బాలికపై బాలుడు అత్యాచారయత్నం

10 Jun, 2018 12:07 IST|Sakshi

బాలికపై బాలుడు అత్యాచార యత్నం

బాధితులపై దాడి చేసిన నిందితుడి తరఫు బంధువులు 

నిందితుడు టీడీపీ నాయకుడి మనవడు కావడంతో పోలీసుల నిర్లక్ష్యం

బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకోని పోలీసులు 

ధర్మవరం టౌన్‌ : ధర్మవరంలో ధర్మం చెరపట్టారు..అధికార అండతో బలహీనులపై దారుణాలకు ఒడిగడుతున్నారు.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు..ఆపై ప్రశ్నిస్తే దాడులకు పూనుకుంటున్నారు..అండగా ఉంటారనుకుంటున్న పోలీసులూ అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతూ న్యాయానికి నిలువునా పాత రేస్తున్నారు.  పోలీసుల వైఖరిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని సంజయ్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ కుమార్తె (11) కాలనీలో పాల ప్యాకెట్‌ కొనుక్కునేందుకు పక్కవీధికి వెళ్లింది. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకుడు చెన్నారెడ్డి మనుమడు లోకేశ్వర్‌రెడ్డి (17) బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఏకంగా అత్యాచార యత్నానికి యత్నించాడు.

 బాలిక పెద్ద పెట్టున కేకలు వేయడంతో స్థానికులు, సమీపంలోనే ఉన్న బాధితురాలి తండ్రి అక్కడికి చేరుకుని నిందితుడికి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న సదరు టీడీపీ నాయకుడు చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో బాధితురాలి తల్లి చీర లాగి తాళి తెంచి పిడిగుద్దులు గుద్దారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కన్నీటి పర్యంతమైన బాధితులు న్యాయం కోసం పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. 

బాధితులను పట్టించుకోని పోలీసులు 
అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితులను పట్టణ పోలీసులు పట్టించుకోలేదు. మధ్యాహ్నం 3గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళితే సాయంత్రం 6గంటలైనా కనీసం ఫిర్యాదు స్వీకరించకపోగా టీడీపీనేత చెన్నారెడ్డి బాధితులపైనే  ప్రతిగా ఫిర్యాదు చేశాడు. సదరు టీడీపీ నేత ఫిర్యాదు అయితే పోలీసులు వెంటనే మధ్యాహ్నమే తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. 

తప్పు చేసిన వారికే రాచమర్యాదలు 
తప్పు చేసిన నిందితులకే పోలీస్‌ స్టేషన్‌లో రాచమర్యాదలు చేయడం విమర్శలకు తావిస్తోంది. చివరకు జరిగిన అన్యాయం మీడియాకు తెలియడంతో ఆలస్యంగా స్పందించిన సీఐ హరినాథ్‌ బాధితులను విచారించారు. విచారణ చేస్తున్న సమయంలోనే టీడీపీ నాయకులు బాధితుల ఇంటి వద్దకు మళ్లీ దౌర్జాన్యానికి వెళ్లారు. దీంతో ఎస్‌ఐ జయానాయక్‌ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లడంతో టీడీపీ నాయకులు వెనుదిరిగి వెళ్లారు. బాలికకు అన్యాయం జరిగితే న్యాయం చేయలేని పోలీస్‌స్టేషన్‌లు ఎందుకంటూ బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. సామాన్యులకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా అధికార పార్టీకి వంత పాడితే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేమిటని ప్రశ్నిస్తున్నారు. 

పోలీస్‌ స్టేషన్‌లోనే పంచాయితీ 
ఈ విషయం మీడియాకు తెలిసి పెద్దదవ్వడంతో సదరు టీడీపీ నాయకులు ఇరువర్గాలకు పంచాయితీ చేసి రాజీ చేయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా పోలీస్‌ స్టేషన్‌లోనే   పంచాయితీ జరగడం కొసమెరుపు.  నిందితుడి పక్షాన పట్టణ టీడీపీ ప్రముఖులు, టీడీపీ నాయకుడు చెన్నారెడ్డి ఏకంగా సీఐ చాంబర్‌లో కూర్చోవడం అధికార పార్టీ నాయకుల ప్రాభవం ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. పోలీసుల చేత బలవంతంగా అయినా సరే బాధితులతో రాజీకీ వచ్చేలా  ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.  బాధితులను నిలబెట్టుకొని విచారిస్తూ తప్పు చేసిన వారిని కూర్చోబెట్టి రాచమర్యాదలు చేస్తున్న ధర్మవరం పోలీసుల వైఖరి విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు