వైద్యం మిథ్య!

17 Jan, 2014 04:19 IST|Sakshi

ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జనాభాకు సరిపోయే విధంగా వైద్యులు లేక రోగులు పడిగాపులు కాస్తున్నారు. రూ.కోట్లు వెచ్చిస్తున్నా.. అధునాతన పరికరాలు ఉన్నా.. వైద్యులు లేక సేవలు అందడం లేదు. కనీసం 20 ఏళ్ల నాటి ప్రమాణాల ప్రకారం ఉండాల్సిన సంఖ్యలో కూడా వైద్యులు లేరు. ఉన్న వైద్యులు కూడా అందుబాటులో లేకపోవడం ప్రజలకు శాపమవుతోంది. జిల్లాలో 27.88 లక్షల జనాభా ఉండగా, వీరికి కేవలం 170 మంది మాత్రమే వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఏళ్లు గడిచినా, జనాభా పెరిగినా అరకొర సిబ్బందితోనే ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 72 పీహెచ్‌సీలు, 12 అర్బన్ హెల్త్ సెంటర్‌లు ఉన్నాయి. వీటిలో 20 ఏళ్లక్రితం నాటి ప్రమాణాలు తీసుకున్నా 184 మంది వైద్యులు ఉండాలి. కానీ 152 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. సెలవుపై వెళ్లేవారు, పోస్టు గ్రాడ్యుయేట్ చేయడం కోసం దీర్ఘకాలిక సెలవు తీసుకున్నవారు కూడా ఈ లెక్కల్లో ఉన్నారు. ఇక అందుబాటులో ఉండే వైద్యుల సంఖ్య 120 వరకు ఉంటుంది. వీరే లక్షల మంది గ్రామీణులకు ప్రాణాధారం. దీంతో అత్యవసర సమయాల్లో, వరదలు, వర్షాలు వచ్చే సీజనల్ వ్యాధులు విజృంభించే సమయాల్లో దేవుడిపైనే భారం వేయాల్సి వస్తోంది.
 
 వైద్య విధాన పరిషత్‌లో..
 వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్మల్, బైంసా, మంచిర్యాల ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. ఖానాపూర్, ఉట్నూర్, సిర్పూర్-టి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌లలో సీహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఐదుగురు వైద్యులు, ఏరియా ఆస్పత్రిలో పది మంది వైద్యులు ఉండాలి. వీరితోపాటు ఒక్కో ఏరియా ఆస్పత్రికి ముగ్గురు సివిల్ సర్జన్‌లు, సీహెచ్‌సీకి ఇద్దరు సివిల్ సర్జన్‌లు ఉండాలి. మొత్తం 21 మంది సివిల్ సర్జన్‌లకు ప్రస్తుతం ఆరుగురు అందుబాటులో ఉన్నారు. 20 ఏళ్ల నాటి జనాభా ప్రాతిపదికన ఆయా ఆస్పత్రుల్లో నిర్దేశించిన వైద్యుల సంఖ్య 81 మంది వరకు ఉండాలి. ఇప్పటికి అక్కడ 66 మంది మాత్రమే పోస్టులు భర్తీ అయ్యాయి. వారిలో కోర్టు కేసుల నిమిత్తం వెళ్లేవారు. సెలవులపై వెళ్లేవారిని మినహాయిస్తే ప్రజా సేవలో ఉండేవారు చాలా తక్కువమందే అని చెప్పవచ్చు.
 
 ఉన్నవారిలో నిపుణులైన వైద్యులను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు.  ప్రస్తుతం 17 వేల మందికి ఓ డాక్టరు చొప్పున ఉన్నారు. ప్రభుత్వ సేవలకు నిపుణులైన వైద్యులు ముందుకు రాకపోవడంతో ఎంబీబీఎస్ వైద్యులతోనే సరిపెట్టుకొని సర్కారు వైద్యసేవలు నెట్టుకొస్తోంది.
 
 రిమ్స్‌కు వచ్చేలోపు పరిస్థితి విషమం
 జిల్లా కేంద్రంలో రిమ్స్ వైద్య కళాశాల ఉంది. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, ఆత్మహత్యలు,  పాముకాటుతోపాటు ఏదైనా ప్రమాదం జరిగితే తప్పనిసరిగా రిమ్స్‌కు రావాల్సిన పరిస్థితి. జిల్లా విస్తీర్ణంలో పెద్దదిగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి రిమ్స్‌కు వచ్చేలోపే పరిస్థితి చేజారుతోంది. తీరా రిమ్స్‌కు వచ్చిన తర్వాత పరిస్థితి విషమించడంతో ఇక్కడి వైద్యులు మహారాష్ట్రలోని యవత్‌మాల్, నాగ్‌పూర్, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆ పరిస్థితిల్లో చాలా మందికి వైద్యం అందక మార్గమధ్యమంలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో పీహెచ్‌సీలతోపాటు, రిమ్స్‌లో కూడా వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా వైద్యులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు