క్షణికావేశంలో...

4 Oct, 2016 04:28 IST|Sakshi
క్షణికావేశంలో...

క్షణికావేశంలో ఓ నిండు ప్రాణానికి నూరేళ్లు నిండాయి. తండ్రి, అమమ్మ తగదా ఆత్మహత్యకు ప్రేరేపించింది. గొడవను చూసి తట్టుకోలేక పురుగుల మందు సేవించింది. వైద్యం అందినప్పటికీ ప్రాణాలు విడిచింది. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన బుక్కా రూపావతి ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రూపావతి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

గోపాలపురం(సారవకోట): గుమ్మపాడు పంచాయతీ గోపాలపురం గ్రామానికి చెందిన బుక్కా రూపావతి(16) ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి రూపావతి తండ్రి సుందరరావు, అమ్మమ్మ నరసమ్మ కుటుంబ సమస్యలలో తగదా పడ్డారు. అక్కడే ఉన్న రూపావతి వారి తగదాను చూడలేక క్షణికావేశంతో ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. దీనిని గమనించిన తండ్రి గ్రామస్తుల సహకారంతో వెంటనే ద్విచక్ర వాహనంపై నరసన్నపేటలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
 
 అక్కడికి వెళ్లే సమయంలో ఆమె మృతి చెందింది. ప్రస్తుతం ఆమె చల్లవానిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. నెమ్మదస్తురాలు, అందరితో చనువుగా ఉన్న రూపావతి ఇటువంటి పనిచేయడంతో గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. కళాశాలకు సహితం సోమవారం సెలవు ప్రకటించడంతో పలువురు విద్యార్థులు అంత్యక్రియలలో పాల్గొన్నారు. దీనిపై తండ్రి సుందరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాకుళంలోని రిమ్స్‌లో పోస్టుమార్టం నిర్వహించారు.
 

>
మరిన్ని వార్తలు