కారుచౌకగా ‘పతంజలి’కి 172 ఎకరాలు

1 Mar, 2017 13:13 IST|Sakshi
కారుచౌకగా ‘పతంజలి’కి 172 ఎకరాలు

కలెక్టర్‌ నిర్ణయించిన ధర ఎకరానికి రూ.9.63 లక్షలు
ఎకరా రూ.3 లక్షలకే ఇస్తూ జీవో జారీ


సాక్షి, అమరావతి: పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌కు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నారావుపల్లిలో కారుచౌకగా 172.84 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో ఇచ్చింది. కలెక్టర్‌ నేతృత్వంలోని సాంకేతిక కమిటీ ఈ భూమిని ఎకరానికి రూ.9.62 లక్షలకు విక్రయించాలని ప్రభు త్వానికి సిఫార్సు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ఎకరానికి రూ.3 లక్షలకే ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. పతంజలికి ఇచ్చే భూమిలో కొంత ప్రభుత్వ, మరికొంత అసైన్డ్‌ భూమి ఉంది. అసైన్డ్‌ భూమికి రైతుకు కలెక్టర్‌ నిర్ణయించిన ధర చెల్లిస్తారు. ఈ మేరకు పతంజలి ఇచ్చే రూ.3 లక్షలు పోను, మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ కార్యదర్శి బి.శ్రీధర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పతంజలి సంస్థ రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు పంపింది. ఆయుర్వేద ఉత్పత్తులతో కూడిన ఈ ప్రాజెక్టుతో 6 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వానికి తెలిపింది. అలాగే వైష్ణవి మెగా ఫుడ్‌ పార్క్‌కు చిత్తూరు జిల్లా పెద్దూరు వద్ద 100 ఎకరాలు కేటా యిస్తూ ప్రభుత్వం మంగళవారం జీవో జారీ చేసింది. ఈ భూమిని ఏపీఐఐసీ ద్వారా ఎకరాన్ని రూ.1.50 లక్షలకు విక్రయించాలని పేర్కొంది. ఎకరా భూమిని రూ.2.93 లక్షలకు కేటాయించాలని ఏపీఐఐసీ సిఫార్సు చేసినా ప్రభుత్వం ఎకరాన్ని రూ.1.50 లక్షలకే కేటాయించింది.

>
మరిన్ని వార్తలు