20 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు రూ. 1,300 కోట్లు 

30 Sep, 2019 04:49 IST|Sakshi

తుంగభద్ర ఎల్‌ఎల్‌సీ పనుల ముసుగులో దోపిడీకి స్కెచ్‌

ఎన్నికల ముంగిట టీడీపీ సర్కారు హడావుడిగా జీవో జారీ 

బోర్డు అనుమతి లేకుండానే చక్రం తిప్పిన వైనం 

పైప్‌లైన్‌ పనులు మొదలైతే పలు ప్రాంతాల రైతులకు నష్టం 

రూ.1,200 కోట్లు ఇస్తే మొత్తం ఆధునికీకరణ పనులే పూర్తి 

ఏపీ సర్కారే పరిష్కారం చూపాలంటున్న అధికారులు

సాక్షి, బళ్లారి : తుంగభద్ర బోర్డు పరిధిలోని బళ్లారి – కర్నూలు జిల్లాల మధ్య ఎల్‌ఎల్‌సీ (లో లెవల్‌ కెనాల్‌) ద్వారా 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులు చేసేందుకు ఏకంగా రూ.1,300 కోట్లు కేటాయిస్తూ ఎన్నికల ముంగిట జారీ అయిన జీవో వెలుగు చూడటం కలకలం రేపుతోంది. తుంగభద్ర బోర్డు అనుమతి లేకుండా సాధారణ పనికి ఇంతపెద్ద మొత్తంలో నిధుల కైంకర్యానికి గత చంద్రబాబు ప్రభుత్వం వ్యూహం రచించడం పట్ల నీటి పారుదల శాఖ నిపుణులు విస్తుపోతున్నారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది.

పలువురు చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపట్టారని సమాచారం. తుంగభద్ర డ్యాం నుంచి ప్రారంభమయ్యే ఎల్‌ఎల్‌సీ 250 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కాలువ అధ్వానంగా మారడంతో 0 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ పనుల కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు. కాగా, మిగిలిన 180 కిలోమీటర్ల మేర పనులు మొదలవ్వలేదు. ఈ కాలువ మొత్తం లైనింగ్, ఆధునికీకరణ పనులు చేపట్టడానికి మరో రూ.1,200 కోట్ల నిధులు అవసరమవుతాయి. అలాంటిది కేవలం 20 కిలోమీటర్ల పైప్‌లైన్‌ కోసం రూ.1,300 కోట్లు వెచ్చించడానికి సిద్ధపడటంలో ఆంతర్యం కమీషన్ల బాగోతమేనని నీటి పారుదల రంగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు.  

లాభం కంటే నష్టమే ఎక్కువ
ఆధునికీకరణకు నోచుకోని ఎల్‌ఎల్‌సీని పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిని పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేవలం 20 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ పనులకు మాత్రం రూ.1,300 కోట్లు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 2న (జీవో ఆర్‌టీ నంబర్‌–153) జీవో జారీ చేసింది. చివరన ఉన్న కోడుమూరు ప్రాంతానికి నీటిని నేరుగా తీసుకెళ్లేందుకు పైప్‌ లైన్‌ వేస్తున్నామని అప్పట్లో చంద్రబాబు సర్కారు చెప్పినప్పటికీ ఈ పనులు చేపడితే బళ్లారి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు రైతులకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయాన్ని విస్మరించి గత ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల ప్రస్తుతం లైనింగ్‌ పనులు చేపట్టేందుకు ఇబ్బందికరంగా మారిందని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఎల్‌ఎల్‌సీ ద్వారా ప్రస్తుతం 1,800 క్యూసెక్కులు వెళుతున్నాయి. ఈ పైప్‌లైన్‌ వేస్తే 72వ కిలోమీటర్‌ నుంచి 185వ కిలోమీటర్‌ వరకు నీటి సరఫరాను 600 క్యూసెక్కులకు తగ్గించి పైప్‌లైన్‌కు మళ్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఇన్‌ఫ్లో తగ్గి రైతులు నష్టపోతారని, ఇందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించాలని అంటున్నారు. పైగా పైప్‌లైన్‌ వేయడానికి భూసేకరణకు మరో రూ.200 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కర్ణాటకలోని సిరిగేరి వద్ద 72వ కిలోమీటర్‌ నుంచి 185వ కిలోమీటర్‌ కర్నూలు జిల్లా హళగుంద వరకు బోర్డు పరిధిలోకి వస్తుంది. ఈ దృష్ట్యా బోర్డు అనుమతి తీసుకుని జీవోను విడుదల చేయాలి. అయితే అప్పట్లో టీడీపీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన ఓ సీనియర్‌ నాయకునికి పనులు కట్టబెట్టేందుకే చంద్రబాబు హడావుడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమ ప్రభుత్వం రాగానే ఆ మేరకు నిధులు కేటాయిస్తామని అప్పట్లో చెప్పినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు