రబీ సాగుకు 150 టీఎంసీల నీరు

27 Dec, 2013 05:50 IST|Sakshi

ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్:  నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్‌ఎస్‌పీ) ద్వారా ర బీ సాగుకు మూడు ప్రాంతాలకు 50 చొప్పున మొత్తం 150 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు ఎన్‌ఎస్‌పీ సీఈ ఎల్లారెడ్డి తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. నీటి విడుదల మొదలైందని, మార్చి చివరి వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. సాగర్ కుడి కాల్వ పరిధిలో 5.40లక్షల ఎకరాలకు, ఎడమ కాల్వ పరిధిలో 9.30లక్షల ఎకరాలకు నీరు ఇవ్వనున్నట్టు వివరించారు. నీటిని  వారబందీ ప్రకారం విడుదల చేస్తామన్నారు. క్రిష్ణా డెల్టా ప్రాంత పరిధిలోని భూములకు 50 టీఎంసీలు విడుదల చేస్తామన్నారు. టేకులపల్లి సర్కిల్ పరిధిలోని రెండో జోన్‌లో ప్రస్తుతం సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు ఫిబ్రవరి చివరి వరకు మాత్రమే నీరిస్తామన్నారు. రబీ రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేయాలని కోరారు.
 రూ.1100కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు పూర్తి
 సాగర్ కాల్వల ఆధునికీకరణకు ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.4444 కోట్లు మంజూరైనట్టు సీఈ చెప్పారు. ఇప్పటివరకు రూ.1100కోట్ల విలువైన పనులు పూర్తయినట్టు చెప్పారు. నీటి సరఫరా లేని రోజుల్లోనే పనులు చేయాలన్న నిబంధన కారణంగా సాగర్ కాల్వల ఆధునికీకరణ ఆలస్యమవుతోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1100 కోట్ల విలువైన ఆధునికీకరణ పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా ఎంచుకున్నామన్నారు. షెడ్యూల్ ప్రకారంగా నీటి విడుదలను మార్చి 31 నాటికి నిలిపేసి, వెంటనే పనులు చేపడతామని అన్నారు.
 నీటి మీటర్లతో ఇబ్బంది ఉండదు
 ఆధునికీకరణ పనుల సమయంలోనే  నీటి మీటర్లను కూడా ఏర్పాటు చేస్తామని, వీటితో ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఈ అన్నారు. నీటి సక్రమ వినియోగం, లోటుపాట్ల నివారణ కోసమే వీటిని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, శిస్తు వసూలు లెక్కల కోసం కాదని వివరించారు. మున్ముందు నీటి సమస్యలు తీవ్రమ య్యే పరిస్థితుందని; అందుకే నీటి పొదుపుపై రైతులకు, ఇంజనీర్లకు ఇప్పటి నుంచే అవగాహ న కల్పించనున్నట్టు చెప్పారు. కాల్వలకు అవసరమైన చిన్న చిన్న మరమ్మతులను వెంటనే చేపడితే అవి (కాల్వలు) బాగుపడతాయన్నారు.
 అవగాహన లేనందునే భూముల దురాక్రమణ
 తమ శాఖాధికారులకు నీటి పర్యవేక్షణతోనే సమయం సరిపోతోందని, ఈ కారణంగా ఎన్‌ఎస్‌పీ భూములపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఉండడం లేదని, అందుకే వాటిని రక్షించలేకపోతున్నారని సీఈ అన్నారు. ఎన్‌ఎస్‌పీ, రెవెన్యూ శాఖలు సమన్వయంగా వ్యవహరించినప్పుడే ఈ (ఎన్‌ఎస్‌పీ) భూముల దురాక్రమణను అడ్డుకోగలమని అన్నారు. టేకులపల్లి సర్కిల్ పరిధిలో కొన్ని నిరుపయోగ భూములను ఇప్పటికే రెవెన్యూ శాఖకు అప్పగించినట్టు చెప్పారు.
 నిధుల స్వాహాపై విచారణ కమిటీని కోరాం...
 ఖమ్మం ఎన్నెస్పీ మానిటరింగ్ డివిజన్ కార్యాలయంలో సుమారు రూ.60లక్షల పైగా నిధుల స్వాహాకు సంబంధించి తమ శాఖతోపాటు పీఏఓ (ప్రభుత్వ చెల్లింపుల) శాఖ అధికారుల హస్తం ఉందని అన్నారు. దీనిపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. రెండు శాఖల్లోని అన్నిరకాల రికార్డులు పరిశీలిస్తే  మొత్తం ఎంత దుర్వినియోగమైందీ తెలుస్తుందన్నారు.
 మూడోజోన్‌ను రెండోజోన్‌లో కలిపేందుకు సర్వే పూర్తి
 కల్లూరు: సాగర్ ఎడమ కాలువ పరిధిలోని ఖమ్మం, కృష్ణా జిల్లాల్లోగల రెండు, మూడు జోన్లలోని ఆయకట్టును రెండోజోన్‌లో కలిపేందుకు సర్వే పూర్తయిందని ఎన్‌ఎస్‌పీ చీఫ్ ఇంజనీర్ ఎల్లారెడ్డి చెప్పారు. జోన్ మార్పిడి సర్వే పనులను పరిశీలించేందుకు గురువారం ఇక్కడకు వచ్చిన ఆయన.. కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగర్ మూడోజోన్‌లోని 17వేల ఎకరాలను రెండోజోన్‌లో కలిపితే మొత్తం ఒకేసారి ఖరీఫ్‌కు సాగు నీరు అందించేందుకు వీలవుతుందని అన్నారు. దీనిపై ప్రభుత్వం చేపట్టిన సర్వే రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు. మధిర బ్రాంచ్ కెనాల్ పరిధిలోని నిధానపురం మేజర్ వద్దనున్న కట్టలేరు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి జమలాపురం మేజర్‌కు అనుసంధానించనున్నట్టు తెలిపారు.
 రబీ సీజన్‌లో కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే సాగు నీరు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించందన్నారు. ఖరీఫ్‌లో పత్తి, మిర్చి, పసుపు తదితర వాణిజ్య పంటల కోసం ఫిబ్రవరి నెలాఖరు వరకు నాలుగు దఫాలుగా సాగు నీరు ఇస్తామన్నారు. మున్నేరు వరకు రబీ సాగుకు 12 రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్ సిస్టమ్ ద్వారా సాగునీటి సరఫరా అవుతుందన్నారు. మున్నేరు దిగువన 10 రోజుల ఆఫ్, 10 రోజులు ఆన్ పద్ధతి ద్వారా నీటి సరఫరా ఉంటుందన్నారు.

మరిన్ని వార్తలు