దరికి రాబోకు సు'నా'మీ!

26 Dec, 2019 13:31 IST|Sakshi
కొత్తపట్నం సముద్ర తీరం

సునామీ వచ్చి 15 ఏండ్లు

2004లో జిల్లాలో 36 మందిని బలిగొన్న రాకాసి అలలు

ఇప్పటికీ వెంటాడుతున్న నాటి చేదు జ్ఞాపకాలు

కడలి తీరంలో సునామీ విలయతాండవం సృష్టించి నేటికి సరిగ్గా 15 ఏళ్లు. 2004 డిసెంబర్‌ 26న సంభవించిన జలప్రళయం.. ఆ రాకాసి అలల చేదు జ్ఞాపకాలు నేటికీ తీర ప్రాంతవాసులను వెంటాడుతూనే ఉన్నాయి. ఉవ్వెత్తున ఎగసి, ఉప్పెనలా వచ్చి మత్స్యకారుల     గ్రామాలను అతలాకుతలం చేసిన సునామీ తీరంలో నిలిపిన బోట్లు,  వలలను తనలో కలిపేసు కుంది.జిల్లాలో 36 మందిని పొట్టన పెట్టుకుంది. 

చీరాల: సునామీ కెరటాల బీభత్సానికి 15 ఏళ్లు నిండాయి. 2004 డిసెంబర్‌ 26న సునామీ సృష్టించిన జలప్రళయం జిల్లాలో 36 మందిని పొట్టనపెట్టు కుంది. 2004 డిసెంబర్‌ 25న అర్ధరాత్రి ఇండోనేషియాలో వచ్చిన భూకంపం సముద్రంలో సునామీకి కారణమైంది. దీని ప్రభావంతో జిల్లాలో 102 కిలోమీటర్ల పొడవు ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో భయోత్పాతం సంభవించింది. ఉదయం 7 గంటల సమయంలో ఒకసారి, 9 గంటల సమయంలో మరోసారి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి, ఉప్పెనలా వచ్చి మత్స్యకారుల గ్రామాలను అతలాకుతలం చేశాయి. తీరంలో నిలిపిన బోట్లు, వలలు, ఇంజన్లను తనలో కలిపేసు కుంది. ఇళ్ళల్లోకి చొచ్చు కొచ్చిన సముద్ర జలాల నుంచి ప్రాణాలను దక్కించుకునేందుకు మత్స్యకారులు ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని మెరక ప్రాంతాలకు పరుగులు తీశారు.  

వేటపాలెం మండలంలోనే అత్యధిక మరణాలు:
అత్యధికంగా వేటపాలెం మండలంలో 12 మంది మృత్యువాత పడ్డారు. పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం, కఠారివారి పాలెం, రామచంద్రాపురం సముద్రతీర మత్స్యకార గ్రామాల్లో అది ఒక విషాధ దినం. ఆరోజు ఉదయాన్నే మత్స్యకారులు వేటకెళ్లి తమ వలల్లో పడిన చేపలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి వేరు చేస్తున్నారు. అది ఆదివారం కావడంతో తల్లిదండ్రులతో వారి పిల్లలు సముద్రతీరంలో ఆడుకోవడానికి వెళ్లారు. మత్స్యకారులు చేపలను గ్రేడింగ్‌ చేసే పనిలో నిమగ్నమయ్యారు. దాదాపు ఇరవై అడుగుల ఎత్తులో కెరటం సముద్రం నుంచి తీరానికి భీకర శబ్ధం చేసుకుంటూ వచ్చి పైన పడింది. ఇది గమనించని మత్స్యకారులు, వారిపిల్లలు ఆ కెరటం తాకిడికి నీటిలో కొట్టుకు పోయారు. అంతేగాక తీరం వెంట ఉంచిన పడవలు, బోట్లు గల్లంతయ్యాయి. నిమిషాల వ్యవధిలో ఈఘోర కలి జరిగింది. జిల్లాలో అత్యధికంగా ఈ జలప్రళయానికి వేటపాలెం మండలంలో పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామంలో పది మంది, రామాపురంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రెండు కుటుంబాల్లో మాత్రం ఇద్దరిద్దరు మృతి చెందారు. పొట్టిసుబ్బయ్య పాలెంలో మృతిచెందిన వారిలో కొండూరి చిట్టిబాబు, వాయిల శ్రీనివాసరావు, కొండూరి నారాయణమ్మ, వాయిల అన్నపూర్ణ, వాయిల రాములమ్మ, వాయిల అంకమ్మ, చిన్న పిల్లలు ఆవుల రాజేశ్వరి, బుచ్చంగారి విజయ, బుచ్చంగారి నరసయ్య, కొండూరి తిరుపాలు మృతి చెందారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వాయిల శ్రీనివాసరావు, ఈయన కూతురు అంకమ్మ ఉన్నారు. బుచ్చంగారి విజయ, నరసయ్య ఉన్నారు. వీరు కాక మరో ఇద్దరు రామాపురం తీరంలో మృతి చెందారు. పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరం వద్ద సునామీకి గుర్తుగా మృతవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు. దీని వద్ద ఏటా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు, గ్రామప్రజలు శ్రద్ధాంజలి ఘటిస్తుంటారు.  

ఉలవపాడు మండల పరిధిలో..
ఉలవపాడు: మండల పరిధిలో సుమారు 12 కిలోమీటర్లు మేర తీరప్రాంతం ఉంది. 14 గ్రామాలు తీరం వెంబడి ఉన్నాయి. సునామీ రూపంలో ఉదయం సముద్రం బయటకు వస్తుందన్న సమాచారం వచ్చిన వెంటనే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా వెనుకకు వచ్చేశారు. ఈ మండలంలో గ్రామాలు కాస్త దూరంగా ఉండడంతో బకింగ్‌హామ్‌ కెనాల్‌ వరకు సముద్రపు నీరు వచ్చి వెనుకకు వెళ్లిపోయింది. పగలు ఈ ప్రమాదం రావడం వల్ల కాస్త ప్రాణ హాని జరగనప్పటికీ తీరప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోయారు. ఎవరూ గ్రామాల వద్దకు వచ్చే పరిస్థితి లేదు. అధికారులు సైతం నీరు వచ్చి వెళ్లిన తరువాత వచ్చారు కానీ ముందుగా ఎవరూ రాలేదు.  

ఇప్పుడు తలచుకున్నా...భయమేస్తుంది: సునామీ అనే పేరును ఎప్పుడు తలచుకున్నా నాటి జ్ఞాపకాలు భయపెడతాయి అంటున్నారు తీరప్రాంత ప్రజలు. ఆ సమయంలో భోజనం లేక చాలా ఇబ్బందుల పడ్డాం. తరువాత ఆయా గ్రామాల నుంచి ఉలవపాడుకు లారీల్లో తరలించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వసతులు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో మత్స్యకార గ్రామాలకు అండగా పలు సంస్థలు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోర్టు సునామీ కాలనీ పేరుతో బట్టి సోమయ్య పాలెంలో లాయర్లు మత్స్యకారులకు గృహాలు నిర్మించారు. కాసా సంస్థ ఆధ్వర్యంలో తీర ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీల్లో పక్కా భవనాలను నిర్మించారు. సునామీ వచ్చిన రోజును తలచుకుంటేనే అంతా నిశబ్ధ వాతావరణం, భయం మత్స్యకారుల్లో కనిపిస్తుంది. మరొక్కమారు తమ దరికి రాబోకు సునామీ అంటున్నారు తీరప్రాంత గ్రామ ప్రజలు.

పాకల, ఊళ్లపాలెం తీరంలో13 మంది దుర్మరణం
సింగరాయకొండ: కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారిగా రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తటంతో 13 మంది మృత్యువాత పడి నేటికి 15 సంవత్సరాలు. 2004 డిసెంబరు 26వ తేదీ వరకూ సునామి అంటే ఎవరికీ ఏమీ తెలియదు. మత్స్యకారులు పరిగెత్తుకుంటూ వచ్చి అలలు తాటి చెట్టంత ఎగసి పడుతున్నాయని చెబితే అందరు చెప్పిన వ్యక్తిని పిచ్చివాడిలాగా చూశారు. చివరికి వాస్తవం తెలుసుకుని హడలిపోయారు. ఇది జరిగి ఒకటిన్నర దశాబ్ధం అవుతున్నా నేటికీ మత్యకారులు ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంత మవుతున్నారు. 

సముద్ర స్నానానికి వచ్చి ఎనిమిది మందిమృత్యువాత: మండలంలో పాకల తీరం 15 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందలేదు. అప్పటికి కందుకూరుకు చెందిన ముస్లింలు 8 మంది సముద్రస్నానానికి తీరానికి వచ్చారు. వారి దురదృష్టం ఒక్కసారిగా రాకాసి అలలు వారి ప్రాణాలను హరించివేశాయి. ఇది జరిగిన తరువాత చాలా రోజుల పాటు ఎవరూ తీరానికి సముద్ర స్నానానికి వెళ్లలేదు. కానీ ప్రస్తుతం బీచ్‌ బాగా అభివృద్ధి చెందటంతో ఆదివారం కాగానే తీరానికి భారీగా పర్యాటకులు సముద్రస్నానానికి వస్తున్నారు.

ఐదుగురిని బలిగొన్న రాకాసి అలలు:రాకాసి అలల తాకిడికి ఊళ్లపాలెంనకు చెందిన గొల్లపోతు ఆదిలక్ష్మి ఇద్దరు కూతుళ్లతో పాటు మరో ముగ్గురు కన్నా మంగమ్మ, కన్నా స్వాములమ్మ, అయిల శ్రావణిలు కూడా మృతి చెందారు. వీరు ముగ్గురు తమ భర్తలు ఎండ్రకాయలు వేటాడితేగా వారికి భోజనం తీసుకుని వెళ్లారు. తమవారు ఎండ్రకాయలు వల నుంచి వేరు చేయడాన్ని చూస్తూ ఒడ్డున ఉండగా ఒక్కసారి వచ్చిన అలలు ఆ ముగ్గురిని నెట్టి వేశాయి. దీంతో తీరం వద్ద చేపలు నిల్వ చేసుకునేందుకు వీలుగా నిర్మిస్తున్న షెడ్డు ఇనుప చువ్వలు గుచ్చుకుని వీరు ముగ్గురు చనిపోయారు. అయితే వారి భర్తలు మాత్రం అలల నుంచి తమను తాము రక్షించుకుని బయటపడగలిగారు. 

పెనుప్రమాదం తప్పింది: వాస్తవానికి ఆరోజు ఆదివారం కావటంతో సింగరాయకొండకు చెందిన ఆర్యవైశ్యులు ఉలవపాడు మండలం కరేడు తీరానికి విహార యాత్రకు  వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. అయితే అదృష్టవశాత్తు ఆ కార్యక్రమం రద్దయింది. అదే కనుక విహారయాత్రకు వెళ్లుంటే పరిస్థితి ఏవిధంగా ఉండేదోనని ఆర్యవైశ్యులు నేటికి చర్చించుకుంటున్నారు.

నా ఇద్దరు బిడ్డలను మింగేసింది
ఆరోజు మా ముగ్గురు కుమార్తెలు రాజ్యం, అపర్ణ, అనితలను తీసుకుని భర్తతో కలిసి నేను ఉప్పు కొఠారుల్లో పనికి వెళ్లాను. ఆ సమయంలో నా భర్త గోపాల్‌ పనిమీద వేరే చోటికి వెళ్లాడు. నేను కొద్ది దూరంలో ఉన్న ఆయిల్‌ ఇంజన్‌లో డీజిల్‌ పోయడానికి వెళ్లి ఆయిల్‌ క్యాన్‌ కోసం ముందుకు వంగాను. అంతే ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలలు మాపై  విరుచుకుపడ్డాయి. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునేలోగా గుంటలో పడిపోయాను. తరువాత కొంతసేపటికి మరో అల వచ్చి ముందుకు నెట్టడంతో గుంటలో నుంచి పైకివచ్చాను. ఆ సమయంలో అలలకు సమీపంలో ఉన్న ఈత చెట్టు ముందుకు వంగటంతో వెంటనే చీరె సాయంతో ఈత చెట్టును పట్టుకుని  ప్రాణాలు కాపాడుకున్నాను. తరువాత నా కూతుళ్ల కోసం చూడగా సమీపంలోని కాలువ గట్టు మీద చిన్నమ్మాయి అనిత నించుని కనిపించింది. ఆ సంఘటనలో మిగిలిన ఇద్దరు కూతుళ్లు చనిపోయారు (అంటూ గతాన్ని గుర్తు చేసుకుని విలపించింది). అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మా కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అయితే మా చిన్నకూతురు  అలల నుంచి ఏవిధంగా బతికి బయటపడిందో ఇప్పటికీ మిస్టరీగా ఉంది. తర్వాత నా భర్త చనిపోయాడు. కూతురుకు వివాహం చేశాను. కొడుకు ఒంగోలులో ఉంటున్నాడు.  గొల్లపోతు ఆదిలక్ష్మి, ఊళ్లపాలెం,ఉలవపాడు మండలం

మరిన్ని వార్తలు