13 వరకు ఓటర్ల పరిశీలన ప్రక్రియ

5 Jan, 2014 02:51 IST|Sakshi
 గుంటూరుసిటీ,న్యూస్‌లైన్ :ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీకరించిన క్లెయింలు, అభ్యంతరాలను పరిశీలించే గడువును ఈనెల 10వ తేదీనుంచి 13వ తేదీకి(మూడు రోజులు) కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. విశాఖపట్నం నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థన మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలన గడువును పొడిగించిందని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరు గమనించి 13వతేదీ లోగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పరిష్కరించిన వాటి వివరాలను ఏరోజు కారోజు అప్‌డేట్ చేయాలన్నారు. 16వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగాని, మార్చిలోగాని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నందున, ఓటర్ల నమోదు ప్రక్రియ జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు.
 
 ఓటర్ల నమోదుపై ఏ విధమైన ఫిర్యాదులు అందినా వాటిని తుది జాబితా విడుదల చేసేలోగా పరిష్కరించాలని ఆయన సూచించారు. ఈవీఎంలను నిల్వచేసేందుకు చేపట్టిన గోడౌన్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే పూర్తయిన గోడౌన్లలోకి ఈవీఎంలను తరలించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ గత నెల 23 నాటికి సుమారు 3లక్షల 26వేల క్లెయింలు, అభ్యంతరాలు వచ్చాయన్నారు. వీటిలో 54 శాతం విచారణ పూర్తయిందని,26 శాతం డేటా నమోదు చేసినట్టు వివరించారు. పెండింగ్‌లో ఉన్న  క్లెయింలు, అభ్యంతరాలను 13లోగా పరిష్కరిస్తామని చెప్పారు. గోడౌన్ల నిర్మాణం నెలాఖరుకు పూర్తిచేస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో జె.సి వివేక్‌యాదవ్, అదనపు జేసీ  కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, ఈఆర్వో, ఏఈఆర్వోలు పాల్గొన్నారు.
 
>
మరిన్ని వార్తలు