రెచ్చిపోయిన మృగాళ్లు

7 Nov, 2013 01:44 IST|Sakshi

యాలాల/ పెద్దేముల్, న్యూస్‌లైన్: మృగాళ్లు రెచ్చిపోయారు. జిల్లాలోని రెండు వేర్వేరు ఘటనల్లో బాలికలపై అకృత్యాలకు పాల్పడ్డారు. యాలాల మండలంలో ఓ డిగ్రీ చదివే విద్యార్థి పన్నెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి ఐదు రోజులు పొలంలోనే నిర్బంధించాడు. బాలిక తల్లిదండ్రులు యువకుడిపై అనుమానంతో నిలదీయ గా విషయం వెలుగు చూసింది. ఇక పెద్దేముల్ మండలంలో ఓ యువకుడు పదహారేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. గ్రామస్తులు పంచాయతీ పెట్టి రూ.5 లక్షలు జరిమానా విధించారు. దీంతో నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
 
 పన్నెండేళ్ల బాలికకు ఓ డిగ్రీ విద్యార్థి మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. విషయం బయటపడుతుందనే అనుమానంతో నిందితుడు ఐదు రోజుల పాటు బాలికను నిర్బంధించాడు. నిందితుడిని బాలిక తల్లిదండ్రులు నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేయగా బుధవారం ఠాణాలో లొంగిపోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా బుధవారం యాలాల మండల పరిధిలో వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌలాపూర్ అనుబంధ గ్రామం ముకుందాపూర్‌కు చెందిన  ఓ బాలిక(12) ఇంటిపట్టునే ఉంటూ పశువులను మేపుతోంది. అదే గ్రామానికి చెందిన తిమ్మనగుంట భీమప్ప(20) తాండూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవ త్సరం చదువుతున్నాడు. ఈనెల 2న బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం తాండూరుకు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన భీమప్ప బాలికకు మాయమాటలు చె ప్పి గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
 విషయం బయటపడుతుందని భయపడిన అతడు బాలికను పొలాల వద్ద కాళ్లు చేతులు కట్టేసి నిర్బంధించాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కూతురు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా తమ కూతురు అదృశ్యమైన రోజు ఆమెతో భీమప్ప మాట్లాడుతుండగా గమనించి వారించారు. భీమప్పే తమ కూతురిని అపహరించి ఉంటాడని మంగళవారం సాయంత్రం అతడిని బాలిక తల్లిదండ్రులు నిలదీయగా తడబడుతూ బుకాయించాడు.  దీంతో వారు బుధవారం యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న భీమప్ప బాలికను వెంటబెట్టుకొని వెళ్లి బుధవారం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం బాలికను, నిందితుడిని తాండూరు డీఎస్పీ షేక్ ఇస్మాయిల్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
 
 బాలికపై అత్యాచారయత్నం: పంచాయితీ పెట్టి జరిమానా వేసిన గ్రామస్తులు
 ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. గ్రామస్తులు పంచాయితీ పెట్టి.. ఆమెను పెళ్లయినా చేసుకోవాలని, లేదంటే రూ. ఐదు లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పడంతో నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై ఇరువర్గాల వారు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దేముల్ మండలంలోని మన్‌సాన్‌పల్లికి చెందిన 16 ఏళ్ల బాలిక మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్(23) ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాలిక కుటుంబీకులు బుధవారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం గ్రామంలో పంచాయితీ పెట్టారు. బాలికను పెళ్లి చేసుకోవాలి.. లేదంటే రూ. ఐదు లక్షలు జరిమానా చెల్లించాలని నిందితుడికి గ్రామపెద్దలు స్పష్టం చేశారు. దీంతో లక్ష్మణ్‌కు ఎటూతోచక ఇంటికి వెళ్లి పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబీకులు అతడిని చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా చేయని తప్పునకు లక్ష్మణ్‌పై నిందవేశారని అతడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు.

మరిన్ని వార్తలు