-

ఒడి నుంచే మాయం

20 Dec, 2013 04:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గిరిజన తండాలే లక్ష్యంగా జిల్లాలో శిశు విక్రయ ముఠాలు పనిచేస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన ఆడ శిశువు విక్రయ ఘటన అనుమానాలకు ఊతమిస్తోంది. ఏడాదిన్నర కాలంలో డజను శిశు విక్రయ ఘటనలు వెలుగు చూడగా, ఇందులో తొమ్మిది ఆడ శిశువులు ఉన్నాయి. ఈ 8 శిశువులు కూడా తండాలకు చెందిన వే కావడం చూస్తే తండాల్లో శిశు విక్రయ ముఠాల కార్యకలాపాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకోవచ్చు. విక్రయ ఘటనలు వెలుగు చూసినప్పుడు హడావుడి చేసే సంబంధిత అధికారులు ఆ తర్వాత శిశు విక్రయాల సంగతి మరచిపోతున్నారు. మరోవైపు ఏ ఒక్క ఘటనలోనూ పోలీసు కేసు నమోదు కాకపోవడంతో శిశు విక్రయాల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
 
 ఈఏడాదిలో తొమ్మిది శిశువు విక్రయ ఘటనలు కేవలం నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోనే చోటు చేసుకున్నాయి. ఈ నియోజవర్గం నుంచి సాక్షాత్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండగా, శిశు విక్రయాలను అరికట్టే దిశలో ప్రభుత్వం చేపట్టిన పైలట్ కార్యక్రమం ఇదే నియోజకవర్గం పరిధిలోని కౌడిపల్లిలో అమలవుతుండడం గమనార్హం. గతంలోనూ ఇదే నియోజకవర్గం కేంద్రంగా గర్భసంచి ఆపరేషన్ల రాకెట్ గుట్టు రట్టయింది. పేదరికం, నిరక్షరాస్యత, అవగాహన లోపం కారణంగా శిశు విక్రయాలు సాగుతున్నట్లు అధికారులు కారణాలను వల్లె వేస్తున్నారు. విక్రయాలకు గురైన శిశువులను స్వాధీనం చేసుకుని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించడంతోనే అధికారులు సరిపెడుతున్నారు. విక్రయ ఘటనలపై లోతైన విచారణ జరగడం లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క ఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
 
 శిశు విక్రయ ముఠా పనే?
 తాజాగా నర్సాపూర్ మండలంలో వెలుగు చూసిన శిశు విక్రయ ఘటనపైనా అధికారుల స్పందన మొక్కుబడిగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఆర్టీసీ ఉద్యోగి భార్య మధ్యవర్తిగా వ్యవహరించగా, శిశువు నాలుగు చేతులు మారింది. తల్లి ఒడి నుంచి తప్పించిన శిశువును తిరిగి కర్నూలు జిల్లాలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే సమగ్ర బాలల సంరక్షణ పథకం (ఐసీపీఎస్) అధికారులు మాత్రం సంగారెడ్డిలోనే శిశువు దొరికిందని చెప్తున్నారు. తమ వంతు తప్పు లేకుండా చూసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు ఉంటేనే ఫిర్యాదు స్వీకరిస్తామని నర్సాపూర్ పోలీసులు తేల్చి చెప్పడంతో ఐసీపీఎస్ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. జిల్లా మహిళాభివృద్ధి సంస్థ, జిల్లా బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో పలు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నా విక్రయాలు, చట్టబద్ధత లేని దత్తత వంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
 
 అవగాహన కల్పిస్తాం
 గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తాం. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో గిరిజన తండాల్లో కళాజాత ద్వారా శిశు విక్రయ ఘటన లు చోటు చేసుకోకుండా ప్రజలను చైతన్యవంతులను చేస్తాం. అక్రమంగా శిశువులను అమ్మేవారిపై, కొనుగోలు వారిపై చట్టబద్ధంగా కేసులు నమోదు చేస్తాం.
 -రత్నం, ఐసీపీఎస్

మరిన్ని వార్తలు