నేడు ఆర్థిక రంగ నిపుణుల సమావేశం

12 Sep, 2013 08:22 IST|Sakshi

హైదరాబాద్: ఆర్థిక రంగ నిపుణుల కమిటీ సమావేశం నేడు జూబ్లీహాలులో జరగనుంది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 14వ ఆర్ధిక సంఘానికి ఏడు కీలక అంశాలపై ప్రతిపాదనలు సమర్పించేందుకు  రాష్ట్ర సర్కార్ ఈ సందర్భంగా సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటికి కేటాయిస్తున్న నిధులు వంటి అంశాలపై సోదాహరణంగా ఆర్ధిక సంఘానికి వివరించాలని నిర్ణయించింది.

ఈరోజు ఉదయం జూబ్లీ హాలులో ఆర్థిక శాఖ నిర్వహించే సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, అధికారులు ఆర్ధిక సంఘం ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి, సభ్యులు అనిజిత్ సేన్, సుష్మానాధ్, ఎం.గోవిందరావు, సుదిప్తో మండల్, కేంద్రం నుంచి వచ్చే పలువురు అధికారులు కూడా సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవసరాలను వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటోంది.

ఏడు రంగాలకు సంబంధించిన అవసరాలపై ఆర్ధిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, ఎస్సీ-ఎస్సీ సబ్‌ప్లాన్, ఆరోగ్యం, నగదు బదిలీ పథకం, నీటిపారుదలశాఖలపై ఈ ప్రతిపాదనలు ఉంటాయి. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, వాటిపై చేస్తున్న ఖర్చు, అందుకు కావాల్సిన నిధులు వంటి అంశాలను వివరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

మరిన్ని వార్తలు