బ్యాటరీలను మింగిన చిన్నారి 

10 Oct, 2019 08:23 IST|Sakshi

సాక్షి, కర్నూలు : పిల్లలు ఆడుకునే ఫోన్‌ బ్యాటరీలను మింగిన చిన్నారికి ఎండోస్కోపి ద్వారా ప్రాణం పోశారు కర్నూలు వైద్యులు. చికిత్స వివరాలను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌ఓడీ డాక్టర్‌ శంకరశర్మ వెల్లడించారు. కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన 13 నెలల బి. వైష్నిక ప్రమాదవశాత్తూ చిన్న పిల్లలు ఆడుకునే ఫోన్‌ బ్యాటరీలు రెండింటిని మింగిందన్నారు. పాప వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా బుధవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి తీసుకొచ్చారన్నారు. ఆ పాపకు ఎలాంటి శస్త్రచికిత్స, మత్తు మందు లేకుండా ఎండోస్కోపి ద్వారా బ్యాటరీలను బయటికి తీసినట్లు తెలిపారు. బ్యాటరీలను సరైన సమయంలో తీయకపోతే జీర్ణాశయంలో రంధ్రం పడి ప్రాణాపాయ స్థితి ఏర్పడే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటరంగారెడ్డి, డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ అరుణ్, డాక్టర్‌ చౌహాన్, డాక్టర్‌ రేవంత్‌రెడ్డి, డాక్టర్‌ ధర్మేందర్‌త్యాగి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు