14వ రోజు పాదయాత్ర డైరీ

22 Nov, 2017 04:47 IST|Sakshi

21–11–2017, మంగళవారం
కొలుములపల్లె, కర్నూలు జిల్లా 

జీవించే హక్కును కాలరాస్తున్నారు..
ఈ ఉదయం డోన్‌ నియోజకవర్గంలోని గోర్లగుట్ట గ్రామం నుంచి సాయంత్రం కొలుములపల్లె చేరేవరకూ పాదయాత్ర పొడవునా ప్రజల మాటల్లో నిరాశ, నిస్పృహలే కనిపించాయి! ఎక్కడ చూసినా ప్రభుత్వ నిరాదరణ, నిర్లక్ష్యం, నీతిమాలినతనమే!. చంద్రబాబు ఇస్తానన్నది ఇవ్వలేదు.. చేస్తానన్నది చెయ్యలేదు.. ప్రతిచోటా ఇదే ఘోష.. ఇదే ఆక్రోశం.. ఇదే ఆవేదన.  
 
ఈ నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు లేదు. సాగునీరూ లేదు! అనేక చెరువులున్నా గొంతుకు గుక్క నీరు, చేనుకు చుక్క నీరు లేదంటే ప్రభుత్వ చేయూత ఏమాత్రం ఉందో తెలుస్తోంది. ఇక్కడి నాపరాళ్ల పరిశ్రమ పైన కూడా నారా వారి దయలేక వేలమంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ ప్రాంతం పాలిషింగ్‌ యూనిట్లకు ప్రసిద్ధి.. వేలాది కుటుంబాలు ఈ యూనిట్ల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, నిర్దయాపూరిత చర్యల కారణంగా ఈ పాలిషింగ్‌ యూనిట్లు ఇబ్బందుల్లో పడ్డాయి. చెల్లించాల్సిన రాయల్టీలు, విద్యుత్‌ చార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని మూతపడ్డాయి, మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్నాయి. 
 
కర్నూలు జిల్లా మొత్తంమీద ఒక్క ఎకరాకు కూడా నీటిపారుదల సౌకర్యంలేని నియోజకవర్గం ఇదొక్కటే. తాగునీటికి కూడా ఇక్కడ కటకటగా ఉంది. జీవనాధారమైన పాలిషింగ్‌ యూనిట్లు, వ్యవసాయం.. రెండూ లేకపోవడంతో వేలాది పేద కుటుంబాలు పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసపోతున్నాయి. పుట్టిపెరిగిన చోటే బతికి బట్టకట్టలేకపోవడం ఎంత దారుణమైన పరిస్థితి! మనిషి జీవించే హక్కునే కాలరాసేలా.. కనీస వసతులు, ఉపాధి కల్పించలేని ప్రభుత్వమూ ఒక ప్రభుత్వమేనా? ఈ పరిస్థితిని మార్చాలి. మైనింగ్‌కు పుష్కలంగా వనరులు ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలను తిరిగి బతికించాలి.. వలసలను ఆపాలి.  
 
పాదయాత్రలో ఈ ఉదయం ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. పేరు శ్రీవాణి. ఆమె కూతురు ఒక చదువుల తల్లి. ఆమె మాత్రం శోకదేవతలా ఉంది! దుఃఖాన్ని ఆపుకొంటోంది. ‘ఎస్సెస్సీ బోర్డు చేసిన తప్పు వల్ల నా కూతురుకు ట్రిపుల్‌ ఐటీలో రావాల్సిన సీటు రాకుండా పోయిందన్నా.. న్యాయం కోసం తిరిగీ తిరిగి అలసిపోయాం అన్నా’ అని వాపోయింది. ఆ తల్లి దుఃఖం చూస్తే కడుపు తరుక్కుపోయింది. ‘అమ్మా.. నేను బాగా చదువుకుని నిన్ను, నాన్నను బాగా చూసుకుంటాను’ అని చెప్పిన ఆ పాప.. ‘టెన్త్‌లో నేను గ్రేడు సాధించినా, ఎవరో చేసిన తప్పునకు నాకెందుకు శిక్ష పడిందమ్మా?’ అని ఆ తల్లిని అమాయకంగా అడుగుతోందట. ఇటువంటి ఎన్నో అన్యాయాలు, పాలనా వైఫల్యాలు ఉన్నా ప్రశ్నించే అవకాశం లేక నిస్సహాయంగా ఉన్న ప్రజలు పాదయాత్రలో నా దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇలా మోసపోయిన, ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసమే నా ఈ ప్రజాసంకల్ప యాత్ర.  
 
చివరిగా చంద్రబాబు గారికొక ప్రశ్న.. మీరు ముఖ్యమంత్రి అయ్యాక కర్నూలులో మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ జిల్లాకు, ఈ నియోజకవర్గానికి మీరిచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చానని ధైర్యంగా చెప్పగలరా? ఈ నియోజకవర్గానికి తాగు నీరు, సాగు నీరు అందిస్తానని మీరిచ్చిన హామీలు నీటి మూటలేనా? సాగునీటి సౌకర్యమూ సరిగా లేక, పండించిన పంటకు గిట్టుబాటు ధరా రాక కటకటలాడుతున్న రైతాంగానికి మీ వల్ల ఒరిగిందేమిటి? 
- వైఎస్‌ జగన్‌ 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందిస్తున్న శ్రీవాణి 

మరిన్ని వార్తలు