డీఆర్‌డీవోకు 158 హెక్టార్లు

12 Feb, 2014 01:00 IST|Sakshi
డీఆర్‌డీవోకు 158 హెక్టార్లు

రాష్ట్ర వన్యప్రాణి బోర్డు నిర్ణయం
 సాక్షి, హైదరాబాద్: క్షిపణి ప్రయోగ కేంద్రం (మిసైల్ లాంచింగ్ సెంటర్) ఏర్పాటు కోసం కృష్ణా వన్యప్రాణి అభయారణ్యంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు 158 హెక్టార్లు కేటాయించాలని రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవి ఏమిటంటే...
 
  కొల్లేరు అభయారణ్యంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్థానంలో అదే పొడవు, వెడల్పుతో కాంక్రీటు ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం
  నెల్లూరు జిల్లాలోని పెంచల నరసింహస్వామి అభయారణ్యంలో నీటి సరఫరా పైపులైన్, బావి ఏర్పాటుకు ఎకరా కేటాయింపు
  నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ వరకూ రోడ్డు వెంబడి ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు
 
  రోళ్లపాడు అభయారణ్యం విస్తరణ
  చిలుకూరు వద్ద మృగవని జాతీయ పార్కుకు కంచె ఏర్పాటు
  హైదరాబాద్‌లోని పక్షుల పార్కులో ఆక్రమణల తొలగింపు
 
  కవాల్ టైగర్ రిజర్వ్‌కు ఫీల్డ్ డెరైక్టర్ నిర్మాణాలకు సంబంధించి అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని అటవీశాఖ అధికారులకు సీఎం ఆదేశం
 
 విషప్రయోగం చేసే వారిపై కఠిన చర్యలు
 విషప్రయోగం చేసి వన్యప్రాణులను చంపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం కిరణ్ ఆదేశించారు. వన్యప్రాణుల వల్ల రైతుల పంటలకు, పశువులకు నష్టం వాటిల్లితే తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించేలా రెవెన్యూ అధికారులను ఆదేశించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు