దుగ్ధతోనే బురద

25 Dec, 2013 01:20 IST|Sakshi
అనపర్తి, న్యూస్‌లైన్ : 18 ఏళ్ల నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న తనకే ఈసారి అనపర్తి టిక్కెట్టు లభిస్తుందనే దుగ్ధతోనే కొందరు కావాలని కరపత్రాలు వేయించారని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి వీర్రెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్త నుంచి ఎదిగిన తనకు జిల్లా స్థాయిలో అనేక పదవులు దక్కాయని తెలిపారు. 2009లో చివరి వరకూ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశానని తెలిపారు. అప్పట్లో నల్లమిల్లి మూలారెడ్డికి టికెట్ లభించినప్పటికీ ఆయన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. 2014లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను అనపర్తి నుంచి దేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నానని తెలిపారు.
 
పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్ద తనకు  కష్టించి పనిచేసే యువ నాయకునిగా మంచి గుర్తింపు ఉందని స్పష్టం చేశారు. తనతోపాటు సినీనటుడు, పార్టీనేత మురళీమోహన్ రాజకీయంగా కేపీఆర్ సంస్ధకు అమ్ముడుపోయినట్టు కరపత్రాలు విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. తాను మొదటి నుంచి ఆర్థికంగా స్థితిమంతుడనేనని తెలిపారు. అనపర్తి టికెట్ తనకు దక్కితే పారిశ్రామికవేత్తల నుంచి  తాను చందాలు అడగనన్నారు. కరపత్రాల ద్వారా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు దిగజారడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తనకు చంద్రబాబునాయుడుతో పరిచయాలు ఉన్నాయని, టికెట్ కోసం మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని తెలిపారు. తన బంధువర్గమంతా అనపర్తి నియోజకవర్గంలోనే ఉన్నారని వీర్రెడ్డి స్పష్టం చేశారు.
 
మరిన్ని వార్తలు