13వ రోజు పాదయాత్ర డైరీ

21 Nov, 2017 03:20 IST|Sakshi

20–11–2017, సోమవారం
గోర్లగుట్ట, కర్నూలు జిల్లా

అడిగే హక్కు అక్కాచెల్లెమ్మలకు లేదా?
చంద్రబాబు పాలనపై, రాష్ట్ర ప్రజలే కాదు.. సూర్య భగవానుడు కూడా ఆగ్రహంగా ఉన్నట్లున్నాడు! బనగానపల్లెలో ఈ రోజు ఉదయం ప్రారంభమైన పాదయాత్ర హుస్సేనాపురం చేరుకునే సమయానికి బాలభానుడు భగభగల భానుడయ్యాడు. పోలీసులు సృష్టించిన అడ్డంకులను, పెళపెళ కాస్తున్న ఎండనీ లెక్క చెయ్యకుండా ‘మహిళా సదస్సు’కు చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల అక్కాచెల్లెమ్మలతో హుస్సేనాపురం నడుం బిగించిన ఉద్యమనారిలా గర్జించింది. ఏకదీక్షతో వింటిని సారించి చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహ శరాలను సంధించింది. 

వేదిక స్థలం పరిధిని కూడా మించి వేలాది మంది తరలి రావడంతో చాలామంది అక్కాచెల్లెమ్మలు కుర్చీలు లేక నిలుచోవాల్సి వచ్చింది. వేదికపై నుంచి లేచి నిలబడి వారికి నా క్షమాపణలు చెప్పాను. ‘నిలుచున్నామా, కూర్చున్నామా అని కాదు.. ఈ సదస్సు సాక్షిగా చంద్రబాబును నిలదీయడానికి, ఆయన అబద్ధాల కట్టుబట్టల్ని తీయించి, నిలబెట్టడానికి వచ్చాం’ అనే దృఢసంకల్పం వారి మాటల్లో ధ్వనించింది. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం.. ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించడానికి సదస్సుకు వస్తున్న మహిళల గొంతును నొక్కేయడం, పోలీసులను పెట్టించి మార్గమధ్యంలోనే వారిని అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా? అనే సందేహం కలుగుతోంది. 

పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయేలా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. పొదుపు సంఘాల్లో అప్పు ఉంటే మొత్తం తీర్చేస్తాం అని చెప్పి, ఇప్పుడు ముఖం చాటేసింది. ఇంటి వద్దకే మద్యం అంటూ ఇంటి పెద్దకు బెల్టు అందించింది. ఇల్లాలిని కంటతడి పెట్టించింది. పేదరికంతో, నెరవేరని హామీలతో కుటుంబాలు నాశనం అవుతుంటే, మహిళల అశ్రు శకలాలపైన ఆకాశ సౌధాలు కట్టుకోవాలని చంద్రబాబు పరితపిస్తున్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఆడపడుచులు సంతోషంగా లేని ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా.. అభివృద్ధి చెందగలదా?! 
గోవిందదిన్నెలో జేఏసీ విద్యార్థులు నన్ను కలిశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబు ప్రభుత్వం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులను అణిచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా సాధన కోసం విజయవాడలో ఇవాళ జరిగిన అఖిలపక్షాల ‘చలో అసెంబ్లీ’ ప్రదర్శనను ప్రభుత్వం భగ్నం చేయడం దారుణమని వాపోయారు. వారికి సంఘీభావంగా వారి ప్లకార్డు చేతబట్టుకుని నేనూ నాలుగు అడుగులు వేశాను.

చివరిగా చంద్రబాబుకు నాదొక ప్రశ్న. డ్వాక్రా సంఘాల రుణాలు బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక డ్వాక్రా అక్కాచెల్లెమ్మలను మోసం చెయ్యడం న్యాయమేనా? మీ కారణంగా అపరాధ వడ్డీ దాదాపు రూ.2,000 కోట్లు కట్టలేక ఆడపడుచులు అష్టకష్టాలు పడడం వాస్తవం కాదా?
- వైఎస్‌ జగన్‌ 

తాము సాగు చేస్తున్న భూమికి పట్టాలు ఇప్పించాలని బనగానపల్లెలో వైఎస్‌ జగన్‌కు విన్నవిస్తున్న మంగంపేట తండా మహిళలు 

మరిన్ని వార్తలు