పల్లెకు పైసలొచ్చాయ్‌...! 

28 Mar, 2020 09:35 IST|Sakshi

కష్ట కాలంలో కరుణించిన  కేంద్ర  ప్రభుత్వం  

అందుబాటులోకి 14వ ఆర్థిక సంఘం నిధులు 

గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూ.46.46 కోట్లు జమ 

తీరనున్న పారిశుద్ధ్య,  తాగునీటి సమస్యలు 

విజయనగరం: రెండేళ్లుగా నిధుల కొరతతో సతమతమవుతున్న పంచాయతీలపై కేంద్ర ప్రభు త్వం కరుణ చూపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిబంధనలను పక్కనపెట్టి 14వ ఆర్థిక సంఘం నిధులను మంజూరు చేసింది. దీనిద్వారా పల్లెలు పారిశుద్ధ్య, తాగునీటి సమస్యల నుంచి గట్టెక్కేందుకు అవకాశం లభించింది. జిల్లాలో 919 గ్రామ పంచాయతీలకు రూ. 46,46,65,800లు ఆర్థిక సంఘం నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం వీటిని పల్లె ఖాతాలకు జమ చేస్తున్నారు. గత  ప్రభుత్వ హయాంలో జరగాల్సిన గ్రామ పంచాయతీల ఎన్నికలు అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహించకపోవడంతో నిధులు విడుదల కాకుండా పోయాయి. అప్పటి నుంచి కేవలం సాధారణ నిధులతోనే పల్లెలు నెట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం  ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణుకుతున్న  కష్టకాలంలో నిధులు అందుబాటులోకి రావడంతో  అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నాడు సగం నిధులే...:
పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం 2018 ఆగస్టుతో పూర్తయింది. అప్పటినుంచి ఎన్నికలు లేకుండా పంచాయతీలన్నీ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు సగం మాత్రమే వచ్చాయి. పాలకవర్గాలు లేకపోవడంతో మిగతా నిధులు మంజూరు చేయలేదు. 2019–20 సంవత్సరానికి సంబంధించిన నిధులు నిలిచిపోయాయి. ఇటీవల స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆఖరి నిమిషంలో కరోనా వల్ల అవీ వాయిదా పడ్డాయి. దీనివల్ల 14 ఆర్థిక సంఘం నిధులు మరి రావని ఆందోళన చెందారు. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విషపు కోరలు చాస్తుండడంతో గ్రామాల్లో నిధుల సమస్య తలెత్తకూడదన్న ఉద్దేశంతో కేంద్రం ఎన్నిక లు నిర్వహించకపోయినా బకాయిలు విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 46.46 కోట్లు జిల్లాకు మంజూరు చేశారు.

జనాభా ప్రాతిపదికన సర్దుబాటు:
జిల్లాకు వచ్చిన ఆర్థిక సంఘం నిధులను జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు సర్దుబాటు చేస్తున్నారు. తలసరి రూ.242 చొప్పున పంచాయతీలో ఎంతమంది జనాభా ఉంటే అంత మొత్తం ఖాతాల్లో జమ చేస్తున్నారు.  ఆర్థిక సంఘం నిధులను కొత్త పంచాయతీలకు కూడా జనాభా ప్రాతిపదికన సర్దుబాటు చేయాల్సి ఉంది.

నిబంధనలకు లోబడే వినియోగం:
నిధులు అందుబాటులో ఉన్నాయని ఇష్టానుసారం ఖర్చు చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆయా అవసరాలకు దామాషా ప్రకారం ఖర్చుచేయాల్సి ఉంటుంది. మంజూరైన రూ. 46.46 కోట్లలో రూ. 4.09 కోట్లు సమగ్ర రక్షిత నీటి పథకాల నిర్వహణకు, మరో రూ.1.60 కోట్లు బోరువావుల నిర్వహణకు జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. మిగిలిన రూ. 40.76 కోట్లు పంచాయతీల ఖాతాల్లోకి జమ చేసేందుకు జిల్లా  పంచాయతీ ఖాతాల్లోకి సర్దుబాటు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు