181వ రోజు పాదయాత్ర డైరీ

6 Jun, 2018 01:47 IST|Sakshi

05–06–2018, మంగళవారం 
తణుకు, పశ్చిమగోదావరి జిల్లా

మాటల గారడీనే సంక్షేమం అనడం న్యాయమేనా చంద్రబాబూ?!
సంక్షేమం, సాధికారత అంటూ చంద్రబాబు పెద్దపెద్ద మాటలు చెబుతుంటే నవ్వొస్తోంది. ఆయన అబద్ధాలు, మోసాలకు బలైన బాధితులు ఎంతోమంది పాదయాత్రలో నన్ను రోజూ కలుస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో నరకప్రాయమైన పరిస్థితులను చెబుతున్నారు. ఊరూ వాడా ఇదే దుస్థితి. మొన్న.. నిన్న.. నేడు.. ప్రతి రోజూ చంద్రబాబు పాలనలో నష్టపోయిన జనం కన్నీటి గాథలే నా ముందుకొచ్చాయి.

70 ఏళ్ల అవ్వ వెంకటలక్ష్మి ఆవేదనకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఆ వయసులోనూ కూలికెళితే తప్ప పూటగడవడం లేదట ఆ తల్లికి. పింఛన్‌ ఇచ్చి కాస్తన్నా కనికరించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని బావురుమంది. ఏడ్చేందుకు కూడా ఆ అవ్వ కళ్లల్లో నీళ్లే కరవయ్యాయి. ఓపికంతా కూడదీసుకుని ‘నువ్వొచ్చాకన్నా నాకో దారి చూపు బిడ్డా’ అంటూ బతిమాలింది. జాలేసింది.. బాధేసింది. ఆ అవ్వను దగ్గరకు తీసుకుని భరోసా ఇచ్చాను.

‘పాలించే వాళ్లు పసిబిడ్డలనూ మోసం చేస్తారా?’ వేల్పూరుకు చెందిన ఊబ నర్సయ్య అనుమానంగా, ఆశ్చర్యంగా అడిగిన ప్రశ్న ఇది. తనకు మనవరాలు పుట్టినప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే బంగారు తల్లి పథకం కింద నమోదు చేసుకుని.. కలెక్టర్‌ ధ్రువపత్రం కూడా ఇచ్చారట. ఆ డబ్బునూ ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదట. గత ప్రభుత్వం జమ చేసిన సొమ్మును కూడా ఇవ్వకుండా ఆపేసిన చంద్రబాబును నిలదీయండి సారూ.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. సరిగా అమలు కాని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం మిగిల్చిన కన్నీటి వెతలను విద్యార్థులు వినిపించారు. దివ్యాంగుడి పట్ల కూడా ఈ సర్కారుకు జాలి లేదన్నా.. ప్రతి సంక్షేమ పథకానికీ టీడీపీ నేతలు అడ్డుపడుతున్నా రు.. అని చదలవాడ నవీన్‌కుమార్‌ చెప్పాడు. 

‘గత నెలలోనే చిన్న పిల్లలపై నాలుగు అత్యాచార కేసులు నమోదయ్యాయి. రాజధాని నగరంలోనే వెలుగుచూసిన కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ దేనికి సంకేతం? ఈ పాలనలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేదన్నా’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది లక్ష్మీదుర్గ. వేల్పూరు దగ్గర కలిసిన నాగమణి.. ‘అప్పు కట్టాలంటూ బ్యాంకోళ్లు వేధిస్తున్నారన్నా.. ఇంటికి తాళం వేస్తామంటూ బెదిరిస్తున్నారు’ అని కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లి కానుకగా రూ.50 వేలు ఇస్తానని మమ్మల్నీ మోసం చేశాడని మైనార్టీ సోదరుడు మహ్మద్‌ నజీబ్‌పాషా తణుకు దగ్గర నాతో చెప్పాడు. 

నాన్నగారి పాలనలో జరిగిన మంచిని ప్రతి ఒక్కరూ గుర్తుచేస్తున్నారు. ఎంతోమందికి పునర్జన్మ ప్రసాదించిన ఆరోగ్యశ్రీ గురించి చెబుతున్నారు. పేదవాడి బతుకు చిత్రాన్నే మార్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకొంటున్నారు. వడ్డీలేని రుణాలు.. పావలా వడ్డీకే రుణాలు.. బ్యాంకులనే భరోసాగా మార్చిన గొప్ప మనసు ఆయనదని రైతన్నలు, అక్కచెల్లెమ్మలు అడుగడుగునా చెబుతుంటే ఆనందమేసింది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేదలందరి బాగోగులే లక్ష్యంగా పథకాలు తీసుకొచ్చిన వైనాన్ని పదేపదే గుర్తుచేస్తున్నారు. కోట్లాది ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారంటే.. ఆయన చేసిన మంచి పనులే కారణం. సంక్షేమం అంటే అది. సంక్షేమ పాలన అంటే దివంగత మహానేత నాన్నగారిది.. ఆయనకు, మీకూ ఎక్కడన్నా పోలిక ఉందా? మాటల గారడీనే సంక్షేమమని అనడం న్యాయమేనా చంద్రబాబూ?! 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ రోజు మీ నవ నిర్మాణ దీక్షలో సాధికారత, సంక్షేమం అంటూ గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు. స్వయం సహాయక సంఘాల వెన్ను విరవడమేనా మీ సాధికారత? రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేయడమేనా మీకు తెలిసిన సాధికారత? అవ్వాతాతలకు, దివ్యాంగు లకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా ఏడిపించుకుతినడమేనా మీ పాలనలో సాగుతున్న సంక్షేమం? చంద్రన్న బీమా పేరుతో కార్మికుల నిధులు మళ్లించడమూ సంక్షేమమేనా? పేదల ఇళ్లలో కూడా ముడుపులు మింగడమేనా సంక్షేమమంటే? పేదల ప్రాణాలు కాపాడే వైద్య సేవలనూ బలహీనపర్చిన మిమ్మల్ని ఏమనాలి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. ఏ వర్గాన్ని, ఏ కులాన్నీ కదిపినా.. నాలుగేళ్ల పాలన ఒరగబెట్టిందేమీ లేదని చెబుతున్నారే! సంక్షేమం, సాధికారత వంటి పదాలను ఉచ్ఛరించే అర్హతైనా మీకుందా?
-వైఎస్‌ జగన్‌

మరిన్ని వార్తలు