154వ రోజు పాదయాత్ర డైరీ

7 May, 2018 03:01 IST|Sakshi

06–05–2018, ఆదివారం
గుడ్లవల్లేరు, కృష్ణా జిల్లా 

రైతులకు పట్టిన ఈ ప్రభుత్వ చీడే ప్రమాదకరం..
ఈ రోజు మధ్యాహ్నం.. శిబిరం వద్ద భవన నిర్మాణ కార్మికులు కలిశారు. నాన్నగారి హయాంలో జూన్‌ 26, 2007న అమల్లోకి తెచ్చిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నాడని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని పక్కనపెట్టి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నిధులను వాడుకుంటున్నారు. ఆయన ఒక్క పైసా మంజూరు చేయకపోగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులతో సొంత ప్రచారం, పార్టీ ప్రచారం నిర్వహించుకుంటున్నారు. చంద్రన్న బీమాకు ముడిపెట్టి నిధులను మళ్లించుకుంటున్నారు. కార్మికుల సొమ్ముతో ఊరూరా, వాడవాడా ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలతో పార్టీ ప్రచారం నిర్వహించుకోవడం ఒక ఎత్తైయితే ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ కాంట్రాక్టుల్లో సైతం కోట్ల రూపాయల కమీషన్లు కొల్లగొడుతున్నారు.

ఇది ఎంత దారుణమన్నది ఆ సోదరుల ఆవేదన. ‘సార్‌.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి కింద దాదాపు రూ.1,300 కోట్ల నిధులు ఉన్నాయి. ఇది మీ నాన్నగారి చలవే. అవి కేవలం మా సంక్షేమం కోసమే ఖర్చు చేయాల్సి ఉండగా అడ్వర్టైజ్‌మెంట్లకు, వాహనాలకు, చంద్రన్న బీమాకు, ఇతర పథకాలకు నాలుగు వందల కోట్ల పైచిలుకు నిధులను మళ్లించుకోవడం అత్యంత దారుణం. ఆ అధికారం ఈ ముఖ్యమంత్రిగారికి ఎవరిచ్చారు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్నట్టు నిధులు కార్మికులవి.. పేరు, ప్రచారం మాత్రం బాబుగారికి. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టించే కార్మికుల కష్టాన్ని, స్వేదాన్ని సైతం దోపిడీ చేయడం ఏ మేరకు సబబు?   

వడ్లమన్నాడు దగ్గర మినుము రైతులు కలిశారు. రోడ్డు పక్కనే మినుముల బస్తాలు పెట్టుకుని నా కోసం ఎదురుచూసి ఆ రైతన్నలు తమ కష్టాలు చెప్పుకున్నారు. ‘సార్‌.. రెండోపంటకు నీళ్లు లేవని మినుములు వేసుకుంటే తెగుళ్లతో దిగుబడి తగ్గిపోయింది. చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడుతున్నాం. ఈ విషయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దోపిడీకి తెగబడుతోంది. మా నిస్సహాయతను ఉపయోగించుకుంటోంది. మినుముల కోసం కొనుగోలు కేంద్రాలైతే పెట్టారు కానీ అవి పెట్టిన తర్వాత విచిత్రంగా మినుముల ధరలు మునుపటి కన్నా నాలుగైదు వందల రూపాయలు తగ్గిపోయాయి. దీనికి కారణం.. కొనుగోలు కేంద్రాలు కూడా జన్మభూమి కమిటీల మాదిరిగా దోపిడీ కేంద్రాలుగా మారడమే. కొనుగోలు కేంద్రాల అధికారులు తెలుగుదేశం నాయకుల దగ్గర మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతులు వెళ్తే మాత్రం ఏదో ఒక వంక పెట్టి నిబంధనల పేరుతో తిరస్కరిస్తున్నారు. గత్యంతరంలేని రైతులు తక్కువ ధరకే దళారీల అవతారమెత్తిన టీడీపీ నాయకులకు అమ్ముకోవాల్సి వస్తోంది’ అంటూ తమ కష్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. మినుము పంటకు పట్టిన చీడ కన్నా... రైతాంగానికి పట్టిన ఈ ప్రభుత్వ చీడే ప్రమాదకరం.  

 ఈ రోజు కౌతారం దగ్గర కలిసిన కృష్ణా జిల్లా న్యాయవాదులు తమకు కూడా ఎన్నికల వేళ హామీలు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోని బాబుగారి నైజాన్ని ఎండగట్టారు. ఒక వినతిపత్రాన్ని ఇస్తూ మీరొచ్చాక మాకు న్యాయం చేస్తారని నమ్ముతున్నామన్నారు. వారి సమస్యలను సానుభూతితో పరిశీలించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. మేనిఫెస్టోలో హామీలిచ్చి వివిధ కులాలను, వర్గాలను ఎలా మోసం చేశాడో లాయర్లను సైతం అలా మోసం చేసిన ఏకైక రాజకీయ నేత చంద్రబాబేనేమో! 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా ఉంది.. రైతన్నలు ఆనందంగా పండుగ చేసుకుంటున్నారంటూ మీరు, మీ మంత్రులు గొప్పగా ప్రకటించుకుంటున్నారు. నిజంగా వ్యవసాయం అంత గొప్పగా సాగుతుంటే భూమి కౌలు ఎందుకు పడిపోతోంది? రైతన్నలు కౌలుకు ముందుకురాని పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? పంటలకు నీళ్లు లేవని రైతులెందుకు గగ్గోలు పెడుతున్నారు?   
- వైఎస్‌ జగన్‌  

మరిన్ని వార్తలు