శ్రీవారి బంగారం బ్యాంకుల్లో భద్రం

3 Aug, 2014 00:49 IST|Sakshi
శ్రీవారి బంగారం బ్యాంకుల్లో భద్రం

ఎస్‌బీఐలో 1,800 కిలోలు డిపాజిట్ చేసిన టీటీడీ
ఏడాదికి 12 కిలోల బంగారం వడ్డీగా చెల్లించనున్న బ్యాంకు
టీటీడీ మొత్తం బంగారం డిపాజిట్లు 4,335 కిలోలు


తిరుపతి:  తిరుమల శ్రీవారికి భక్తులు కానుకల రూపంలో సమర్పించిన బంగారాన్ని బ్యాంకుల్లో నిక్షిప్తం చేస్తున్నట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తెలిపారు. ఈ డిపాజిట్లపై ఒక శాతం వడ్డీని బంగారం రూపంలో చెల్లించేందుకు బ్యాంకులు అంగీకరించినట్లు వివరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో శనివారం జరిగిన కార్యక్రమంలో 1,800 కిలోల బంగారాన్ని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తూ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం ఈవో గోపాల్ విలేకరులతో మాట్లాడుతూ... ఎస్‌బీఐలో గోల్డ్ డిపాజిట్ స్కీం కింద  ఐదేళ్ల కాలపరిమితికి 1,800 కిలోల బంగారం డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఏడాదికి ఒక శాతం వడ్డీని బంగారు రూపంలో ఇచ్చేందుకు బ్యాంక్ అంగీకరించిందన్నారు. టీటీడీ డిపాజిట్ చేసిన స్వర్ణాభరణాలను ఎస్‌బీఐ ముంబైలోని మింట్‌కు తరలించి కరిగించి 0.9995 స్వచ్ఛత గల బంగారాన్ని డిపాజిట్‌గా స్వీకరిస్తుందని చెప్పారు.

ఇందుకయ్యే రవాణా, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్, కరిగించి శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చులను వారే(ఎస్‌బీఐ) భరిస్తారన్నారు. ఈ డిపాజిట్లపై సంవత్సరానికి 12 కిలోల బంగారాన్ని వడ్డీ కింద బ్యాంక్ చెల్లిస్తుందని, ఆ బంగారాన్ని తిరిగి అదే బ్యాంక్‌లో డిపాజిట్ చే స్తామని చెప్పారు. టీటీడీ ఇప్పటివరకు ఎస్‌బీఐ, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుల్లో 4,335 కిలోల బంగారు డిపాజిట్లు కలిగి ఉందని తెలిపారు. వీటిపై సంవత్సరానికి 70 కిలోల బంగారం వడ్డీ రూపంలో అందుతున్నట్లు చెప్పారు. ఆ మేరకు 2010 నుంచి చేసిన డిపాజిట్లపై ఇప్పటివరకు 85 కిలోల వడ్డీ బంగారం అందినట్లు వివరించారు.
 

>
మరిన్ని వార్తలు