ఫారెస్టులో 144 సెక్షన్

12 Jul, 2014 01:10 IST|Sakshi

 మహానంది:  నల్లమల ఫారెస్టులో 144 సెక్షన్ విధించినట్లు నంద్యాల డీఎఫ్‌ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తే కేసు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. మహానందిలోని పర్యావరణ కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన నర్సరీని శుక్రవారం డీఎఫ్‌ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణాను అరికట్టేందుకు, అటవీ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 ఇందులో భాగంలో అడవిలో ఆరునెలల పాటు 144 సెక్షన్ విధించామన్నారు. అడవుల్లో వన్యప్రాణుల దాడికి గురైతే గతంలో లాగా ప్రస్తుతం ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదన్నారు. అడవిపై ఆధారపడి జీవించేవారు ప్రత్యామ్నయం చూసుకోవాలని ఆమె సూచించారు. అటవీ ప్రాంతంలో వెదురు మొక్కలను నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని, కడప, ప్రొద్దుటూరు పరిధిలో 10 లక్షల మొక్కలు, నంద్యాల డివిజన్ పరిధిలో 5 లక్షల మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

నంద్యాల డివిజన్ పరిధిలో 50 హెక్టార్లలో మొక్కలు పెంచుతామన్నారు. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, భవిష్యత్తు తరాలకు అడవుల ద్వారా ఎన్నోప్రయోజనాలను అందించాల్సిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నంద్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శివకుమార్ సూచించారు. ఆమె వెంట ఎఫ్‌ఆర్‌ఓ శివకుమార్, డీఆర్‌ఓ త్యాగరాజు, సిబ్బంది కృష్ణమూర్తి ఉన్నారు.

 ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
 నంద్యాల అర్బన్: ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని నంద్యాల ఇన్‌చార్జ్ డీఎఫ్‌ఓ శ్రీలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎర్రచందనం నిల్వలపై దాడులు ముమ్మరం చేశామన్నారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, ఫారెస్ట్ శాఖల సమన్వయంతో అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

అనుమానిత గ్రామాలు, ఇళ్లలో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. నిందితులు, స్మగ్లర్లపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేస్ క్యాంప్, నాకాబందీ, స్ట్రెకింగ్ ఫోర్స్, మొబైల్ పార్టీలు బలోపేతం చేశామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అత్యాధునిక ఆయుధాలను అటవీ శాఖ సమకూర్చుకుంటుందని వెల్లడించారు. ప్రస్తుతం గుండ్ల బ్రహ్మేశ్వరం టైగర్ ఫారెస్ట్‌పై దృష్టి సారించామన్నారు. డివిజన్‌లో 10 లక్షల వెదురు మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

మరిన్ని వార్తలు