అసెంబ్లీకి 13 డిజైన్లు

19 Oct, 2017 01:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని పరిపాలనా నగరంలో ప్రతిపాదిస్తున్న అసెంబ్లీ భవనం కోసం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ 13 రకాల డిజైన్లు రూపొందించింది. వాటిని ప్రజల అభిప్రాయం కోసం సోషల్‌ మీడియాకు విడుదల చేసింది. రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్‌తోపాటు విడిగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం డిజైన్లు రూపొందించే బాధ్యతను ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలుగా ఫోస్టర్‌ సంస్థ పలు డిజైన్లు ఇచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబుకు నచ్చలేదు. కొద్దిరోజుల క్రితమే వజ్రాకృతి, స్థూపాకృతి డిజైన్లను ఖరారు చేసినట్లే చేసి మళ్లీ తిరస్కరించారు.

అనంతరం సినీ దర్శకుడు రాజమౌళిని రంగంలోకి దించి ఆయన సూచనల మేరకు డిజైన్లు రూపొందించాలని ఫోస్టర్‌ సంస్థకు చంద్రబాబు సూచించారు. ఇటీవలే మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్, రాజమౌళిని లండన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లి డిజైన్లు ఎలా ఉండాలో సలహాలిప్పించారు. గతంలో రూపొందించిన డిజైన్లను మార్చడంతోపాటు రాజమౌళి సూచనల ప్రకారం మొత్తం 13 డిజైన్లను రూపొందించి ఫోస్టర్‌ సంస్థ సీఆర్‌డీఏకు ఇచ్చింది. వాటిలో మూడు గతంలో ఇచ్చిన డిజైన్లే.

మొత్తం డిజైన్లను ఫేస్‌బుక్, ట్విట్టర్‌తోపాటు సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల అభిప్రాయం కోరారు. వారంపాటు అభిప్రాయాలు స్వీకరిస్తారు. మరోవైపు ఈ డిజైన్లతోపాటు మరికొన్నింటిని ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం లండన్‌లో పరిశీలించనున్నారు. ప్రజల  అభిప్రాయాలు, ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టు ఉంటే లండన్‌లోనే తుది డిజైన్లు ఖరారయ్యే అవకాశం ఉందని సీఆర్‌డీఏ వర్గాలు తెలిపాయి. 
 

మరిన్ని వార్తలు