నాడు 215 కేజీలు.. నేడు 70 కేజీలు

10 Mar, 2017 03:16 IST|Sakshi
నాడు 215 కేజీలు.. నేడు 70 కేజీలు

బేరియాట్రిక్‌ సర్జరీతో వ్యక్తి బరువును రెండేళ్లలో భారీగా తగ్గించిన ఎండోకేర్‌ ఆస్పత్రి

లబ్బీపేట (విజయవాడ తూర్పు): అధికబరువుతో బాధపడుతున్న ఓ వ్యక్తికి ఎండోకేర్‌ ఆస్పత్రి వైద్యులు బేరియాట్రిక్‌ సర్జరీతో పునర్జన్మ ప్రసాదించారు. తెలంగాణలోని నారాయణ్‌ఖేడ్‌కు చెందిన పండరీనాథ్‌ 215 కేజీల బరువుతో బాధపడుతుండగా.. రెండేళ్ల కిందట విజయవాడ ఎండోకేర్‌ ఆస్పత్రి వైద్యులు అతనికి బేరియాట్రిక్‌ సర్జరీ చేశారు. దీంతో అతను ఏకంగా 145 కేజీలు తగ్గాడు. ఈ వివరాలను ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ రవికాంత్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీలో చిరుద్యోగి అయిన పండరీ నాథ్‌ రెండేళ్ల క్రితం 215 కిలోల బరువుకు చేరుకోవడంతో నడవడం కష్టంగా మారింది.

దీంతో విజయవాడలోని ఎండోకేర్‌ ఆస్పత్రిని సంప్రదించాడు. ఆస్పత్రి ఖర్చులు సైతం భరించలేని స్థితిలో ఉండటంతో మందుల కోసం దాతల నుంచి కొంత మొత్తాన్ని సేకరించి, ఫీజులేమీ తీసుకోకుండానే ఆస్పత్రి వైద్యులు చికిత్స చేశారు. నీరు తగ్గించే మందుల ద్వారా తొలుత 10 కిలోల బరువు తగ్గించిన వైద్యులు.. అనంతరం 2014 డిసెంబర్‌లో బేరియాట్రిక్‌ సర్జరీ చేశారు. దీంతో రెండేళ్లలో క్రమేపీ 120 కేజీల బరువు వరకు తగ్గి.. 95 కేజీలకు చేరుకున్నాడని డాక్టర్‌ రవికాంత్‌ చెప్పారు. అయితే అతనిలోని కొలెస్ట్రాల్‌ అంతా కరిగిపోయి చర్మం వేలాడుతుండటంతో 20 రోజుల క్రితం రెండోసారి శస్త్రచికిత్స నిర్వహించి, దానిని తొలగించినట్లు చెప్పారు. దీంతో పండరీనాథ్‌ మరో 25 కేజీల బరువు తగ్గి.. 70 కేజీలకు చేరుకున్నాడని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడని వివరించారు.

మరిన్ని వార్తలు