న కేసీ కెనాల్‌ ఆయకట్టును విస్తరించడానికి అవసరమైన రాజోలి, జొలదరాశి రిజర్వాయర్లను పూర్తి చేయాల్సిందిగా కోరారు. వెంటనే నాన్నగారు గుర్తుకు వచ్చారు. ఈ ప్రాంత రైతుల కోరికను ఆయన ఎప్పుడో విన్నారు. ఈ రెండు రిజర్వాయర్ల నిర్మాణం కోసం 2008లోనే 407 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ నాన్నగారు ఆదేశాలు జారీ చేశారు. ఈ రిజర్వాయర్లను నిర్మిస్తే కేసీ కెనాల్‌ రైతులకు షెడ్యూలు ప్రకారం నీరు విడుదల చేయొచ్చు. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరుగుతుంది. అయితే, నాన్నగారి మరణంతో ఈ ప్రాజెక్టులు కూడా నిలిచిపోయాయి. ఎనిమిదేళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ రోజు బుడ్డశనగ రైతులు కలిశారు. క్వింటాల్‌కు కనీసం 8,000 రూపాయల ధర ఉంటే కానీ వాళ్లకి గిట్టుబాటు కాదు. కానీ, ఈ రోజు వాళ్లు పండించిన పంటను కొనేవాళ్లే లేరు. ధర రూ.4,000 పలకడం కూడా కష్టంగా ఉంది. మళ్లీ రాజన్న రాజ్యం వస్తేనే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ముందుకు కదులుతాయి... పంటలకు గిట్టుబాటు ధరలు వస్తాయి.. సమస్యలు తీరతాయి అని రైతులు నమ్ముతున్నారు.  

చివరగా.. చంద్రబాబుకు నాదొక ప్రశ్న. అధికారంలోకి రాగానే బెల్ట్‌షాపులను రద్దు చేస్తూ రెండో సంతకం పెడతామని మేనిఫెస్టోలో చెప్పిన మీరు గత మూడున్నరేళ్లలో ఒక్క బెల్ట్‌షాపునైనా మూయించారా? పేరు మార్చి అనుబంధ షాపుల పేరుతో వాటి సంఖ్యను పెంచడం వాస్తవం కాదా? ఫోన్‌ కొడితే హోమ్‌ డెలివరీ స్థాయికి మద్యాన్ని తీసుకొచ్చింది మీరు కాదా? మీకు మద్యం మీద సంపాదన ముఖ్యమా, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ముఖ్యమా?  
- వైఎస్‌ జగన్‌ 

మరిన్ని వార్తలు