కోవిడ్‌ 19 @19

21 May, 2020 13:31 IST|Sakshi
ఎస్‌.కోటలోని క్వారంటైన్‌ కేంద్రం

విజయనగరంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా బాధితులు

ఒకేరోజు పదకొండు పాజిటివ్‌ కేసులు నమోదు

అదృష్టవశాత్తూ వారి కాంటాక్టులు 94 మందికి నెగిటివ్‌

వ్యాధి బారిన పడ్డవారంతా వలస కార్మికులు

చెన్నై, హైదరాబాద్, నెల్లూరు, తూ.గోదావరి జిల్లాల నుంచి వచ్చినవారే...

కేసులు 19కి చేరడంతో మరింత అప్రమత్తమైన అధికారులు

సాక్షిప్రతినిధి, విజయనగరం: నలభై ఐదు రోజులు రాష్ట్రంలోనే ఏకైక గ్రీన్‌ జోన్‌ జిల్లాగా ఉన్న విజయనగరంలో కరోనా కేసులు ఒక్క సారిగా పెరిగిపోతున్నాయి. వలస పక్షులు మోసుకొచ్చిన వైరస్‌ కారణంగా జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19కి చేరింది. వీటిలో ఒకరు మరణించగా, నలుగురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. శృంగవరపుకోట క్వారంటైన్‌ సెంటర్‌లో పాజిటివ్‌గా తేలిన 11 మందితో పాటు మొత్తం 14 మంది కోవిడ్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

అధికారుల అప్రమత్తం
ఒక్కసారిగా జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా తేలిన పదకొండు మందీ వలస కార్మికులే.  ముగ్గురు విజయవాడ నుంచి, ఇద్దరు చెన్నై కోయంబేడ్‌మార్కెట్‌ నుంచి, ఇద్దరు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి, ముగ్గురు నెల్లూరు జిల్లా నెల్లూరు, గూడూరు నుంచి, ఒకరు హైదరాబాద్‌ నుంచి ఈ నెల 12వ తేదీన
వచ్చారు. వీరు కాలినడకన జిల్లాలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా సరిహద్దుల్లో పోలీసులుఅడ్డుకుని ఎస్‌కోట క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. వీరంతా జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, మక్కువ, బాడంగి, మెంటాడ, గరివిడి, బొబ్బిలి మండలాల్లోని గ్రామాలకు చెందిన వారు. ఈ పదకొండు మందితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ కలిగిన 94 మందికి పరీక్షలు జరి పారు. అదృష్ట వశాత్తూ వారిలో ఎవరికీ పాజిటివ్‌ రాలేదు. అందరికీ నెగెటివ్‌ రావడంతో అధికారులు కొంత ఊపిరిపీల్చుకున్నారు. 

బాధితులను మిమ్స్‌కు తరలింపు
కరోనా బారిన పడిన వారందరినీ జిల్లా కోవిడ్‌ అస్పత్రిగా గుర్తింపు పొందిన మిమ్స్‌ కోవిడ్‌ 19 ఆస్పత్రికి తరలించారు. కరోనా నియంత్రణకు ఇప్పటికే జిల్లా అధికారులు రూపొందించిన మూతికి మూడు, చేతికి మూడు, కాలికి ఒకటి చొప్పున ఏడు వ్యూహాలతో పాటు సీఎం సూచించిన మూడు వ్యూహాలను కలిపి మొత్తం పది వ్యూహాలను అమలు చేస్తున్నారు. తమలో కరోనా లక్షణాలు కనిపించిన వ్యక్తులు స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వచ్చేలా చైతన్యపరచాలని, వ్యాధి సోకిన వారిపై వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని, కరోనా కట్టడికి పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం చెప్పిన అంశాలను అమలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

టెన్‌ కమాండ్‌మెంట్స్‌ వ్యూహం
కరోనా నియంత్రణకు టెన్‌ కమాండ్‌మెంట్స్‌ పాటించాలని అధికారులను ఆదేశించాం. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఇప్పటికే జిల్లాలో ఏడుసూత్రాలకు,  అదనంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన మూడు ఆదేశాలను జోడించి, టెన్‌ కమాండ్‌మెంట్స్‌ను రూపొందించాం. ‘కోవిడ్‌కు మందులేదు, నివారణ ఒక్కటే మార్గం’ అనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నాం. ఇంతవరకూ జిల్లాలో కోవిడ్‌ బారిన పడిన వారిలో ఒకరు మినహా మిగతావారంతా బయటి నుంచి వచ్చిన వలస కార్మికులే. వారంతా క్వారంటైన్‌లో ఉండగానే పాజిటివ్‌గా తేలడంతో గ్రామాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించగలిగాం. అతి తక్కువ సమయంలోనే నలుగురు పాజిటివ్‌లను నెగెటివ్‌గా మార్చి వారి ఇళ్లకు పంపించగలిగాం. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.– డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లా కలెక్టర్‌ 

మరిన్ని వార్తలు