పోస్టింగుల్లేవ్‌.. ఊస్టింగులే

14 Dec, 2018 02:15 IST|Sakshi

ఖాళీ పోస్టుల రద్దు ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదముద్ర

రాష్ట్ర విభజన నాటికి ఏపీలో1.42 లక్షల పోస్టులు ఖాళీ 

నాలుగున్నరేళ్లలో 98 వేలకు పైగా  ఉద్యోగుల పదవీ విరమణ 

రాష్ట్రంలో 2.40 లక్షలకు పైగా ఖాళీ ఉద్యోగాలు

ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉన్న పోస్టులకే సర్కారు ఎసరు 

అవసరమైతే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌  కింద నియమించుకోవాలని సూచన 

కానిస్టేబుల్, అటెండర్లు వంటి నాలుగో తరగతి పోస్టులనూ వదలని సర్కారు

సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను నిలువునా ముంచేస్తోంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలేవీ ఇవ్వకపోగా, ఉన్న పోస్టులనే ఊడగొడుతోంది. పలు శాఖల్లో ఖాళీ పోస్టుల రద్దు ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఖాళీ పోస్టుల భర్తీ సంగతిని పక్కన పెడితే, అసలు ఉన్న పోస్టులనే రద్దు చేస్తూ ఖాళీలు లేవని చెప్పేందుకు సర్కారు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత నాలుగున్నరేళ్లలో 90 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే ఖాళీ పోస్టుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇందులో చాలా పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆఖరికి పోలీసు కానిస్టేబుళ్లు, అటెండర్లు వంటి నాలుగో తరగతి పోస్టులను సైతం వదలడం లేదు. అంటే పెద్ద చదువులు చదువుకోలేక పదో తరగతి, ఇంటర్‌తో ఆపేసిన పేద కుటుంబాల్లోని నిరుద్యోగులకు సర్కారు కొలువులు ఎండమావిగా మారిపోతున్నాయి.  నోరు విప్పని ఉద్యోగ సంఘాల నేతలు  రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పోస్టులను ఒకవైపు ఇష్టానుసారంగా రద్దు చేస్తూమరోవైపు అవసరమైతే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానం కింద సిబ్బందిని నియమించుకోవాలని శాఖలకు సూచిస్తోంది. ఆసుపత్రులు, మున్సిపాల్టీలు, పంచాయతీల్లో నాలుగో తరగతి పోస్టులను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఏజెన్సీలకు అప్పగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అప్పటి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 22,523 నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఏకంగా ఆ పోస్టులనే రద్దు చేస్తోంది. పోస్టులను రద్దు చేస్తున్నా ఉద్యోగ సంఘాల నేతలు నోరు విప్పడం లేదు. సర్కారు చర్యలను ఖండించకుండా ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. 

నాలుగేళ్లలో 98,273 మంది ఉద్యోగుల తగ్గుదల 
రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. మరోవైపు పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం నిబంధనల మేరకు ఉద్యోగుల సంఖ్యను, రాష్ట్ర ద్రవ్య నివేదికను శాసనసభకు సమర్పిస్తుంది. దీని ప్రకారం చూస్తే రాష్ట్ర విభజన అనంతరం 2014 డిసెంబర్‌ 31 నాటికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4,43,854 అని ద్రవ్య నివేదికలో సర్కారు పేర్కొంది. 2018 మార్చిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య నివేదికలో 2018 జనవరి నాటికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,45,581 అని వెల్లడించింది. అంటే గత నాలుగేళ్లలో 98,273 మంది ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. 

నిర్దాక్షిణ్యంగా చిరుద్యోగుల తొలగింపు 
గత ప్రభుత్వంలో పని చేశారనే నెపంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే పలువురు చిరుద్యోగులపై వేటు వేశారు. 29,439 మంది ఆదర్శ రైతులను తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పని చేస్తున్న 3,500 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధి శాఖలో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 3,800 మందిని ఇళ్లకు పంపించేసింది. అర్హత లేదన్న సాకుతో 1,000 మందికి పైగా గోపాలమిత్రలను తొలగించారు. 4,500 మంది ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను, ఆయుష్‌లో 800 మందిని, వయోజన విద్యలో 20 వేల మంది మండల, గ్రామ రిసోర్స్‌ పర్సన్లను టీడీపీ సర్కారు తొలగించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో వంటచేసే వర్కర్లను దశలవారీగా వేల మందిని తొలగించి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. అలాగే న్యూట్రిషన్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్లలో పనిచేస్తున్న న్యూట్రిషనిస్టులను, సహాయకులను కూడా తొలగించింది. 

సాధారణ పరిపాలన శాఖలో పోస్టులు రద్దు 
సాధారణ పరిపాలన శాఖలో 15 ఆఫీస్‌ సబార్టినేట్‌ పోస్టులతోపాటు మరో 15 చౌకీదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను రద్దు చేయడం వల్ల ఏటా మిగిలే రూ.75 లక్షలతో ఈ–ఆఫీస్‌ కోసం ఇద్దరు ప్రాజెక్టు మేనేజర్లు, 8 మంది అసిస్టెంట్‌ మేనేజర్లను కాంట్రాక్టు విధానంలో తీసుకుంటామని సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇలా 30 ప్రభుత్వ పోస్టులను రద్దు చేసి పది మందిని కాంట్రాక్టు విధానంలో తీసుకుంటే ఏడాదికి రూ.63.60 లక్షల వ్యయం మాత్రమే అవుతుందని, దీనివల్ల నిధులు మిగులుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శ్రీకాంత్‌ జీవో జారీ చేసిన తరువాత ఆ ప్రతిపాదనలను ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. 

కానిస్టేబుల్‌ పోస్టులు కనుమరుగు 
అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఖాళీగా ఉన్న 103 సివిల్‌ పోలీసు కానిస్టేబుల్‌ పోస్టులను కనుమరుగు చేస్తూ ఆ స్థానంలో 58 మంది సైంటిఫికల్‌ అసిస్టెంట్లను తీసుకోవాలని హోంశాఖ ప్రతిపాదన చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి నిధులు మిగులుతాయని అందులో పేర్కొంది. దీన్ని కూడా ఇటీవల మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 5 టైపిస్ట్‌ పోస్టులను కనుమరుగు చేస్తూ ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేయాలని హోంశాఖ ప్రతిపాదించగా ఇందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఐదు టైపిస్ట్‌ పోస్టులను కనుమరుగు చేస్తూ ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లను తీసుకోవాలని హోంశాఖ చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఉద్యోగం లేదు.. భృతి రాదు 
ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి చెల్లిస్తామని గత ఎన్నికల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా నాలుగున్నరేళ్లు గడిచాక ఎన్నికలకు నాలుగు నెలల ముందు నెలకు కేవలం రూ.1,000 చొప్పున భృతి ఇస్తామంటూ మాట మార్చారు. గత ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించినా ఏ ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగం లేదా భృతి ఇవ్వాల్సి ఉండగా సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల సంఖ్యను 9.38 లక్షలకు తగ్గించేశారు. ఏరివేతల అనంతరం కేవలం 1.98 లక్షల మందికే అరకొరగా భృతి చెల్లించడం గమనార్హం.   

మరిన్ని వార్తలు