170వ రోజు పాదయాత్ర డైరీ

25 May, 2018 03:57 IST|Sakshi

24–05–2018, గురువారం
పెదకాపవరం, పశ్చిమ గోదావరి జిల్లా

కర్కశంగా వ్యవహరిస్తూ.. ప్రజలను కడగండ్ల పాలుజేస్తున్నారు

అమాయకులైన గిరిజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన విప్లవ వీరుడు.. నమ్ముకున్న ప్రజల కోసం బ్రిటీష్‌ పాలకుల తుపాకీ తూటాలకు గుండెనెదురొడ్డి పోరాడిన తెలుగువాడి పౌరుషాగ్ని.. అల్లూరి సీతారామరాజు జన్మించిన గడ్డపై పాదయాత్ర సాగిందీ రోజు. హక్కుల కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అల్లూరి సొంత గడ్డమీద.. నేడు కనీస అవసరాలకు సంబంధించిన అనివార్య హక్కుల్ని సైతం ఈ పాలకులు హరించివేస్తున్న విషయం చాలా దారుణమనిపించింది.

చెంతనే గోదావరి ఉన్నా.. దాహమేస్తే గొంతు తడుపుకోలేని దుస్థితిని చూసి విస్మయానికి గురయ్యాను. కేవలం నేటి పాలకుల సంకుచితత్వం వల్ల దాహార్తి తీరని దయనీయ స్థితిని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఇక్కడ అధికార బలం ఉన్నవాడు.. మంచినీటి చెరువులను ఆక్రమించి మల్టీప్లెక్స్‌ కడతానంటాడు. అధికారమదంతో మరొకడు.. ఉన్న పింఛన్‌లను తీసేస్తాడు. జన్మభూమి కమిటీల మాటున అనర్హులను అందలమెక్కిస్తూ.. అయోగ్యులకూ వైకల్యం కల్పిస్తాడు. అసలుసిసలు దివ్యాంగులకు మాత్రం పింఛనే లేదంటాడు. ఇదీ.. తెల్లదొరల పాలనను మరిపించే నేటి బాబుగారి పరిపాలన.   

 కోలమూరు గ్రామంలో అక్కచెల్లెమ్మలు, సోదరులు నీళ్ల బాటిళ్లతో వచ్చారు. రంగుమారి దుర్వాసన వేస్తున్న ఆ కలుషిత నీళ్లే మేము తాగే నీళ్లంటూ.. తమ దుస్థితిని బాధగా చెప్పుకొన్నారు. బోర్లు వేస్తే ఉప్పునీళ్లు.. మంచినీళ్లు కొనలేని దుస్థితి.. ఆ మురికి నీళ్లు తాగి ఎలా మనుగడ సాగించాలి.. పసిబిడ్డల పరిస్థితేంటి.. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మనసుకు చాలా బాధనిపించింది. నాన్నగారి హయాంలో సంకల్పించిన తాగునీటి పైప్‌లైన్‌ ప్రాజెక్టు పూర్తయి ఉంటే.. ఈ సమస్య తీరేది కదా! కేవలం నాన్నగారికి పేరొస్తుందన్న అక్కసుతో మిగిలిన కాస్త పనులూ పూర్తిచేయక.. కర్కశంగా వ్యవహరిస్తూ ప్రజలను కడగండ్ల పాలుచేస్తున్నారు ఈ పాలకులు.  

ఎంఎంపురం గ్రామానికి చెందిన సోదరుడు గంటా శ్రీనివాసరావు.. తమ గ్రామంలో అన్ని అర్హతలున్న వికలాంగులకు కూడా పింఛన్‌లు ఇవ్వడం లేదని, పింఛన్‌ వస్తున్నవారికి సైతం పార్టీ వివక్షతో తీసేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క శాతం కూడా వైకల్యం లేని టీడీపీ చోటామోటా నాయకులకు, కార్యకర్తలకు వికలాంగ పింఛన్‌లు ఇస్తున్నారట. అసలు వైకల్యమే లేని అనర్హులైన టీడీపీ వారు తమ పంచాయతీలోనే 40 మంది దాకా పింఛన్‌లు తీసుకుంటున్నారని ఫొటోలు, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఆధారాలు చూపాడు. ఈ దుర్మార్గంపై పత్రికల్లో వచ్చినా, అధికారులకు వివరించినా, కలెక్టర్‌ను కలిసినా.. అసలు స్పందనే లేదంటూ వాపోయాడు.  

నాన్నగారు పదిహేనేళ్ల కిందట పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంతం పాదయాత్ర మార్గంలో లేకపోవడంతో ఇక్కడి ప్రజలు తాడేపల్లిగూడెం దగ్గరకుపోయి.. తమను సతమతం చేస్తున్న తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి సమస్యను కళ్లారా చూడకున్నా.. అధికారంలోకి వచ్చాక రూ.30 కోట్లతో తాగునీటి కోసం పైప్‌లైన్‌ ప్రాజెక్టును మంజూరు చేసిన పెద్ద మనసు ఆయనది. ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర చేసినప్పటికీ, మా కష్టాలు కళ్లారా చూసినప్పటికీ, పాదయాత్రలో హామీలు ఇచ్చినప్పటికీ.. కుర్చీ ఎక్కగానే అన్నీ మర్చిపోయి మిగిలిపోయిన కొద్దిపాటి పనులనూ పూర్తిచేయని చిన్న బుద్ధి చంద్రబాబుది.. అంటూ తారతమ్యాన్ని విడమర్చిమరీ చెప్పారు కోలమూరు గ్రామస్తులు.  

 ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ‘నిద్రపోయే వాళ్లను తట్టి లేపొచ్చు.. నిద్ర నటించేవాళ్లను ఏం చేయగలం’.. అంటారు పెద్దలు. మీ జన్మభూమి కమిటీలు, మీ నాయకులు పనిగట్టుకుని అన్యాయం చేస్తున్నా.. ప్రజలను దోచుకుతింటున్నా.. నోరు మెదపని మీ వైఫల్యానికి ఏం పేరు పెట్టాలి.. అసమర్థతా? అలసత్వమా? అవినీతా? అన్యాయమా?

మరిన్ని వార్తలు