దేశ సరిహద్దుల్లో.. గిద్దలూరు ‘యుద్ధ’వీరులు

15 Oct, 2017 04:19 IST|Sakshi

ఒకే నియోజకవర్గం నుంచి పాతికవేల మందికిపైగా జవానులు

దేశ సేవకు క్యూ కడుతున్న యువత

ఇప్పటి వరకూ 150 మందికి పైగా వీరమరణం

చుట్టూ నల్లమల అడవులు.. నిరంతరం తాగునీటి కష్టాలు.. నిత్యం కరువు విలయతాండవం.. ఇదీ గిద్దలూరు నియోజకవర్గం పరిస్థితి.. అయితేనేం.. అక్కడి వారి గుండె గుండెలో దేశభక్తి నినాదం ధ్వనిస్తుంది. నరనరాల్లో తెగింపు అగ్నికణిక జ్వలిస్తుంది. దేశం కోసం నిలబడాల్సి వస్తే.. రణక్షేత్రంలో రక్తపుటేరులవుతారు. ప్రజలకోసం ప్రాణాలు పెట్టాల్సి వస్తే.. ఆనందంగా అమరులవుతారు. అందుకే అక్కడి నుంచి యువత సైన్యంలోకి క్యూ కడుతున్నారు. శత్రువుకు ఎదురొడ్డి దేశరక్షణ కోసం ధైర్యంగా పోరాడుతున్నారు. యుద్ధంలో.. ఉగ్రదాడుల్లో ఇప్పటి వరకూ నియోజకవర్గానికి చెందిన 150 మందికిపైగా అశువులుబాశారు.   

గిద్దలూరు
ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం సైనికుల ఖిల్లాగా మారింది. ఇంటికో యువకుడు సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నారు. జిల్లాలో12 నియోజకవర్గాలు, 56 మండలాలున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో ఆరు మండలాలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో ఉన్న సైనికోద్యోగుల మొత్తంలో..  ఒక్క గిద్దలూరు నియోజకవర్గం నుంచే సగానికి పైగా ఉన్నారు. 50 ఏళ్ల కిందట తీవ్ర కరువుతో అల్లాడుతున్న సమయంలో కేవలం ఉపాధి కోసం ఇక్కడి యువత ఆర్మీలో చేరారు. ప్రస్తుతం ఉపాధికి దేశభక్తి తోడవడంతో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోంచి దాదాపు 25 వేల మందికి పైగా ఆర్మీ ఉద్యోగులున్నారు. దేశ సరిహద్దుల్లో ధైర్యంగా నిలబడి శత్రుమూకలతో పోరాడుతున్నారు.

అమరుల పిల్లలూ ఆర్మీలోకే..
ఉగ్రవాదులతో జరిగిన పోరాటాల్లో, శత్రు దేశాలతో జరిగిన యుద్ధాల్లో నియోజకవర్గంలోని సైనికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. మరెంతోమంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారి కుమారులు, సోదరులు తిరిగి ఆర్మీలో చేరిన సందర్భాలున్నాయి. దీనికి కారణం వారికున్న అమితమైన దేశభక్తి, తమ ప్రజలను కాపాడాలన్న దృఢసంకల్పమే.

మగవారంతా సైన్యంలోనే..
నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుంచి ఎక్కువ మంది యువకులు సైన్యంలో చేరారు. అందులో ప్రధానంగా కొమరోలు మండలంలోని మల్లారెడ్డిపల్లె గ్రామం.  గ్రామంలో 84 గృహాలుండగా 490 మంది జనాభా. వీరిలో 180 మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు. ఒక్కో ఇంట్లో మగవారంతా ఆర్మీ ఉద్యోగం చేస్తున్నారు. అర్థవీడు మండలంలోని అంకభూపాలెం, అర్థవీడు, పాపినేనిపల్లె, కందుకూరు, కాకర్ల, రాచర్ల మండలంలోని జేపీ చెరువు, సోమిదేవిపల్లె, ఒద్దులవాగుపల్లె, గౌతవరం గ్రామాలు, కంభం మండలంలోని తురిమెళ్ల, మదార్‌పల్లె, బేస్తవారిపేట మండలంలోని సలకలవీడు, పీవీ పురం, శింగరపల్లె, గిద్దలూరు మండలంలోని గడికోట, ఉయ్యాలవాడ గ్రామాల్లో 60 శాతానికి పైగా ఆర్మీ ఉద్యోగులున్నారు.

150 మందికిపైగా వీరమరణం
యుద్ధంలో.. లేదా ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన వారు నియోజకవర్గంలో 150 మందికి పైగా ఉన్నారు. అంగ వైకల్యం పొందిన వారు దాదాపు 25 మంది వరకూ ఉన్నారు. వైకల్యం పొందిన వారు కొందరు తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులుగా చేరారు. సైన్యంలోచేరితే ఉపాధికి తోడు దేశానికి సేవ చేసే అవకాశం ఉన్నందున ఎక్కువమంది యువకులు ఇక్కడి నుంచి సైన్యంలో చేరుతున్నారు.


నా బిడ్డ బతికుంటే సైన్యంలో చేర్పించే వాడిని
నేను కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్నా. ఎదురు కాల్పుల్లో గుండెకు ఆనుకుని, భుజంపై బుల్లెట్‌ గాయాలయ్యాయి. అప్పటికే ముగ్గురు అధికారులు చనిపోయారు. నేను పోరాడి గాయం కావడంతో బయటకు వచ్చేశాను. దేశం కోసం యుద్ధంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు మరణించాడు. నా కుమారుడు బతికుంటే ఆర్మీలో చేర్పించేవాడిని.  
-నీలి రామకృష్ణుడు, మాజీ సైనికుడు,
ఆకవీడు, రాచర్ల మండలం

నా కుమార్తెకూ ఆర్మీ జవానుతోనే వివాహం చేశా..
నేను 1989లో జరిగిన శ్రీలంక యుద్ధంలో పాల్గొన్నా. నా కుడి కాలికి బుల్లెట్‌ గాయమైంది.  బుల్లెట్‌ గాయం కావడంతో వార్‌ ఇంజురీ కింద పంపించారు. 20 ఏళ్ల పాటు ఆర్మీకి సేవలందించా. నాకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కుమార్తెను ఆర్మీ జవానుకే ఇచ్చి
వివాహం చేశా.  
- పీవీ నారాయణ, మాజీ సైనికుడు, రాచర్ల

మరిన్ని వార్తలు