చిన్నారిని చిదిమేసిన ట్రాక్టర్‌ 

18 Jun, 2019 11:00 IST|Sakshi
బిడ్డ మృతదేహాన్ని చూసి భోరుమంటున్న తల్లి సులోచన, ఘటనాస్థలంలో పవన్‌ మృతదేహం

ఆడుకుంటూ ట్రాక్టర్‌ ఎక్కిన మూడేళ్ల బాలుడు

తాళాలు దానికే ఉండటంతో ఇంజిన్‌ను స్టార్ట్‌ చేసిన వైనం

దాని కిందపడి18 నెలల చిన్నారి దుర్మరణం

సాక్షి, తెనాలిరూరల్‌: అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారుల్లో ఒకరిని మృత్యువు రూపంలో పొంచి ఉన్న ట్రాక్టర్‌ కబళించింది. ఇంజిన్‌ స్టార్ట్‌ అయి, ట్రాక్టర్‌ ముందుకు కదులుతుండడంతో ఆందోళనకు గురైన బాలుడు కేకలు వేస్తుండగా, ఆ బాలుడిని రక్షించేందుకు వచ్చిన వారిలో ఓ తల్లి, తన బిడ్డ ట్రాక్టర్‌ చక్రాల కింద నలిగిపోయి ఉండడం చూసి నిర్ఘాంతపోయింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమారుడి పార్థివదేహాన్ని తన పొత్తిళ్లల్లోకి తీసుకుని బోరుమని విలపించింది.  మూడేళ్ల బాలుడు ఇంజిన్‌ స్టార్ట్‌ చేయగా, 18 నెలల బాలుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

తెనాలి పట్టణం చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన కందుకూరి సులోచన తన భర్త రోశయ్యతో మనస్పర్థల కారణంగా విడిపోయి, 18 నెలల కుమారురు పవన్‌తో సహా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తన స్నేహితురాలయిన అమరావతి ప్లాట్స్‌కు చెందిన తిరుపతమ్మ క్యాటరింగ్‌ పనులకు వెళుతుండడంతో, జీవనోపాధి కోసం సులోచనా కూడా వెళుతోంది. వారం రోజులుగా అమరావతి ప్లాట్స్‌లో స్నేహితురాలి వద్దే కుమారుడితో కలసి ఉంటోంది. పవన్, స్థానికంగా ఉన్న కొంత మంది చిన్నారులు అక్కడికి సమీపంలోని ఖాళీ స్థలంలో రోజూ ఆడుకుంటుండేవారు. ఈ క్రమంలోనే సోమవారం అందరూ కలసి ఖాళీ స్థలంలోని ఇసుక గుట్టల వద్ద ఆడుకుంటున్నారు. పవన్‌తో పాటు లోకేష్‌ అన్న పేరు గల ఇద్దరు చిన్నారులూ అక్కడ నిలిపి ఉన్న ట్రాక్టర్‌ వద్ద ఆడుకుంటున్నారు.
 


ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ 
ఓ బాలుడు(పేరు లోకేష్‌) ట్రాక్టర్‌పైకి ఎక్కి డ్రైవరు సీటులో కూర్చున్నాడు. తాళాలు వాహనానికే ఉండడంతో తెలిసీ తెలియక తిప్పాడు. వెంటనే ఇంజిన్‌ స్టార్ట్‌ అయి, ట్రాక్టర్‌ ముందుకు కదులుతుండగా, ఆందోళనకు గురైన లోకేష్‌ కేకలు వేస్తుండడంతో అక్కడికి సమీపంలోని ఇళ్లలో ఉన్న వారు పరుగు పరుగున ట్రాక్టర్‌ వద్దకు చేరుకున్నారు. సులోచనా అక్కడకు వెళ్లి, కదులుతున్న ట్రాక్టరుపై ఉన్న లోకేష్‌ను దించేందుకు ప్రయత్నించింది. వాహనం ముందుకు వెళ్లాక చూడగా, దాని కిందే తన ఏకైక కుమారుడు నలిగిపోయి ఉండడంతో షాక్‌కు గురైంది.

బిడ్డ మృతదేహాన్ని పొత్తిళ్లలోకి తీసుకుని గుండలవిసేలా కన్నీరు పెట్టింది. భర్తతో విభేదాల వల్ల విడిగా ఉంటున్నా, బిడ్డే తనకు సర్వస్వం అనుకుని, వాడి ఆలనా పాలనాకు ఇబ్బంది లేకుండా ఉండాలనే పనులకూ వెళుతోంది. అలాంటిది ఆ కుమారుడే మృత్యు ఒడిలోకి వెళ్లడంతో తనకు దిక్కెవరంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తోంది. సమాచారమందుకున్న త్రీ టౌన్‌ సీఐ బి.హరికృష్ణ ఘనాస్థలాన్ని పరిశీలించారు. విరాలు నమోదు చేసుకుని చిన్నారి మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ట్రాక్టరును నిర్లక్ష్యంగా ఉంచిన యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు