కొంపముంచిన  నిర్లక్ష్యం

6 Jun, 2020 06:39 IST|Sakshi
బారికేడ్లతో మూసివేసిన చింతావారి వీధి

 విశాఖ జిల్లాలో ఒక్కరోజే 17 పాజిటివ్‌ కేసులు

ఇద్దరి కాంటాక్ట్‌తో అనకాపల్లిలో 14 మందికి...

ఒకరు ఎలక్ట్రికల్‌ వ్యాపారి, మరొకరు మెటల్‌ షాప్‌ ఉద్యోగి 

ఆ దుకాణాలకు వెళ్లినవారి కోసం అధికారులు జల్లెడ 

గ్రామీణ వ్యాపార రాజధానిలో స్తంభించిన జనజీవనం 

అనకాపల్లి టౌన్‌/ సాక్షి, విశాఖపట్నం/మహారాణిపేట: లాక్‌డౌన్‌ సడలింపులతో మొదలైన ఓ వ్యాపారి నిర్లక్ష్యం అనకాపల్లి కొంపముంచింది. ఒక ఎలక్ట్రికల్‌–ఎల్రక్టానిక్స్‌ వస్తువుల వ్యాపారి కుమారుడు, ఓ మెటల్‌ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తి కాంటాక్ట్‌తో ఏకంగా 14 కరోనా పాజిటివ్‌ కేసులు శుక్రవారం వెలుగుచూశాయి. ఇది మరింత వ్యాపించే ప్రమాదం ఉండటంతో లాక్‌డౌన్‌ తర్వాత ఆయా దుకాణాలకు వెళ్లినవారెవ్వరో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పడుతున్నారు. పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌ నుంచి దుకాణ సముదాయాలున్న చింతావారివీధి వరకూ రెడ్‌జోన్‌గా అధికారులు ప్రకటించారు. కానీ కరోనా కేసుల కలకలంతో జనజీవనం స్తంభించింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

 చింతావారి వీధి... అనకాపల్లిలోని ప్రధాన వాణిజ్య సముదాయాల్లో ఇదొకటి. లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో అనకాపల్లిలో నిర్ణీత సమయాల్లో దుకాణాలు తెరుస్తున్నారు. చింతావారి వీధిలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్‌ వస్తువుల వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి కుమారుడు ఇటీవలే బెంగళూరు వెళ్లివచ్చారు. తర్వాత దుకాణం తెరిచారు. ఇక్కడికి అనకాపల్లితో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి వినియోగదారుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. లాక్‌డౌన్‌ తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. ఐదారు రోజుల పాటు వ్యాపారం చేసిన తర్వాత వారం రోజుల క్రితం ఆ వ్యాపారికి, అతని కుమారుడికి జ్వరం వచ్చింది. దీంతో వారిద్దరికీ అనకాపల్లిలోని ఎన్‌టీఆర్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌ రావడంతో విశాఖలోని కోవిడ్‌ ఆసుపత్రికి తరలించారు.

తర్వాత ఆ వ్యాపారి భార్యకు, పనిమనిషికి కోవిడ్‌ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు. అవన్నీ పాజిటివ్‌ రావడంతో వారినీ హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డులో చేరి్పంచారు. తర్వాత ఆ వ్యాపారికి సంబంధించిన దుకా ణంలో పనిచేసేవారికీ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. ఇలా అతని కాంటాక్ట్స్‌తో రెండు రోజుల వ్యవధిలో మొత్తం 16 మందికి వైరస్‌ సోకింది. అలాగే పెరుగుబజారు వీధిలోని ఒక మెటల్‌ షాప్‌లో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతని వల్ల మరో వ్యక్తికీ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వారితో కాంటాక్ట్స్‌ వల్ల ఇంకా కేసులు పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.  

వ్యాపార సముదాయాల మూత... 
అనకాపల్లిలో రెండు రోజుల వ్యవధిలో 18 కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం వెంకటేశ్వర థియేటర్‌ నుంచి చింతావారివీధి వరకూ ఉన్న దుకాణ సముదాయాలను మూయించివేశారు. పెరుగు బజారువీధిలోనూ దుకాణాలు మూతపడ్డాయి. ఈ భయంతో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితయ్యారు. ప్రధాన రహదారులన్నీ బోసిపోయాయి.

మరిన్ని వార్తలు